భలే వాడేశావ్ బాస్..!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఉంది అధికార పార్టీ తీరు. తునికి లక్షల మంది కాపులు వెళ్తున్నారని తెలిసినప్పటికీ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా అంతా జరిగిపోయాక పిల్లకాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ అంటూ పాత పాటే పాడుతోంది అధికార పార్టీ. తప్పంతా ప్రభుత్వం వైపు పెట్టుకుని అధికార పార్టీ నేతలు, చివరకు చంద్రబాబు కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కాసింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. గర్జన సభకు వెళ్లింది కాపులు. రైలు పట్టాలను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది కాపునేత ముద్రగడ. లక్షలాది […]
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఉంది అధికార పార్టీ తీరు. తునికి లక్షల మంది కాపులు వెళ్తున్నారని తెలిసినప్పటికీ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా అంతా జరిగిపోయాక పిల్లకాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ అంటూ పాత పాటే పాడుతోంది అధికార పార్టీ. తప్పంతా ప్రభుత్వం వైపు పెట్టుకుని అధికార పార్టీ నేతలు, చివరకు చంద్రబాబు కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కాసింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. గర్జన సభకు వెళ్లింది కాపులు. రైలు పట్టాలను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది కాపునేత ముద్రగడ. లక్షలాది మంది పట్టాలపై వెళ్తే అంతా గాంధీల్లా ఉండరు. కొందరు యువకులు రైలు తగలబెట్టారు. పోలీసులపై దాడులుచేశారు. స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఇందంతా అప్పటికప్పుడు జరిగిపోయిన దురుదృష్టకర పరిణామం. కానీ ఇంత జరిగిన తర్వాత టీడీపీ కాపు నేతలంతా ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశం పెట్టి జగన్‌పై పడ్డారు.
చంద్రబాబు కూడా అదే పాట పాడారు. అయితే ఇలా జగన్ మీదకు అధికార పక్షం దూకడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. రైలు తగలబెట్టి ఆందోళన చేసింది కడుపుమండిన కాపు యువకులు. కానీ ఆ విషయంలో వారిని తప్పుపట్టినా, చర్యలకు దిగినా వారు టీడీపీపై మరింత కోపం పెంచుకుంటారు. టీడీపీ ఖాతాలో కాపు ఓటు బ్యాంకు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది.. అందుకే తెలివిగా బాబుగారి బ్యాచ్ జగన్‌ను రంగంలోకి లాగింది. ఉత్తరానికి తిరిగి దక్షణం దిక్కును తిట్టినట్టు గొడవ చేసిన కాపులను తిట్టలేక వైసీపీ, కాంగ్రెస్‌లను తిట్టడం అనే ఎత్తుగడ భలేగా ప్రయోగించారు. మొత్తం ఘటన పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కొన్ని తప్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
1. లక్షలాది మంది జనం ఒక చోట చేరితే ఏం జరుగుతుందో గుర్తించలేనంత బలహీనంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడుస్తోందా?
2. కాపులు ఆందోళనకు దిగే అవకాశం ఇచ్చింది కూడా ప్రభుత్వం కాదా!. ఎందుకంటే అధికారంలోకి రాగానే ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయించి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇచ్చింది వంద కోట్లే. ఎన్నికల సమయంలో చెప్పినట్టు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే కాపులెందుకు ఆందోళన చేస్తారు?. పైగా డబ్బుల్లేక కాపు కార్పొరేషన్‌కు వంద కోట్లు మాత్రమే కేటాయించామని చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. గోదావరి పుష్కరాల పేరుతో సెట్టింగ్‌లు వేసి 16 వందల కోట్లు నీటి పాలు చేసే బదులు అదేదో జనం కోసం వాడి ఉంటే సరిపోయేదిగా?
3. ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. కానీ రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఇంత వరకు ఎందుకు ముందడుగు వేయలేదు?. కాపు గర్జన సభకు పిలుపునిచ్చిన తర్వాత హడావుడిగా కాపు కమిషన్ ఏర్పాటు చేసింది నిజం కాదా?.
4. వైసీపీ, కాంగ్రెస్ నేతలు కాపు గర్జనకు మద్దతు తెలిపి ఇదంతా చేయించారని టీడీపీ కాపు నేతలు విమర్శిస్తున్నారు. మరి కాపు సభను బహిరంగంగా టీడీపీ నేతలెందుకు వ్యతిరేకించలేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దానికి అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పగలరా?.
5. అవసరానికి తగ్గట్టు వేసే రాజకీయ ఎత్తుగడలను ప్రతిసారి నమ్మి జనం మోసపోతారన్న మొండి సిద్ధాంతంతో కాపుల సభను ప్రభుత్వం తక్కువ అంచనా వేయడంతోనే ఇదంతా జరిగింది. కానీ ఈ విషయాలన్నీ దాచి పెట్టి మేజారిటీ మీడియా డబ్బాలను అడ్డుపెట్టుకుని ప్రతిదానికి కారణం జగన్ కాంగ్రెస్, తల్లికాంగ్రెస్ అని ఎన్ని రోజులు కాకమ్మ కథలు చెప్పగలరు?. ఇప్పటికైనా నిజాయితీగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ మరో కులాల కురుక్షేత్రం కాకుండా ఉంటుంది.
Click on Image to Read: