పుణ్య స్నానాలతో పుణ్యనది బలి
అయ్యప్ప భక్తులు పుణ్యనదిగా స్నానాలను ఆచరించే పంపానది, మనిషికి రోగాలు తెచ్చిపెట్టే కాలుష్యంతో కునారిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా శబరిమలకు వస్తున్న అయ్యప్పభక్తులు పంపానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే ఆ నది ఇప్పుడు కాలుష్యం విషయంలో పరిమితులను దాటేసి, దాంట్లో మునిగే భక్తులకే కాదు, ఆ చుట్టుపక్కల నివసిస్తున్న గ్రామాల వారికి సైతం హానికరంగా మారింది. ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో ఈ కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటుంది. నదీతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న యాభైలక్షల మంది జనాభాకే కాదు, నదికి సమీపంలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వు ప్రాంతాలకు […]
అయ్యప్ప భక్తులు పుణ్యనదిగా స్నానాలను ఆచరించే పంపానది, మనిషికి రోగాలు తెచ్చిపెట్టే కాలుష్యంతో కునారిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా శబరిమలకు వస్తున్న అయ్యప్పభక్తులు పంపానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే ఆ నది ఇప్పుడు కాలుష్యం విషయంలో పరిమితులను దాటేసి, దాంట్లో మునిగే భక్తులకే కాదు, ఆ చుట్టుపక్కల నివసిస్తున్న గ్రామాల వారికి సైతం హానికరంగా మారింది. ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో ఈ కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటుంది. నదీతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న యాభైలక్షల మంది జనాభాకే కాదు, నదికి సమీపంలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వు ప్రాంతాలకు కూడా ఈ నది కారణంగా ఎంతగానో నష్టం వాటిల్లుతున్నట్టుగా కేరళ స్టేట్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు శబరిమలలోనూ, పంపానది తీర ప్రాంతాల్లోనూ పెరిగిపోతున్న కాలుష్యంపై పరిశీలన అధ్యయనం, పర్యవేక్షణ నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పంపానది కాలుష్యాన్ని నివారించాల్సిన అధికారుల నిర్లక్ష్యం నేరంగా పరిగణించాల్సిన స్థాయిలో ఉందని ఈ బోర్డు పేర్కొంది. కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న వివరాల ప్రకారం, భక్తులు స్నానం ఆచరించే నీటిలో కొలిఫామ్ అనే బ్యాక్టీరియా 100 మిల్లీలీటర్ల నీటికి 500లను మించి ఉండకూడదు. కానీ ప్రస్తుతం పంపానదిలో ఈ బ్యాక్టిరియా ఎంత ఉందంటే…ప్రతి 100 మిల్లీ లీటర్ల నీటికి 5,50,000. అంటే ఉండాల్సిన పరిమితి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అయ్యప్ప సన్నిధానం నుండి చెత్తాచెదారాన్ని మోసుకొచ్చే జునంగర్ కాలువ వద్ద, మకర సంక్రాంతి రోజున ఈ బ్యాక్టీరియా స్థాయి మరింత ఎక్కువగా 5,70,000గా ఉంది.
బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా మామూలు రోజుల్లోనే కొలిఫామ్ బ్యాక్టీరియా కౌంట్ ఈ ప్రాంతాల్లో 4లక్షల60 వేల నుండి 4 లక్షల 80వేల వరకు ఉంటుందని, ఇక పొల్యుషన్ బోర్డు జనవరి 13, 14, 16 తేదీల్లో కాలుష్య గణన చేయడం వలన అది మరింత ఎక్కువగా ఉందని జిల్లా పర్యావరణ ఇంజినీర్ పాలస్ ఈపెన్ అన్నారు. 1997లో పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, పంపానది కాలుష్యాన్ని పరిశీలించినపుడు ప్రతి 100 మిల్లీ లీటర్ల నీటికి 96,000 కొలిఫామ్ బ్యాక్టీరియా ఉంది. అప్పట్లోనే కేరళ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులకు వ్యతిరేకంగా దీనిపై సూమోటో కేసుని స్వీకరించింది. కోర్టు, దేవస్థానం బోర్డుకి ఈ దిశగా కఠిన ఆదేశాలు ఇచ్చింది. ఇది జరిగి 19 సంవత్సరాలు కావొస్తుండగా, పదిహేనేళ్ల క్రితం, దేవస్థానం బోర్డు మురికినీటిని శుద్ధిచేసే ఒక రసాయన ప్లాంటుని ఏర్పాటు చేసింది. అయితే గత అయిదు సంవత్సరాలుగా ఆ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదు. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
శబరిమల మాస్టర్ ప్లాన్‌ని నియమిత కాల వ్యవధిలో పూర్తి చేసి ఈ విపరీత పరిస్థితులను అత్యంత వేగంగా చక్కదిద్దాలని పంపానది పరిరక్షణ సమితి (పిఎస్ఎస్) ప్రభుత్వాన్ని కోరుతోంది. గత పదిహేను సంవత్సరాలుగా ఎన్ని చర్యలు తీసుకున్నా పంపానది కాలుష్యాన్ని అదుపుచేయలేకపోతున్నారని, అందుకే అత్యవసరంగా దీనిపై పర్యావరణ ఆడిట్ నిర్వహించాలని పిఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఎన్‌కె సుకుమారన్ నాయర్ ప్రభుత్వాన్ని కోరారు.