లైఫ్ ఈజ్... ఏ బ్యాలన్సింగ్ ఆర్ట్!
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ఆర్మీలో భాగమైన కార్ప్ ఆఫ్ సిగ్నల్స్ మోటర్‌సైకిల్ రైడర్ డిస్‌ప్లే టీమ్ (డేర్ డెవిల్స్) ప్రదర్శించిన మోటర్‌సైకిల్ ఫీట్లు నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రెప్పపాటు కాలం ఆదమరచినా, ఒక్క అంగుళం దూరం పెరిగినా తగ్గినా, ఒక్క చిన్న తొట్రుపాటుకి గురయినా… వీటిలో ఏది సంభవించినా ఆ విన్యాసం అపహాస్యం పాలవుతుంది. ఆ అమరిక చెల్లాచెదురవుతుంది. అత్యంత సమర్ధవంతమైన సమన్వయ విన్యాసం అది. పర్‌ఫెక్ట్ సాధనకు పరాకాష్ట అది. నూరుశాతం ఖచ్ఛితత్వంతో […]
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ఆర్మీలో భాగమైన కార్ప్ ఆఫ్ సిగ్నల్స్ మోటర్‌సైకిల్ రైడర్ డిస్‌ప్లే టీమ్ (డేర్ డెవిల్స్) ప్రదర్శించిన మోటర్‌సైకిల్ ఫీట్లు నిజంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రెప్పపాటు కాలం ఆదమరచినా, ఒక్క అంగుళం దూరం పెరిగినా తగ్గినా, ఒక్క చిన్న తొట్రుపాటుకి గురయినా… వీటిలో ఏది సంభవించినా ఆ విన్యాసం అపహాస్యం పాలవుతుంది. ఆ అమరిక చెల్లాచెదురవుతుంది. అత్యంత సమర్ధవంతమైన సమన్వయ విన్యాసం అది. పర్‌ఫెక్ట్ సాధనకు పరాకాష్ట అది. నూరుశాతం ఖచ్ఛితత్వంతో కూడిన బ్యాలన్సింగ్ ఆర్ట్ అది. మన జీవితమూ ఇలాంటి బ్యాలన్సింగ్ ఆర్టే. అవును ప్రతి క్షణం, ప్రతిచోటా ఓ బ్యాలన్సింగ్ ఆర్ట్ ఉంది. మనమే దాన్ని చూడలేకపోతున్నాం. మన జీవితమంతా అలాంటి సహజమైన అమరిక ఉంది, సహజమైన సమన్వయం ఉంది. దాన్ని కళ్లతో చూడలేకపోయినా బుద్ధితో తెలుసుకోవాలి, మనసుతో అనుభూతి చెందాలి….ఆచరణలో పెట్టాలి. అప్పుడే జీవితమనే బ్యాలన్సింగ్ యాక్ట్, ఆర్ట్‌లో మనం నిష్ణాతులమవుతాం. ఏ మాత్రం బ్యాలన్స్ లేకపోయినా కుప్పకూలిపోయే మన జీవన విన్యాసాలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందామా-
- తల్లిదండ్రులు అతి ప్రేమతో పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తూ, జీవితం పట్ల వారికున్న బాధ్యతలను గుర్తు చేయకపోతే, ఇచ్చిన ప్రేమను బ్యాలన్స్ చేసేంత తిరుగు ప్రేమని వారినుండి పొందలేరు. తీసుకోవడమే కాదు…ఏదో ఒకరూపంలో తిరిగి ఇవ్వడం అనేది ఒకటుందని పిల్లలకు చెప్పకపోతే అక్కడ బ్యాలన్సింగ్ ఆర్ట్ కుప్పకూలి అనుబంధాలు బీటలు వారిపోతాయి. వృద్ధాశ్రమాలు వెలుస్తాయి.
- జీవ వైవిద్యం అనేది ప్రకృతి లోని ఒక చక్కని బ్యాలన్సింగ్ ఆర్ట్. పక్షులు, జంతువులు, భిన్నరకాల క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఈ భూమిపై బతకగలిగితేనే మనజీవితాలు సైతం సక్రమంగా సాగుతాయి. జీవులన్నీ పరస్పర ఆధారితాలై జీవిస్తాయి. అది ప్రకృతి ధర్మం. అలాగే నేల, నీరు, భూమి, ఆకాశం వీటన్నింటినీ సరిగ్గా వినియోగించుకోలేకపోతే కాలుష్యం పెరిగిపోయి మనకు కావలసిన ఆక్సిజన్ కంటే విషపూరిత వాయువులు ఎక్కువై పోతాయి. చివరికి మన మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం.
- పగలు తరువాత రాత్రి, రాత్రి తరువాత పగలు రాకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. విశ్వాంతరాళాల్లో గ్రహాలు సక్రమంగా వాటి వాటి కక్ష్యల్లో బ్యాలన్స్డ్‌గా తిరగకపోతే కింద మన బ్యాలన్స్ జీవితం హుష్ కాకీ అయిపోతుంది.
- జీవితంలో కష్టం, సుఖం ఇవి రెండూ అత్యంత ప్రభావవంతంగా బ్యాలన్సింగ్‌గా ఉంటాయి, ఉండాలి. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా జీవితంలో సమన్వయం లోపిస్తుంది. కష్టాలు ఎక్కువైతే వచ్చే మానసిక శారీరక సమస్యలు ఎన్నివుంటాయో, ఏ కష్టాలూ లేనపుడు, సుఖాలు ఎక్కువైతే వచ్చే వ్యసనాలు, అనవసర ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు అన్నే ఉంటాయి.
- ప్రపంచంలోని మొత్తం సంపదలో సగం కేవలం 62మంది ఐశ్వర్యవంతుల వద్ద ఉంది. అంటే మిగిలిన జనాభా మొత్తం వద్ద ఉన్న సంపద ఒకవైపు ఉంచి, ఆ 62మంది దగ్గర ఉన్న సంపద ఒక వైపు ఉంచితే తూకం సరిపోతుందన్నమాట. ఇది ఎంతటి అన్‌బ్యాలన్సింగ్ యాక్టో వేరుగా చెప్పేదేముంది.
- ఇంట్లో తినేవారు ఎక్కువ, సంపాదించేవారు తక్కువ అయితే ఆ ఇంటి ఆర్థిక స్థితి బ్యాలన్స్ కోల్పోతుంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి మనదేశంలో బాగా ఉండేది. మహిళలు సంపాదించడం మొదలుపెట్టాక, కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాక, హరిత విప్లవాలు, పారిశ్రామిక విప్లవాలు, గ్లోబలైజేషన్ తదితర మార్పుల తరువాత తినేవారు, సంపాదించేవారి సంఖ్యలు బ్యాలన్స్ అయ్యాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపించిన ఈ సమస్య చక్కబడింది.
- పల్లెలు, పట్టణాలు నాణేనికి భిన్న పార్వ్యాలు. పట్టణాలు, నగరాలను అభివృద్ధి పరచుకుంటూ పోతూ, పల్లెలను పట్టించుకోకపోతే ఏమవుతుందో మనం కళ్లారా చూస్తున్నాం. పచ్చగా ఉండాల్సిన పల్లెలు పంటలు పండక, కనీస సౌకర్యాలు, ఉపాధి లేక విలవిల్లాడుతున్నాయి, రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నగరాలు రద్దీతో మురికివాడలతో, అనారోగ్యాలతో, నేరాలతో, కాలుష్యంతో సతమతమవుతున్నాయి.
- మన శరీరంలో రెండూ కళ్లు, రెండు కాళ్లు, రెండు చేతులు, మెదడులోని కుడి ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేయాలి. అప్పుడే మన జీవితం సవ్యంగా ఉంటుంది.
- కోపం, ద్వేషం, ప్రేమ, ఈర్ష్య అసూయలు ఇవన్నీ మనిషి నిత్యజీవితంలో అనుభవించే భావోద్వేగాలు. కూరలో ఉప్పు కారాల్లా ఇవి సమపాళ్లలో లేకపోతే మనం మనుషుల్లా కాదు, వింత జీవుల్లా మారిపోతాం. మితిమీరిన ప్రేమ ఎంత విషంగా మారిపోతున్నదో ఎన్నో సందర్భాల్లో రుజువైంది కదా.
- పది అడుగుల పొడవు వెడల్పున్న గదిలో పదిమంది సౌకర్యంగా బతకలేరు. అలాగే భూమి ఎంత ఉందో దాన్ని బట్టే జనాభా ఉండాలి. భూమికి జనాభాకి సమన్వయం లేకపోతే సమస్యలే.
- ఇంకా ఇలాంటి బ్యాలన్సింగ్ యాక్ట్‌లు, ఆర్ట్‌ల గురించి చెప్పుకోవాలంటే…శారీరక శ్రమ ఆహారం ఈ రెండూ బ్యాలన్స్ కాకపోతే ఒబేసిటీ…. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా వచ్చే సమస్యలు… ఆహారంలో పీచు తక్కువై కొవ్వు, తీపి ఎక్కువైతే వచ్చే అనారోగ్యాలు… పిల్లలకు స్వేచ్ఛ మరీ ఎక్కువైతే అది దుర్వినియోగం కావడం, మరీ తక్కువైతే ఆత్మవిశ్వాసం లోపించడం… శుభ్రత పాటించకపోతే రోగాలు రావడం, అతిగా పాటిస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అదొక మానసిక జాడ్యంలా మారడం… అన్నింటికీ మించి స్త్రీ పురుష జీవన క్రమంలో ఉండాల్సిన బ్యాలన్సింగ్ యాక్ట్ లేకపోవడం వలన వచ్చిన అనేక రకాల సామాజిక రుగ్మతలను మనమిప్పుడు అనుభవిస్తున్నాం.
- నిశితంగా గమనిస్తే జీవితంలో అణువణువునా ఈ బ్యాలన్సింగ్ ఆర్ట్ కనబడుతుంది. ఇంత స్పష్టంగా ప్రకృతి మన జీవితాన్ని సుఖమయం చేసే అంశాలను గురించి చెబుతుంటే మనమే పట్టించుకోవడం లేదు మరి.
-వడ్లమూడి దుర్గాంబ