ఆ బెంగాలీ నటి...తన బంగారు మనసుని చాటింది..!
మద్యం తాగిన మత్తులో కారు నడిపి, యాక్సిడెంట్ చేసి, ఓ వ్యక్తిని తీవ్రగాయాల పాలు చేసిన ఇద్దరు వ్యక్తులకు ఓ బెంగాలీ నటి తగిన బుద్ది చెప్పింది. సాటి మనిషి పట్ల తనకున్న బాధ్యతని నెరవేర్చి శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళితే- బెంగాలీ నటి మిమి చక్రవర్తి ఇటీవల ఓ రోజు కోల్‌కతాలోని టెగోరియా ప్రాంతంలో విఐపి రోడ్డులో కారులో ప్రయాణం చేస్తోంది. ఓ ఇండికా కారు వచ్చి ఓ మోటార్ సైకిల్‌ని ఢీకొట్టి స్పీడ్‌గా వెళ్లిపోవడం […]
మద్యం తాగిన మత్తులో కారు నడిపి, యాక్సిడెంట్ చేసి, ఓ వ్యక్తిని తీవ్రగాయాల పాలు చేసిన ఇద్దరు వ్యక్తులకు ఓ బెంగాలీ నటి తగిన బుద్ది చెప్పింది. సాటి మనిషి పట్ల తనకున్న బాధ్యతని నెరవేర్చి శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళితే-
బెంగాలీ నటి మిమి చక్రవర్తి ఇటీవల ఓ రోజు కోల్‌కతాలోని టెగోరియా ప్రాంతంలో విఐపి రోడ్డులో కారులో ప్రయాణం చేస్తోంది. ఓ ఇండికా కారు వచ్చి ఓ మోటార్ సైకిల్‌ని ఢీకొట్టి స్పీడ్‌గా వెళ్లిపోవడం ఆమె గుర్తించింది. మోటార్ సైకిల్‌ని ఢీకొట్టిన కారు, వెహికల్‌లో ఇరుక్కుని పోయిన బాధితుడిని అలాగే లాక్కుని పోయింది. అయినా డ్రైవింగ్ చేస్తున్నవ్యక్తి కారుని ఆపలేదు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు చాలా వేగంగా కారుని నడిపించాడు. ఇదంతా చూసిన మిమి తన స్కార్పియో కారులో వారిని వెంబడించింది. కారు ఆగాక లైసెన్సు ప్లేటు మీదున్న నెంబరుని, ఆ వ్యక్తులను ఫొటోలు తీసింది. పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన రాకేష్ అగర్వాల్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చేసింది. అతని భార్యకు కూడా విషయం తెలిసేలా చేసింది. బెంగాలీ చిత్ర నిర్మాత రాజ్ చక్రవర్తి కూడా విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చి అవసరమైన సహాయం చేశారు.
అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం బాధితుడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు వచ్చేవరకు కారులో ఉన్నవారు పారిపోకుండా, మిమి సంరక్షకులు కారు తాళం చెవులు తీసేసుకున్నారు. కారులో ఉన్న రాజు బందోపాధ్యాయ్, బ్రిజ్ బందోపాధ్యాయ్ అనే ఆ ఇద్దరు తాగుబోతు వ్యక్తులు తప్పించుకుని పోకుండా ఆపారు. ఆనంద బజార్ అనే పత్రికతో ఈ వివరాలు వెల్లడించిన మిమి, ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చి కూడా వాళ్లిద్దరూ అదొక చిన్న పొరబాటని చెప్పారని, అది తనని ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొంది. కారుని నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, బాధితుడు హెల్మెట్ ధరించి ఉన్నాడని, అతను జాగ్రత్తగా డ్రైవ్ చేసినా ఇతరుల నిర్లక్ష్యం వలన అంతగా గాయాల పాలవడం బాధాకరమని మిమి ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రమాదం జరిగిన రోడ్డుమీద జనం బాగా తిరుగుతున్నా ఎవరూ స్పందించలేదని, బాధితుడికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదని, అయితే వారంతా తన ఫొటోలు తీసుకోవడంలో మాత్రం ఎంతో ఆసక్తిని చూపించారని ఆమె వాపోయింది.