ఇంట్లోనూ... కాలుష్యం కోరలు!
ఈ మధ్యకాలంలో మనం వాతావరణ కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. పరిస్థితులు అలా ఉన్నాయి మరి. ఊరికే రోడ్డుమీద నడిచి వెళ్లినా, వాహనంలో వెళ్లినా గాల్లోని కాలుష్యం వలన రోగాలు వచ్చిపడేంతగా అది మన జీవితాల్లో పెనవేసుకుని ఉంది. అయితే రోడ్డుమీదకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఫరవాలేదా…ఎలాంటి వాతావరణ కాలుష్యం మనల్ని అంటకుండా ఉంటుందా… అనే ప్రశ్న వేసుకుంటే అవును… అని గట్టిగా సమాధానం చెప్పలేము. సురక్షితంగా ఇంట్లోనే ఉన్నాం…అనుకునేవారు సైతం గాల్లోని కాలుష్యం బారిన పడతారని […]
ఈ మధ్యకాలంలో మనం వాతావరణ కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. పరిస్థితులు అలా ఉన్నాయి మరి. ఊరికే రోడ్డుమీద నడిచి వెళ్లినా, వాహనంలో వెళ్లినా గాల్లోని కాలుష్యం వలన రోగాలు వచ్చిపడేంతగా అది మన జీవితాల్లో పెనవేసుకుని ఉంది. అయితే రోడ్డుమీదకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఫరవాలేదా…ఎలాంటి వాతావరణ కాలుష్యం మనల్ని అంటకుండా ఉంటుందా… అనే ప్రశ్న వేసుకుంటే అవును… అని గట్టిగా సమాధానం చెప్పలేము. సురక్షితంగా ఇంట్లోనే ఉన్నాం…అనుకునేవారు సైతం గాల్లోని కాలుష్యం బారిన పడతారని వెల్లడించే నిజాలు, కాలుష్యం నుండి తప్పించుకునే కొన్ని మార్గాలు ఇవి-
మనం నిద్రించే పరుపులు దుప్పట్ల నుండి, పిల్లల దుస్తుల వరకు వీటన్నింటిలో హానికరమైన రసాయనాలు, విషవాయువులు నిలిచి ఉండే అవకాశం ఉంది. పురుగుల మందులు, జిగురు, షేవింగ్ క్రీములు, షాంపూలు, కార్పెట్లు వీటన్నింటి నుండి ఫార్మల్ డిహైడ్ అనే విషవాయువు మనకు చేరే ప్రమాదం అమితంగా ఉంది. మనం వాడే ఈ వివిధ రకాల వస్తువులను ఇన్‌ఫెక్షన్ రహితంగానూ, నిలవ ఉండేందుకు వీలుగానూ మార్చే ఈ ఫార్మల్‌డిహైడ్ రంగులేని గాఢమైన వాయువు. నిజానికి ఇది క్యాన్సర్ కారకం. సిగరెట్ పొగలో కూడా ఇది ఉంటుంది. సిగరెట్ తాగే వారికే కాదు, వారి పక్కనున్నవారికి సైతం ఇది హాని చేస్తుంది. అలాగే జుట్టు, గోళ్లకు వాడే సౌందర్య ఉత్పత్తులు, పెయింట్లలో ఉండే రసాయనాలు, ఇళ్లలో, ఆఫీసుల్లో ఉండే వుడ్ వర్క్ సామగ్రి, క్లీనింగ్ ఉత్పత్తులు, డిటర్జెంట్లు ఇవన్నీ ఇంట్లోని గాలిని కలుషితం చేస్తాయి. అయితే బయట ప్రయాణాల్లో కాలుష్యం నుండి తప్పించుకునే మార్గం మనకు లేదు కానీ ఇంట్లో మాత్రం వీలయినంత వరకు గాలిని కాలుష్యరహితంగా మార్చుకోవచ్చు. అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఇంట్లోకి వెలుతురుని రానివ్వండి
ఇంటికి తలుపులు కిటికీలు ఉన్నా వాటిని ఎప్పుడూ మూసి ఉంచడమే ఇప్పడు మనకు అలవాటుగా మారింది. బయటి నుండి దుమ్ము ధూళి, దోమలు రాకుండా మనమీ పని చేస్తుంటాం. కానీ వెలుతురు, గాలి ధారాళంగా వస్తే ఇంట్లోని తేమశాతం చాలావరకు తగ్గిపోతుంది. ఇంట్లో గాలిని కలుషితం చేసే అంశాల్లో ఈ తేమ ప్రధానమైనది. అయితే తలుపులు, కిటికీలకు పలుచని తెరలు కడితే బయటి కల్మషాలు లోపలకు రాకుండా ఉంటాయి. అలాగే వంట చేస్తున్నపుడు తలుపులు తెరచి ఉంచాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్‌ని వాడుతున్నపుడు ఈ పని తప్పకుండా చేయాలి. ఒక్క మనిషికి గ్యాస్‌స్టవ్ మీద వంట చేసినపుడు గాల్లోకి విడుదలయ్యే నైట్రోజన్ డయాక్పైడ్ అయినా మనకు హానిచేసేంత స్థాయిలో ఉంటుందని అమెరికానుండి పనిచేస్తున్న ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ చెబుతోంది. బాత్‌రూమ్ నుండి బయటకు వచ్చిన తేమ, ఆవిరి బయటకు పోవాలన్నా ఇంటికి వెంటిలేషన్ బాగా ఉండాలి.
బీస్‌వ్యాక్స్ కొవ్వొత్తులు వెలిగించండి
సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను వాడేవారు పారాఫిన్ క్యాండిల్స్‌కి బదులు బీస్‌వ్యాక్స్ కొవ్వొత్తులను వాడటం మంచిది. ఎందుకంటే పారాఫిన్ కొవ్వొత్తులను పెట్రోలియం సహ ఉత్పత్తులనుండి తయారుచేస్తారు. కనుక ఇవి ఆరోగ్యానికి హాని చేసే వాయువులను విడుదల చేస్తాయి. అదే బీస్‌వాక్స్ కొవ్వొత్తులు అయితే తేనెటీగల నుండి తయారయిన పదార్థంతో తయారుచేస్తారు కనుక ఇవి వాతావరణంలో కాలుష్యాన్ని పెంచవు. నిదానంగా వెలుగుతాయి. గాలిలోని కల్మషాలను తగ్గిస్తాయి. గాలిని శుభ్రపరచి డస్ట్ ఎలర్జీలు, ఆస్తమా లాంటి సమస్యలను నివారిస్తాయి.
సాల్ట్ ల్యాంపులు
చుట్టూ రాతి ఉప్పు మధ్యలో బల్బు వెలుగుతూ ఉండే సాల్ట్ ల్యాంపులు గాల్లో పుట్టే చాలా రకాల సూక్ష్మజీవులను అంతం చేస్తాయి. ఎలర్జీలు రాకుండా నివారిస్తాయి. బల్బు వెలుగుతున్నా, ఆపేసినా సమానమైన ప్రయోజనం ఉంటుంది.
యాక్టివేటెడ్ చార్‌కోల్ లేదా యాక్టివ్ కార్బన్
మామూలు బొగ్గుని గ్యాస్‌తో మరొకసారి మండించినపుడు బొగ్గులోపల సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. వీటినే యాక్టివేటెడ్ చార్‌కోల్ అంటారు. ఇవి గాల్లోని విషాలను పీల్చి వేస్తాయి. వెదురుతో తయారయిన బొగ్గుతో కూడా ఇలాంటి ప్రయోజనం ఉంటుంది.
ఇంకా…
- ఇంట్లో మొక్కల్ని పెంచడంతో గాల్లోని విష వాయువులను తొలగించవచ్చు అలాగే స్వచ్ఛమైన ఎసెన్షియల్ ఆయిల్స్‌ని వాడటం ద్వారా గాల్లో పుట్టే బ్యాక్టీరియాని నివారించవచ్చు.
- తలుపుకి దగ్గరగా ఉన్న కార్పెట్లను డోర్ మ్యాట్‌లను తరచుగా శుభ్రం చేయాలి. డోర్‌మ్యాట్స్ వినియోగించడం, చెప్పులు బయటే వదలడం ద్వారా ఇంట్లోకి చేరే సాధారణ విషవాయువులను 60శాతం వరకు నివారించవచ్చు.
- వస్తువులను తుడిచేందుకు పొడిబట్టని కాకుండా తడి బట్టని ఉపయోగిస్తే దుమ్ముకణాలను మనం పీల్చకుండా తప్పించుకోవచ్చు.
- ఇంట్లో పెంచే మొక్కల ఆకుల మీద దుమ్ము పడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.
- ఇంట్లో పొగతాగడాన్ని పూర్తిగా నిషేధించాలి.
- ఎయిర్ ఫ్యూరిఫయిర్స్ కొంతవరకు మాత్రమే గాల్లోని బ్యాక్టీరియాని అంతం చేయగలవని గుర్తుంచుకోండి. ఎయిర్ కండిషనర్ ద్వారా ఆస్తమా సమస్య రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తుండాలి.