కత్తిలేని సోగ్గాడి కోడి..!
రేటింగ్: 2.5/5 విడుదల తేదీ : 15 జనవరి 2016 దర్శకత్వం : కళ్యాణ్ క్రిష్ణా ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్ సంగీతం : అనూప్ రూబెన్స్ నటీనటులు : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ఒకప్పుడు పల్లెటూరు కథలతో సినిమాలు కళకళలాడేవి. క్రమేపి సినిమాల్లోంచి పల్లె మాయమైంది. కథలు నగరాల్లోంచి, విదేశాలకు వెళ్ళాయి. రైతు అనే క్యారెక్టర్ పూర్తిగా కనుమరుగైంది. అయితే సోగ్గాడే చిన్నినాయనా సినిమాపోస్టర్లు, నాగార్జున గెటప్ ఆసక్తి కలిగించాయి. రమ్యకృష్ణ కూడా ఉంది కాబట్టి […]
రేటింగ్: 2.5/5
విడుదల తేదీ : 15 జనవరి 2016
దర్శకత్వం : కళ్యాణ్ క్రిష్ణా
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి
ఒకప్పుడు పల్లెటూరు కథలతో సినిమాలు కళకళలాడేవి. క్రమేపి సినిమాల్లోంచి పల్లె మాయమైంది. కథలు నగరాల్లోంచి, విదేశాలకు వెళ్ళాయి. రైతు అనే క్యారెక్టర్ పూర్తిగా కనుమరుగైంది. అయితే సోగ్గాడే చిన్నినాయనా సినిమాపోస్టర్లు, నాగార్జున గెటప్ ఆసక్తి కలిగించాయి. రమ్యకృష్ణ కూడా ఉంది కాబట్టి ఒక చక్కటి పల్లెటూరి కుటుంబకథని చూద్దామని ప్రేక్షకులు ఆశపడ్డారు. అయితే సినిమా ప్రారంభంలోనే ఉరుములు, మెరుపులు, ఆలయంలో పెద్దపాముని చూపించేసరికి ఆశలు అడియాసలయ్యాయి. చంద్రముఖిలాగా ఆత్మలతో కూడిన సస్పెన్స్ కథేమోనని అనుమానమొచ్చింది.
కానీ నాగార్జున, లావణ్య త్రిపాఠిలు విడాకులకోసం ఇండియా వచ్చారని తెలిసి కథ కొంత కొత్త దారిలో వెళుతుందేమోనని మళ్ళీ ఆశకలిగింది. వెంటనే యమధర్మరాజు కనపడేసరికి పూర్తిగా భయమేసింది. తరువాత కథ పాములా మెలికలు తిరిగి ప్రేక్షకుల్ని కాటేసింది.
ఆధునిక జీవితంలో భార్యభర్తలు తమ ఉద్యోగాల్లో విపరీతంగా బిజీకావడం వల్ల ఇద్దరిమధ్య చిన్నచిన్న అపార్ధాలు పెరిగి విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. సరైన సమయంలో కుటుంబపెద్దలు కౌన్సిలింగ్ లేకపోవడం కూడా దీనికి కారణం. ఇదే సబ్జెక్ట్‌ని సెంటర్‌పాయింట్‌గా తీసుకుని హ్యూమరస్‌గా డీల్ చేసివుంటే ఈసినిమా కొత్తగా ఉండేది. అయితే 30 ఏళ్ళ క్రితం వచ్చిన అనేక సినిమాల స్టయిల్‌లో ఇది నడక సాగించి కుప్పకూలిపోయింది. దేవుడి నగలకోసం హత్యలు చేయడం ఇక్ష్యాకుల కాలం నాటి సబ్జెక్ట్. అనవసరంగా దాని జోలికిపోయారు.
ఇది కాకుండా చిన్ననాగార్జునకి రొమాన్స్ నేర్పించడానికి పెద్ద నాగార్జున ఆత్మ అతనిలో అప్పుడప్పుడు ప్రవేశించి కొన్ని చిలిపిపనులు చేసి మాయమవుతుంటుంది. అక్కినేని గతంలో శ్రీరామరక్ష అనే సినిమా తీసారు. ఆ కథ కూడా ఇదే.
పండగపూట చక్కెర పొంగలి వండాలనుకుని, చక్కెరకు బదులు కన్ఫ్యూజన్‌తో ఉప్పువేస్తే ఎలా ఉంటుందో అదే జరిగింది. నాగార్జున ఆత్మతో విన్యాసాలు చేయించడంతో ఆగకుండా ఆత్మానందం అనే బ్రహ్మానందంని కూడా తెరపైకి తెచ్చారు. ఇదిగాకుండా కలగాపులగంగా రొమాంటిక్ సన్నివేశాలు. పనిలో పనిగా అనుష్కకూడా కాసేపుకనిపిస్తుంది.
ఈ గోలలో అసలు కథ మరిచిపోయి సినిమా ఎటుపోతుందో మనకి అర్ధంకాదు. ఇదంతా చాలదన్నట్టు ఒక మళయాళ మాంత్రికుడొచ్చి మంత్రాలు చదివి క్లైమాక్స్‌ని రక్తి కట్టిస్తాడు. పంచెకట్టుతో నాగార్జున అందంగా కనిపించినా ఇంత స్లో కథనాన్ని భరించే శక్తి ఇప్పటి ప్రేక్షకులకి లేదు.
సినిమాలో పాటుల చాలా బావున్నాయి. చిత్రీకరణకూడా అద్భుతం. అనసూయ, హంసానందినిలతో సోగ్గాడే టైటిల్ సాంగ్ సూపర్. రమ్యకృష్ణ నటన గురించి చెబితే కొండను అద్దంలో చూపించిట్టే. నాజర్, సంపత్, బ్రహ్మాజి, ఝాన్సీ, పోసాని ఇలా చాలామంది ఉన్నారుకానీ, వాళ్ళకు నటించే అవకాశంలేదు. లావణ్యత్రిపాఠి వున్నంతలో బాగా చేసింది. కొన్నిసన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. నాగార్జున సినిమానంతా తానే మోసాడు. యముడిగా నాగబాబు కాసేపు కనిపించినా గుర్తుంటాడు.
అన్నీవున్నా బోర్ డైలాగులు, బోర్ సన్నివేశాలు, పాతచింతకాయ కథతో డైరెక్టర్ కళ్యాణ్ తప్పటడుగు వేసాడు. సినిమాల్లో ఆత్మలోపించి రసహీనమవుతున్నాయని బాధపడుతున్న సమయంలో ఏకంగా ఆత్మలనే కథలోకి తెచ్చి హింసించడం ఏం న్యాయం.
సంక్రాంతికి నాగార్జన తన కోడిపుంజుని వదిలాడుకానీ కత్తినికట్టడం మరిచిపోయాడు.
– జి ఆర్. మహర్షి
Click to Read: