శ్రీదేవి కూతురు షాకిచ్చింది!
శ్రీదేవి చిన్నకూతురు తన శరీరం గురించి నొప్పించే విధంగా కామెంట్ చేసినవారికి చాలా గట్టి సమాధానం చెప్పింది. పదిహేనేళ్ల ఖుషీ కపూర్, మరొక స్నేహితురాలితో కలిసి ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఖుషీ పొట్ట కాస్త ఎత్తుగా కనబడటంపై కామెంట్లు వచ్చాయి. వాటిపై ఖుషీ చాలా ఘాటుగా స్పందించింది. తాను తన శరీర తీరు పట్ల ఆత్మవిశ్వాసంతోనూ, ఆనందంగానూ ఉండబట్టే వాటిని పోస్ట్ చేశానంది. ఎవరి మైండ్‌లోనో ఉన్న బ్యూటీ కాన్సెప్ట్‌కి అనుగుణంగా […]
శ్రీదేవి చిన్నకూతురు తన శరీరం గురించి నొప్పించే విధంగా కామెంట్ చేసినవారికి చాలా గట్టి సమాధానం చెప్పింది. పదిహేనేళ్ల ఖుషీ కపూర్, మరొక స్నేహితురాలితో కలిసి ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఖుషీ పొట్ట కాస్త ఎత్తుగా కనబడటంపై కామెంట్లు వచ్చాయి. వాటిపై ఖుషీ చాలా ఘాటుగా స్పందించింది. తాను తన శరీర తీరు పట్ల ఆత్మవిశ్వాసంతోనూ, ఆనందంగానూ ఉండబట్టే వాటిని పోస్ట్ చేశానంది. ఎవరి మైండ్‌లోనో ఉన్న బ్యూటీ కాన్సెప్ట్‌కి అనుగుణంగా తనను తాను మార్చుకోవాల్సిన పనిలేదని చెప్పింది. కామెంట్ చేసేవారు ఇతరుల పట్ల కాస్త దయగా ఉండాలని, ప్రోత్సాహపూరితంగా ఉండాలని హితవు చెప్పింది. ఆడవాళ్లు ఇంతగా ముందుకువెళుతున్న ఈ రోజుల్లోనూ ఇలాంటి కామెంట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంది. తానా ఫొటోలను ఎవరికోసమో పోస్ట్ చేయలేదని, తన ఆలోచనలు, అందం పట్ల తాను ఆనందంగా ఉండటం వల్లనే వాటి ప్రతిబింబాలుగా వాటిని పోస్ట్ చేశానని చెప్పింది. ఇలాంటి కామెంట్లు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, లేకపోతే ఎదురుదెబ్బలు తగులుతాయని హెచ్చరించింది.
కొన్నిరోజుల ముందు పూజాబేడీ కూతురు పద్దెనిమిదేళ్ల ఆలియా ఇబ్రహీం సైతం తన ఫొటోలను విమర్శించిన వారిపై సోషల్ మీడియాలో చాలా ఘాటైన విమర్శలు చేసింది. తన శరీరంలోని స్త్రీత్వం ఒక్కటే తాను కాదని, అలాంటి గుర్తింపు తనకు అక్కర్లేదని, తనలోని చదువు, తెలివితేటలు, ఆశయాలు, లక్ష్యాలు ఇవన్నీ కలిపితే తాను అవుతానని ఆమె స్పష్టంగా చెప్పింది. తనని శరీరంగా చూడాల్సిన పనిలేదంది. ఇది సమాజానికి భయపడకుండా మనుషులు ముందుకువెళుతున్నకాలమని, తాను బికినీ ధరిస్తే తనను మరోలా చూడాల్సిన పనిలేదని, అది తన ఇష్టమని ఆలియా పేర్కొంది.
అయితే వీరు ఇంకా చిన్నపిల్లలు కనుక ఇలా అంటున్నారని, ముందు ఇలాగే అన్న పరిణితీ చోప్రా తరువాత బాలివుడ్‌లో విజయం కోసం స్లిమ్ కావాల్సి వచ్చిందని బాలివుడ్ విశ్లేషకుల మాట.
ఏదిఏమైనా ఇప్పుడున్న సామాజిక వాతావరణంలో చాలా అంశాలు కలగాపులగంగా కలిసిపోయి యువతరాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. కురచబట్టలు వేసుకోవడం ఫెమినిజమా అంటారు సంప్రదాయవాదులు. ఏ బట్టలు ధరించాలి అనేది వ్యక్తిగత హక్కు కనుక దాన్ని మేమెందుకు వదులుకోవాలనేది ఆధునిక యువతుల వాదన. స్త్రీ స్వేచ్ఛలో ఏమేం ఉండాలి…ఏమేం ఉండకూడదు అనే ప్రశ్నలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. సరైన సమాధానాలే దొరకడం లేదు మరి.
నిజానికి ఇప్పుడున్న సమాజంలో ఫెమినిజం అనే మాట చిన్నది. ప్రస్తుతం స్త్రీలూ, పురుషులూ, ఇంకా ట్రాన్స్‌జెండర్స్ అంతా ఎవరికివారు తమకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనే ఆరాటంలో ఉన్నారు. వ్యక్తి ఇప్పుడు, నేను సమాజంతో పాటు కాకుండా నా ఇష్టమైనట్టుగా నడుస్తా…కానీ సమాజం నన్ను గుర్తించి, ఆమోదించాల్సిందే అంటున్నాడు. అవకాశాలు, నైపుణ్యాలు, ఆలోచనలు విస్తృతం అవుతున్నకొద్దీ జరిగే సహజ పరిణామం ఇది…. ఇది అనివార్యం కూడా.
-వి.దుర్గాంబ