నవ్వుల ఎక్స్‌ప్రెస్
రేటింగ్: 3.5/5 విడుదల తేదీ : 14 జనవరి 2016 దర్శకత్వం : మేర్లపాకగాంధీ ప్రొడ్యూసర్ : వంశీ క్రిష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి బ్యానర్: యూవీ క్రియేషన్స్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు నటీనటులు : శర్వానంద్, సురభి, బ్రహ్మాజీ ప్రపంచంలో ఉన్న కోట్లాది జీవ జాలంలో నవ్వేశక్తి ఒక్క మనిషికే ఉంది. కానీ దాన్ని కాపాడుకోవడాన్ని మనిషి మరిచిపోతున్నాడు. నవ్వడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో నవ్వించడం మరీ కష్టం తన మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో అందర్ని నవ్వుల్లో ముంచెత్తిన మేర్లపాకగాంధీ […]
రేటింగ్: 3.5/5
విడుదల తేదీ : 14 జనవరి 2016
దర్శకత్వం : మేర్లపాకగాంధీ
ప్రొడ్యూసర్ : వంశీ క్రిష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
బ్యానర్: యూవీ క్రియేషన్స్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు : శర్వానంద్, సురభి, బ్రహ్మాజీ
ప్రపంచంలో ఉన్న కోట్లాది జీవ జాలంలో నవ్వేశక్తి ఒక్క మనిషికే ఉంది. కానీ దాన్ని కాపాడుకోవడాన్ని మనిషి మరిచిపోతున్నాడు. నవ్వడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో నవ్వించడం మరీ కష్టం తన మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో అందర్ని నవ్వుల్లో ముంచెత్తిన మేర్లపాకగాంధీ రెండోసినిమా ఎక్స్‌ప్రెస్ రాజాతో మరింత మెచ్యూరిటీ సాధించాడు.
గాంధీ కేవలం హాస్యాన్నే నమ్ముకోలేదు. కథ, కథనంలో శ్రద్ధ చూపి కథలోంచే హాస్యం పుట్టేలా చేసుకోవడం వల్ల కథతో పాటు ప్రేక్షకులు కూడా ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో ప్రయాణిస్తారు.
ఒక సంఘటన అనేక సంఘటనలకి దారితీస్తుంది. మనిషి జీవితంలో జరిగే అన్ని మంచి చెడులు ఏదో ఒక చిన్న సంఘటనతో మొదలవుతాయి. ఒక చిన్న కిడ్నాప్ అనేక గొలుసు సంఘటనలకి దారి తీసి కొత్త పాత్రలు వచ్చి కథని కొత్త మలుపులు తిప్పడమే ఈ సినిమా ప్రత్యేకత . స్క్రీన్ ప్లేలో వున్న బలమే దీనికి కారణం.
అవకాశం వస్తేకానీ ప్రతిభ బయటపడదు. చిన్న పాత్రలు వేసే ప్రభాస్‌శీను సినిమా మొత్తం నవ్వులు పండించడం విశేషం. సప్తగిరి నాన్‌స్టాఫ్ కామెడీ హైలైట్. కథ విషయానికొస్తే శర్వానంద్, ప్రభాస్ వైజాగ్‌లో జులాయిగా తిరుగుతుంటే హైదరాబాద్‌లో ఉద్యోగం వేయిస్తాడు పోసాని కృష్ణమురళి.
ఉద్యోగం కోసం వచ్చిన హీరో అనుకోకుండా హీరోయిన్ సురభిని చూస్తాడు. లవ్‌లో పడతాడు. డిక్షనరీలు అమ్మే ఉద్యోగంలో దిగుతాడు. హీరోయిన్‌కి కుక్కలంటే ఇష్టం. హీరోకి కుక్కలంటే ఎలర్జీ. ఈ పాయింట్‌తో కథ మలుపుతిరుగుతుంది. దీనికి అదనంగా క్రైంకామెడీ వచ్చి చేరుతుంది. ఒక్కో పాత్ర కథకి కనెక్టవడం, వాళ్ళ ప్లాష్‌బ్యాక్ వివరించడం. ఈ టెక్నిక్‌ని డైరెక్టర్ నడిపిన తీరు చాలాబాగుంది.
పాటలు బావున్నాయి. డైలాగ్‌లు చాలాచోట్ల పేలాయి. అనవసరమైన ఫైట్స్ లేవు. క్లీన్ హ్యూమర్‌తో నడిచే సినిమాలు రావడమే అరుదైపోతున్నపుడు ఎక్స్ ప్రెస్ రాజా ఒక రిలీఫ్. ఇవివి, జంధ్యాల తరువాత హ్యాస్యాన్ని మెయిన్ జానర్‌గా తీసుకున్న దర్శకులు కరువైపోయారు. గాంధీ ఆ గ్యాప్‌ని పూడుస్తాడని ఆశిద్దాం.
చాలాకాలం తరువాత ఊర్వశి కనిపించింది. వసంతకోకిల శ్రీదేవిగా ఆమె ఎపిసోడ్ బావుంది. ఈ మధ్య నేను శైలజలో ప్రదీప్ రావత్ కనిపించిన తరహాలో సుప్రీత్ రెడ్డి (కాట్రాజ్) కామెడి విలన్‌గా కనిపించాడు.
ఎక్స్‌ప్రెస్‌రాజాతో అర్థమైన విషయమేమంటే మూస కథలకి కాలం చెల్లింది. కొత్తదర్శకులు కొత్త ఆలోచనలతో వస్తున్నారు. అందులో కొంతమంది విఫలమైతే కావచ్చుకానీ, తెలుగు సినిమా రూపురేఖలు మెల్లిగా మారుతున్నాయన్నది నిజం, సింపుల్‌గా అర్భాటంలేకుండా కథని మాత్రమే నమ్ముకుని తీస్తున్న మేర్లపాకగాంధీ నిజంగా అభినందనీయుడు.
– ప్రజ్ఞ