నాన్నకు ప్రేమతో సినిమా రివ్యూ
రేటింగ్: 3/5 విడుదల తేదీ : 13 జనవరి 2016 దర్శకత్వం : సుకుమార్ ప్రొడ్యూసర్ : బి.వి.ఎస్.యస్. ప్రసాద్ బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ నటీనటులు : జూనియర్ యన్.టి.ఆర్, రకుల్‌ప్రీత్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు యండమూరి వీరేంద్రనాధ్ చాలా ఏళ్ళక్రితం డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు రాశారు. అది చాలెంజ్ అనే సినిమాగా కూడా వచ్చింది. చిరంజీవి హిట్స్‌లో ఇదొకటి. తనకంటే అన్ని విషయాల్లోనూ శక్తివంతుడైన వ్యక్తితో ఒక సామాన్యుడు చాలెంజ్ […]
రేటింగ్: 3/5
విడుదల తేదీ : 13 జనవరి 2016
దర్శకత్వం : సుకుమార్
ప్రొడ్యూసర్ : బి.వి.ఎస్.యస్. ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు : జూనియర్ యన్.టి.ఆర్, రకుల్‌ప్రీత్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు
యండమూరి వీరేంద్రనాధ్ చాలా ఏళ్ళక్రితం డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు రాశారు. అది చాలెంజ్ అనే సినిమాగా కూడా వచ్చింది. చిరంజీవి హిట్స్‌లో ఇదొకటి. తనకంటే అన్ని విషయాల్లోనూ శక్తివంతుడైన వ్యక్తితో ఒక సామాన్యుడు చాలెంజ్ చేసి గెలవడం ఈ కథ. జీవితంలో జరిగినా జరక్కపోయినా కథల్లో, సినిమాల్లో ఒక సామాన్యుడు గెలవాలనే అందరూ కోరుకుంటారు. అలాంటి కథే నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీఆర్ ఒక తెలివైన సామాన్యుడు, జగపతిబాబు మల్టీ మిలియనీర్. చాలెంజ్ సినిమాలో రాధికలా, ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ విలన్ కూతురు. అదే గేమ్‌ని కొత్త టెక్నాలజితో దర్శకుడు సుకుమార్ నడిపించాడు. డబ్బు సంపాదించి చూపడం చాలెంజ్ కథయితే, విలన్‌ని బికారి చేయడం ఇక్కడి కథ.
మన భారతీయ ఆత్మ కుటుంబ వ్యవస్థలో ఉంది. ఎన్ని విలువలు మారినా ఇంకా మన సమాజంలో కుటుంబవిలువలు మిగిలే వున్నాయి. అందుకే అమ్మానాన్నల కథకు మనం తొందరగా కనెక్టవుతాం. దూకుడు హిట్‌కి ఇదే కారణం. నాన్నకు ప్రేమతో అని టైటిట్ పెట్టారుకానీ, నాన్న పగకోసం అనేది కరెక్ట్ టైటిల్.
రాజేంద్ర ప్రసాద్‌ని చాలా ఏళ్ళక్రితం జగపతిబాబు మోసంచేసి ఉంటాడు. అందువల్ల చనిపోయేలాగా పగతీర్చుకోవాలని ఆయన ఉద్దేశం. నెలరోజులకి మించి బతకడు కాబట్టి ఆలోగా ఆఖరికోరిక నెరవెరాలి. తండ్రి పగని తీర్చడానికి హీరో పూనుకుంటాడు.
ఎక్కడి ఎమోషన్‌ని అక్కడే వదిలించుకోవాలి అనే థియరీతో బిగినింగ్ సుకుమార్ స్టయిల్‌లో చాలా కొత్తగా ఉంటుంది. అయితే విలన్‌ని చేరుకోవాలంటే అతని కూతుర్ని పడేయాలనే పాతసిద్ధాంతం దారికి కథ వెళుతుంది. అనేక సినిమాల్లోలాగా తెలివితక్కువ హీరోయిన్‌ని పనికిమాలిన చేష్టలతో తన దారికి తెచ్చుకోవడం ఇక్కడ కుదరదు. ఎందుకంటే హీరోయిన్ చాలా తెలివైంది. హీరో చాలా తెలివిగా మైండ్ గేమ్‌తో చేరువవుతాడు. విలన్ ఇంకా తెలివైనవాడు. తన దగ్గరికి హీరో ఎందుకు వస్తున్నాడో తెలుసుకుంటాడు. గేమ్ ఇద్దరి మధ్య మొదలవడంతో ఇంటర్వెల్.
ఫస్టాఫ్‌లో బుర్రకి పదునుపెట్టిన డైరెక్టర్, సెకెండాఫ్‌లో కొంత గందరగోళానికి గురయ్యాడు. నేనొక్కడినే సినిమాలోలా హీరోయిన్‌కి చిన్నతనంలోని ఒక దృశ్యం కలగా రావడం, ఆమెని తల్లితో కలపడం ఇదంతా రాంగ్ ఎపిసోడ్. హీరోయిన్ తెలివిగా హీరోతో గేమ్ ఆడడం ఈ సీన్లన్నీ కథని స్లో చేసాయి.
కూతుర్ని ఇష్టపడే జగపతిబాబు భార్యపట్ల అంత క్రూరంగా ఎందుకుంటాడో అర్ధంకాదు. ఇవన్నీ అట్లావుంచితే హీరో తన తెలివితేటలతో చేసిన గొప్ప ఎత్తుగడలు కూడా ఏమీలేవు. విలన్ ఎకౌంట్‌ని హ్యాక్ చేయడం, ఒక నకిలీ గ్యాస్ ప్రాజెక్ట్‌కి వోనర్ని చేసి దివాళా తీయించడం, ఇవన్నీ సినిమాటాక్‌గానే ఉన్నాయి. అంత సులభంగా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ జరిగితే లండన్‌లో వున్న కోటీశ్వరులంతా ఎప్పుడో బిగ్ బెన్ గడియారం దగ్గర అడుక్కునేవాళ్ళు. ఒక గ్యాస్ ప్రాజెక్ట్ స్టార్ట్‌చేయాలంటే బోలెడన్ని తతంగాలుంటాయి. అదేం రియల్ ఎస్టేట్ వెంచర్‌కాదు, నాలుగు రాళ్ళు జెండాలు పాతి స్టార్ట్ చేయడానికి. మన సినిమాల్లో విలన్లు కోట్లు ఎలా సంపాదిస్తారో తెలియదుకానీ పోగొట్టుకోవడం మాత్రం మూర్ఖులకంటే అన్యాయంగా పోగొట్టుకుంటారు. స్పెయిన్‌లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వానికి సంబంధించిన బోలెడు అనుమతులు పర్యవేక్షణ ఉంటాయి. కానీ ఆశిష్ విద్యార్ధినుంచి జగపతిబాబు అరటిపండు లాక్కున్నంత సులభంగా లాక్కుంటాడు.
సినిమాలూ ఇలాగే జరుగుతాయి కదా అని రాజీపడొచ్చు కానీ సుకుమార్ చాలా ఇంటెలిజెంట్‌గా సినిమా తీయడం వల్ల ఇలాంటి ప్రశ్నలొస్తాయి. లాజిక్‌లు సంగతి పక్కనపెడితే ఎన్టీయార్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాడు. సుకుమార్ టేకింగ్ ఎక్స్‌లెంట్. పాటలు బావున్నాయి. తెలివైన అమ్మాయిగా రకుల్ క్యూట్‌గా ఉంది. రెండుగంటల 48 నిముషాల నిడివితో వున్న ఈ సినిమా సెకెండాఫ్‌లో సహనాన్ని కొంత పరిక్షీస్తుంది. ఇంటర్వెల్ వరకూ ఎన్ని జిమ్మిక్స్ చేసినా ఓకే కానీ, సెకండాఫ్‌లో చిక్కుముడులన్నీ విప్పుతూ రావాలి. అందులో దర్శకుడు కొంత విఫలమయ్యాడు. నాన్నగా రాజేంద్రప్రసాద్ ఓకే. తాగుబోతు రమేష్ కొత్తగా కనిపిస్తాడు. డైలాగ్‌లు చాలా చోట్ల బావున్నాయి. సినిమాలో నవ్వించడానికి కమేడియన్లు అక్కర్లేదని డైరెక్టర్‌కి బాగా తెలుసు. అందుకే ఈ సినిమాలో ఒక్క కమేడియన్ కూడా లేడు. కానీ చాలా చోట్ల నవ్వుతాం.
ఎన్నివున్నా ఇందులో ఉండాల్సింది ఏదో లేదు. దర్శకుడికి సీతాకోకచిలుక అంటే ఇష్టమేమో చాలాసార్లు కనిపిస్తుంది. రంగులైనా, అందమైనా ఆత్మ లేకపోతే నిరుపయోగం. చదరంగపు ఆటగాళ్ళు ఎంతతెలివిగా ఆట ఆడినా ప్రేక్షకుడు అంతే తెలివిగా కనెక్ట్ కావడం కష్టం. అందుకే చెస్‌ని ఎక్కువసేపు ఎవరూ చూడరు. క్రికెట్‌కి అంత తెలివి అక్కరలేదు, కానీ లక్షలాది మంది చూస్తారు. అయితే మనం సినిమాలు తీసేది తెలివైన వారికోసం, యావరేజ్ ప్రేక్షకులకోసమా అంటే సమాధానం ఎవరూ చెప్పలేరు. నిస్సందేహంగా సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్. చాలా తక్కువమంది మాత్రమే ఆయనలా తీయగలరు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు అర్ధమవుతుందా అంటే ప్రశ్నార్ధకమే. ఒకవేళ అర్ధమై ఈ సినిమా హిట్ అయితే ప్రేక్షకులే ఎదిగినారని భావించాలి.
మనిషి బుర్రపై ఒక కర్రతో కొడితే చనిపోతాడనేది సైన్స్. అయితే ఈ మాత్రం దానికి వంద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎందుకు? ఇంట్లో కెమెరా పెడితేనే కనుక్కోలేని స్థితిలో జగపతిబాబు వుంటే అతను మీసాలు గడ్డాలు తీసేసుకుని టాయిలెట్ క్లీనర్‌గా జీవించడమే కరెక్ట్. ప్రేక్షకుల్ని బుద్ధిహీనులుగా భావించి సినిమాలు తీసినవాళ్ళు అనేకమంది ఉన్నారు. సుకుమార్ అలాంటివాడు కాదు అదొకటే సంతోషం.
– జి ఆర్. మహర్షి