ఆల్కహాల్ వినియోగంపై యుకె కొత్త మార్గదర్శకాలు
బీర్, వైన్, బ్రాందీ…ఇలా ఏ రూపంలో ఆల్కహాల్ తీసుకున్నా, ఎంత మోతాదులో తీసుకున్నా క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ వినియోగంపై వారు ప్రజలకు నూతన మార్గదర్శకాలు చెబుతూ ఒక నివేదికను విడుదల చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలకు, పాటిస్తున్న విధానాలకు చాలా సవరణలు చేశారు. ముఖ్యంగా ఆల్కహాల్‌ని ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా క్యాన్సర్ రిస్కు ఉంటుందని హెచ్చరించారు. ఏ మోతాదులో తీసుకున్నా అది పలురకాల క్యాన్సర్లను […]
బీర్, వైన్, బ్రాందీ…ఇలా ఏ రూపంలో ఆల్కహాల్ తీసుకున్నా, ఎంత మోతాదులో తీసుకున్నా క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ వినియోగంపై వారు ప్రజలకు నూతన మార్గదర్శకాలు చెబుతూ ఒక నివేదికను విడుదల చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలకు, పాటిస్తున్న విధానాలకు చాలా సవరణలు చేశారు. ముఖ్యంగా ఆల్కహాల్‌ని ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా క్యాన్సర్ రిస్కు ఉంటుందని హెచ్చరించారు. ఏ మోతాదులో తీసుకున్నా అది పలురకాల క్యాన్సర్లను తెచ్చిపెడుతుందని యుకె చీఫ్ మెడికల్ ఆఫీసర్ల బృందం ఈ నివేదికలో తేల్చి చెప్పింది. క్యాన్సర్ కారకాలపై పరిశోధనలు నిర్వహించిన ఈ కమిటీ ఇప్పటి వరకు ఆల్కహాల్ వినియోగంపై ఉన్న పలు అభిప్రాయాలను మార్చివేసింది.
మగవారైనా ఆడవారైనా ఒక గ్లాసు రెడ్‌వైన్‌ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చనీ, ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్‌ని, మతిమరుపుని నివారిస్తాయనీ చాలామంది నమ్ముతుంటారు. పలు పరిశోధనల్లో తేలిన అంశంగా దీనికి బాగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు వీటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు, క్యాన్సర్ కారకాలపై పరిశోధనలు నిర్వహించిన వైద్య నిపుణులు. ఆల్కహాల్ తీసుకోనివారితో పోల్చి చూస్తే తీసుకునేవారిలో క్యాన్సర్ రిస్కు చాలా ఎక్కువగా ఉందని, ఒకవేళ తాగటం మానేసినా వారు రిస్కుని అధిగమించి సురక్షిత స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుందని వారు చెబుతున్నారు. ఇంగ్లండు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాలీ డెవిస్ ఈ వివరాలు వెల్లడిస్తూ ఆడయినా మగయినా రోజూ ఆల్కహాల్ తీసుకుంటే అనారోగ్యం రిస్కు పెరగక మానదని తెలిపారు.
మగవాళ్లు కూడా ఆడవాళ్ల స్థాయిలోనే చాలా తక్కువగా ఆల్కహాల్ తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. వారానికి చిన్న పెగ్గులు ఆరేడుకి మించి తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు ఆల్కహాల్ వినియోగంపై ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాల్లో వారానికి ఆడవారు 14 యూనిట్లు, మగవారు 21 యూనిట్లు దాటకూడదని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఆడయినా, మగయినా ఎవరూ 14 యూనిట్లకు మించకూడదని చెబుతున్నారు.
అలాగే గర్భవతులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు, ఒకటిలేదా రెండు యూనిట్లకు మించి తీసుకోకూడదని నివేదికలో వెల్లడించారు.. కొన్ని రకాల వైన్లను సాయంత్రం ఒకసారి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే… అనే అభిప్రాయం ఇప్పటి వరకు ఉంది. కానీ ఈ కొత్త నివేదిక ఆ అభిప్రాయం కూడా తప్పని చెబుతోంది. గుండె ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకుంటున్నాం అనే మహిళల వయసు 55 సంవత్సరాలకు పైబడి ఉండాలని, అదీ వారు వారానికి రెండు గ్లాసులకు మించి వైన్ తీసుకోకూడదని ఈ నివేదిక తెలిపింది. అయినా ఆరోగ్యం కోసం తాగుతున్నాం…అనే వాదన సరైనది కాదని వీరు తేల్చారు.
ప్రభుత్వం తన అతి జాగ్రత్తతో ఇలాంటి పరిమితులు విధిస్తూ, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నదని దీనిపై విమర్శలు వస్తుండగా కాదు, ఆల్కహల్ మోతాదు పెరగడంతో క్యాన్సర్లు విజృంభించడం వల్లనే ఈ జాగ్రత్తలు చెబుతున్నామని ఇంగ్లండు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాలీ డెవిస్ అంటున్నారు.