కూటమి మారితే చరిత్ర మారాలా?
బిహార్ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఇందిరా గాంధీ పాలన బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనకన్నా ఘోరంగా ఉండేదని రాసినందుకు కాంగ్రెస్ బిహార్ కాంగ్రెస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఇటీవల బిహార్ ఎన్నికలలో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె.డి.(యు), లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్.జె.డి. తో కలిసి కాంగ్రెస్ కూడా ఎన్నికలలో పోటీ చేసింది. నితీశ్ తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం కాంగ్రెస్ కు బాగానే కలిసి వచ్చింది. 41 స్థానాలకు పోటీ […]
బిహార్ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఇందిరా గాంధీ పాలన బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనకన్నా ఘోరంగా ఉండేదని రాసినందుకు కాంగ్రెస్ బిహార్ కాంగ్రెస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఇటీవల బిహార్ ఎన్నికలలో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె.డి.(యు), లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్.జె.డి. తో కలిసి కాంగ్రెస్ కూడా ఎన్నికలలో పోటీ చేసింది. నితీశ్ తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం కాంగ్రెస్ కు బాగానే కలిసి వచ్చింది. 41 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కు ఓట్లు 1.6 శాతం తగ్గినా సీట్లు మాత్రం 27 వచ్చాయి.
ఇప్పుడు పాలక పక్షంలో తామూ భాగస్వాములం కనక గత చరిత్రలోని చీకటి కోణాలు కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ పాలన బ్రిటిష్ పాలన కన్నా అన్యాయమన్న మాట ఆ బిహార్ చరిత్రకు సంబంధించిన భాగంలో కనిపించే సరికి ఒక్క సారి ఉలిక్కిపడుతున్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ వేదికమీద సోనియాగాంధీతో ఈ విషయం ప్రస్తావించిన తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు.
ఇంతకీ ఆ వెబ్ సైట్ లో ఏముంది అని పరిశీలిస్తే “ఎమర్జెన్సీ సమయంలో లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ను అరెస్టు చేసి దిల్లీ దగ్గరలోని తిహార్ జైలులో ఉంచారు. ఆ జైలులో కరడుగట్టిన నేరస్థులు కూడా ఉంటారు. జయ ప్రకాశ్ నారాయణ్ ను ఉంచిన తిహార్ జైలులో పరిస్థితులు 1917లో చంపారన్ లో గాంధీజీని ఉంచిన పరిస్థితులకన్నా అద్వాన్నంగా ఉన్నాయి” అని కనిపిస్తుంది. ఇందిరా గాంధీ జయప్రకాశ్ నారాయణ్ ను ఘోరమైన రీతిలో నిర్బంధించిందన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎమర్జెన్సీలో అనేక మంది నాయకులు దుర్భరంగా గడిపిన మాట వాస్తవమే కావొచ్చు. జైలు వెలుపల ఉన్న ప్రజల పరిస్థితి అంతకన్నా ఘోరంగానే ఉండేది.
ఇందిరాగాంధీ, ఆమె రెండవ కుమారుడు సంజయ్ గాంధీ నియంతృత్వ పోకడలను జయప్రకాశ్ నారాయణ్ చివరి శ్వాస దాకా వ్యతిరేకించిన మాట వాస్తవం.
“ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఏడు పదుల వయసు నిండిన జయప్రకాశ్ నారాయణ్ ను జైలులో పెట్టారు. జయ ప్రకాశ్ ఇందిరా గాంధీ తండ్రి నెహ్రూతో భుజం భుజం కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. ఆయనను ఎమర్జెన్సీ సమయంలో దుర్భరమైన పరిస్థితిలో జైలులో ఉంచారు” అని బిహార్ వెబ్ సైట్ లో ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు అభ్యంతరకరంగా తోస్తోంది. ఈ మాటలు ఇటీవల ఎన్నికలలో నితీశ్ కుమార్ అఖండ విజయం సాధించిన తర్వాత రాసినవి కాదు. అంతకు ముందే ఉన్నాయి. అప్పుడు వెబ్ సైట్ ను చూసే ఓపిక, తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదు. ఇప్పుడే మేల్కొని చూస్తే గత చరిత్రలోని వాస్తవాలు వారిని భయకంపితులను చేస్తున్నట్టున్నాయి.
ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాలు బిహార్ కాంగ్రెస్ నాయకులు నితీశ్ కుమార్ పార్టీతో కలిసి పోటీ చేసి తగు మాత్రం విజయం సాధించి, పాలక కూటమిలో భాగస్వాములైనంత మాత్రాన మాసిపోయేటంతటి అల్పమైనవి కాదు. ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చ. కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడినా, ఉడుక్కున్నా ఆ వాస్తవం మరుగున పడదు.
ఏడు పదులు దాటిన జేపీ వంటి వారిని జైలులో పెట్టడమే కాదు ఎనిమిది పదులు నిండిన వారికి, 18 ఏళ్లకు లోపు ఉన్న వారికి బలవంతాన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించిన “ఘనత” ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనకు ఉంది.
బిహార్ వెబ్ సైట్ లో ఉన్న అంశాలు ఆమోదించదగినవి కాదు అని బిహార్ కాంగ్రెస్ నాయకుడు చందన్ యాదవ్ హుంకరిస్తున్నారు. అంటే కాంగ్రెస్ కు చరిత్రను అంగీకరించే లక్షణం లేదనేగా? ఇప్పుడు తాము పాలక కూటమిలో ఉన్నంత మాత్రాన బిహార్ చరిత్రను తిరగరాయాలా? ఒక వేళ అదే నిజమైతే అధికారంలోకి వచ్చినప్పుడల్లా చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నిస్తున్న కాషాయ కూటమికి, కాంగ్రెస్ కు తేడా ఏమిటి?
ఇదీ మచ్చు తునక…
ఎమర్జెన్సీ అకృత్యాలను వివరించడానికి ఈ చిన్న ఉదాహరణ చూడండి. ఈ చిత్రంలో ఉన్న ఖాజా అబ్దుల్ మాజిద్ కు ఇప్పుడు 92 ఏళ్లు. సరిగ్గా 40 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో బలవంతపు కుటుంబ నియంత్రణలకు నిరసన తెలియజేసినందుకు 19 ఏళ్ల ఆయన కుమారుడు మహమ్మద్ సలీం ఉత్తరప్రదేశ పోలీస్ కన్ స్టాబ్యులరీ తూటాలకు బలై పోయాడు.
1976 అక్టోబర్ 18న బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు శాంతియుతంగా నిరసన తెలియజేసిన వారిపై పోలీసులు జరిపిన కాల్పులలో 25 మంది మరణించారు. అందులో మాజిద్ కుమారుడు మహమ్మద్ సలీం ఒకరు. కాల్పులలో మరణించిన 25 మందిలో 23 మంది ముస్లింలే. మిగతా ఇద్దరు ఆ దారిన వెళ్తున్న హిందువులు. ఈ అంశంపై కమిషన్లు విచారణ తతంగం అంతా జరిగింది. కాని సలీం కుటుంబానికి న్యాయం మాత్రం జరగలేదు. 92 ఏళ్ల ఆయన తండ్రి ఇప్పటికీ నిరసన తెలియజేస్తూనే ఉన్నాడు. ఫలితం మాత్రం లేదు.
ఎమర్జెన్సీ రోజులలో ఇలాంటి ఉదంతాలు కొల్లలు. కాంగ్రెస్ నాయకులు ఈ చీకటి రోజులనుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. గత చరిత్రను చాప కిందికి తోసేస్తే ఒరిగేదేమీ లేదు.
-అనన్య