కేటీఆర్ వరుస ఇంటర్వ్యూల మతలబు ఇదేనా?
ఒక్కసారి మాట జారాక తిరిగి తెచ్చుకోవడం కష్టం. అది సరదాగా చేసినా.. సీరియస్ గా చేసినా ఇబ్బందే.. ఇదే పరిస్థితిని తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్ కు తెలిసి వచ్చినట్టుంది. కొద్ది రోజుల క్రితం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన కేటీఆర్.. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చుట్టుకున్నాయి. కేసీఆర్ కు అమరావతిలో లభించిన అభిమానంతో ఆంధ్రాలోకి వస్తామని.. తెలంగాణ రాష్ట్రసమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకుంటామన్నారు. అంతటితో ఆగలేదు. నేను […]
BY sarvi10 Jan 2016 2:04 AM GMT
X
sarvi Updated On: 11 Jan 2016 12:19 AM GMT
ఒక్కసారి మాట జారాక తిరిగి తెచ్చుకోవడం కష్టం. అది సరదాగా చేసినా.. సీరియస్ గా చేసినా ఇబ్బందే.. ఇదే పరిస్థితిని తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్ కు తెలిసి వచ్చినట్టుంది. కొద్ది రోజుల క్రితం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన కేటీఆర్.. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చుట్టుకున్నాయి. కేసీఆర్ కు అమరావతిలో లభించిన అభిమానంతో ఆంధ్రాలోకి వస్తామని.. తెలంగాణ రాష్ట్రసమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకుంటామన్నారు. అంతటితో ఆగలేదు. నేను పోటీ చేయాల్సి వస్తే నియోజకవర్గం కూడా ఎంచుకున్నానని.. అది భీమవరం అని చెప్పారు. అక్కడ తనకు రాజులు చాలా మంది తెలుసని.. కోడిపందాలను నిర్వహించడానికి అనుమతి ఇప్పిస్తే గెలుస్తానని నవ్వూతూనే అన్నారు. అలా నవ్వుతూ కేటీఆర్ అన్న మాటలే ఇప్పుడు రివర్స్ అయ్యాయి.
కేటీఆర్ మాటలకు మరుసటి రోజు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఏమైనా చేస్తారనడానికి కేటీఆర్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు. పార్టీ సంగతి తర్వాత.. ముందుగా తెలంగాణ భవన్ పేరు తెలుగు భవన్ అని మార్చండి చాలంటూ సవాల్ విసిరారు. దాంతో కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లోనూ నెగిటివ్ గా వెళ్లే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. భీమవరం నుంచి పోటీచేస్తానన్న మాటలు తెలంగాణ ప్రజలు తప్పుగా అర్ధం చేసుకుంటే ఇబ్బందని కేటీఆర్ తో కేసీఆర్ అన్నట్టు సమాచారం.
అందువల్లే కేటీఆర్ మరుసటి రోజే అన్ని ఛానళ్లను తెలంగాణ భవన్ కు రప్పించి వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చి.. తాను చేసిన వ్యాఖ్యలు సరదగా చేసినవేనని వివరణ ఇచ్చుకున్నారు. సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా వివాదం చేస్తారా? అని ప్రశ్నించారు. తొందర్లోనే టీడీపీ తెలంగాణ నుంచి మాయమవుతుందని.. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే టు లెట్ బోర్డు అని పెట్టుకోవాల్సి వస్తుందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓటర్లను ఆకట్టుకోవడం కోసం సరదాగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.
Next Story