వర్మ... కిల్లింగ్ ఆడియన్స్
రేటింగ్: 1.5/5 విడుదల తేదీ : 07 జనవరి 2016 దర్శకత్వం : రామ్‌గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ : బి.వి. మంజునాధ్, బి.ఎస్.సుదీంద్ర, ఇ. శివప్రకాష్ బ్యానర్: ZED3 పిక్చర్స్ సంగీతం : రవి శంకర్ నటీనటులు : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞా శెట్టి, సంచారి విజయ్, పురుల్ యాదవ్ సినిమాలోనైనా, జీవితంలోనైనా ఆట ఎప్పుడు ఆపాలో తెలియాలి. అది తెలియని వాళ్ళు తమ అంతాన్ని తామే చూసుకుంటారు. కాని ఇది తెలుసుకోవడం చాలా కష్టం. చార్లీచాప్లిన్ […]
రేటింగ్: 1.5/5
విడుదల తేదీ : 07 జనవరి 2016
దర్శకత్వం : రామ్‌గోపాల్ వర్మ
ప్రొడ్యూసర్ : బి.వి. మంజునాధ్, బి.ఎస్.సుదీంద్ర, ఇ. శివప్రకాష్
బ్యానర్: ZED3 పిక్చర్స్
సంగీతం : రవి శంకర్
నటీనటులు : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞా శెట్టి, సంచారి విజయ్, పురుల్ యాదవ్
సినిమాలోనైనా, జీవితంలోనైనా ఆట ఎప్పుడు ఆపాలో తెలియాలి. అది తెలియని వాళ్ళు తమ అంతాన్ని తామే చూసుకుంటారు. కాని ఇది తెలుసుకోవడం చాలా కష్టం. చార్లీచాప్లిన్ అంతటివాడు తన చివరి సినిమాలు చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. ఎందుకంటే ఆ సినిమాలు చూసి ఎవరూ నవ్వడం లేదు కాబట్టి. ధర్మరాజుకి జూదం ఎక్కడ ఆపాలో తెలియక తమ్ముళ్ళని, భార్యని కూడా పనివాళ్ళుగా మార్చాడు. ప్రకృతి మనకో టైం ఇస్తుంది. ఆ తరువాత అది లాగేసుకుంటుంది. మనటైం ఇంకా ఉందనుకుని రంగస్థలంపై గంతులేస్తే జనం విసుక్కుంటారు. 18 ఏళ్ళ వయసులో మన మొహం జీసస్‌లా ఉండొచ్చు. 50 దాటితే అదే మొహం ద్రోహి జూడాస్‌లా మారిపోవచ్చు. గతాన్ని నమ్ముకుని బతికేవాడికి వర్తమానం, భవిష్యత్తు రెండూ ఉండవు.
రాంగోపాల్‌వర్మ గతంలో అంతం అనే సినిమా తీసాడు. ఈ మధ్య అన్ని సినిమాల్లో తన అంతం తానే చూసుకుంటున్నాడు. శివనాటికి అతను జీనియస్సే, సందేహంలేదు. కిల్లింగ్ వీరప్పన్ నాటికి అతని దగ్గర సరుకు అయిపోయింది. రిటైర్‌కాకుండా జనాల్ని కిల్లింగ్ చేస్తున్నాడు. నిజానికి ఇన్నేళ్ళనుంచి లెక్కేస్తే అతను ఒకేసినిమాని అనేకసార్లు తీసాడు. రాత్రి అనే సినిమాని దెయ్యాలవేషాలు మార్చి అరడజనుసార్లు తీసాడు. శివతీసిన ట్రెండ్‌సెట్టర్ మీదున్న అభిమానంతో వర్మని ప్రేక్షకులు చాలావరకూ క్షమించారు. ఇక వోపికపోయింది.
వీరప్పన్ సినిమాలో వీరప్పన్‌ని ఎలా చంపారన్నది కథ. వీరప్పన్‌పై గతంలో రెండుమూడు సినిమాలు వచ్చాయికానీ ఇది కొంచెం వెరైటీ. వీరప్పన్‌ని చంపిన సిట్ అధికారి కోణంలోంచి తీసిన సినిమా. క్లైమాక్స్‌కొంచెం బావుంది కానీ మిగతా అంతా నత్తనడక. స్లో నెరేషన్. గతంలో వర్మసినిమాల్లో ఎన్నోసార్లు చూసిన టేకింగ్. అదే బ్యాగ్రవుండ్ మ్యూజిక్. వీరప్పన్‌తో సహా ఏ క్యారెక్టర్ మనకి రిజిస్టర్ కాదు. డాక్యుమెంటరీకి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్‌కి తక్కువ అన్నట్టు నడుస్తుంది. పాటలేమీలేవు, అదో వూరట.
నిజానికి వీరప్పన్‌పై ఆసక్తికరంగా సినిమా తీసే అవకాశమున్నా వర్మ తన పాత స్టయిల్‌నే ఎంచుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని పోగొట్టాడు. నిర్మాణవిలువలు ఘోరంగా ఉన్నాయి. కనీసం అడవిని కూడా సరిగా చూపించలేకపోయారు. ఒకటే లొకేషన్‌లో సినిమా అంతా తీసినట్టుంది. ప్రతిది ఒకప్పుడు కొత్తదే. కానీ క్రమేపి పాతబడిపోతుంది. మనకి ఎంత ఇష్టమైన చొక్కా అయినా మూడురోజులు వరుసగా వేసుకోం. అలాంటిది తీసిన పద్దతిలోనే మళ్ళీమళ్ళీతీస్తూ, జనాల్ని హింసించడం వర్మకి న్యాయమా? వర్మసినిమాలంటనే ఇప్పటికే పారిపోతున్నారు. పారిపోతున్న వాళ్ళని తరిమితరిమి కొట్టడమే లక్ష్యంగా వర్మ ఎంచుకున్నాడా? ఏమో ఇదంతా మన ఖర్మ !
– జి ఆర్. మహర్షి