రంగురంగుల ధ్యానం!
ఔట్‌లైన్ మాత్రమే గీసి ఉన్న బొమ్మల పుస్తకాల్లో పిల్లలు రంగులు వేయడం మనందరికీ తెలిసిందే. తమకు నచ్చినట్టుగా రంగులు వేసి పిల్లలు సంబరపడి పోవడం చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలను పెద్దవాళ్ల కోసం కూడా ముద్రిస్తున్నారు. వీటిని రంగులతో నింపడం వలన పెద్దల్లో ఒత్తిడి తగ్గుతుందని సైకాలజీ నిపుణులు సలహా ఇస్తున్నారు. అమెజాన్ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ అమ్మకాల్లో ఈ పుస్తకాలు ముందువరుసలో ఉన్నాయి. యోగా మెడిటేషన్ ప్రార్థనల్లా ఇదీ మనసుకి ప్రశాంతతని ఇస్తుందని సైకాలజిస్టులు సలహా […]
ఔట్‌లైన్ మాత్రమే గీసి ఉన్న బొమ్మల పుస్తకాల్లో పిల్లలు రంగులు వేయడం మనందరికీ తెలిసిందే. తమకు నచ్చినట్టుగా రంగులు వేసి పిల్లలు సంబరపడి పోవడం చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలను పెద్దవాళ్ల కోసం కూడా ముద్రిస్తున్నారు. వీటిని రంగులతో నింపడం వలన పెద్దల్లో ఒత్తిడి తగ్గుతుందని సైకాలజీ నిపుణులు సలహా ఇస్తున్నారు. అమెజాన్ ఆన్‌లైన్ రిటైల్ సంస్థ అమ్మకాల్లో ఈ పుస్తకాలు ముందువరుసలో ఉన్నాయి. యోగా మెడిటేషన్ ప్రార్థనల్లా ఇదీ మనసుకి ప్రశాంతతని ఇస్తుందని సైకాలజిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ రంగులు నింపే పని కండరాల్లో టెన్షన్, అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతౌల్యత… వీటన్నింటినీ తగ్గించి హాయిని, ఆనందాన్ని ఇస్తుందని లండన్ ఆర్ట్ థెరపీ డైరక్టర్ హెప్‌జిబా కప్లాన్ అంటున్నారు.
గజిబిజి గీతల బొమ్మల్లోనూ, ఒకేవిధమైన రంగులను పదేపదే నింపాల్సిన గీతల్లోనూ రంగులను ఎంపిక చేసుకుని జాగ్రత్తగా నింపడం వలన, ఒక మంత్రాన్ని పదేపదే ఉచ్ఛరించినంత ఫలితం ఉంటుందని, అది ఎంతో ప్రశాంతతని ఇస్తుందని హెప్‌జిబా అంటున్నారు. మనసుని ఒక సురక్షితమైన పనిమీద లగ్నం చేసినపుడు అది మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం అవుతుందనీ, ఇదీ అంతటి ఫలితాన్ని ఇస్తుందనేది దీని గురించి చెబుతున్న నిపుణుల మాట.
రంగులు నింపాల్సిన బొమ్మల పుస్తకాలు మార్కెట్లో పలురకాలు దొరుకుతున్నాయి. మన అభిరుచి, ఇష్టం, స్థోమతలను బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో ఎన్‌ఛాంటెడ్ గార్డెన్ అనే పుస్తకం పదిలక్షల కాపీలు అమ్ముడుపోయింది. చెట్లు, పక్షులు, కీటకాలతో దట్టమైన డిజైన్లతో నిండి ఉంటుంది ఈ పుస్తకం. చివరికి పశువుల మంద బయటకు ఎలా వెళ్లాలో దారి చూపించాల్సిన పజిల్ కూడా ఇందులో ఉంది. ఇంకా రకరకాల థీములతో రూపొందిన పలు అడల్ట్ కలరింగ్ పుస్తకాలు లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యసనాల బారిన పడుతున్నవారు ఈ అలవాటుని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.