సహజీవనం ఓ కే కానీ ...
మన సాంస్కృతిక వారసత్వం అంటే సినిమాలు, టివిలు, ప్రకటనలు… వీటిని మాత్రమే చూపించుకునే రోజులు వచ్చేశాయి. ఎందుకంటే మన సామాజిక జీవితంలో వస్తున్న మార్పులను ఇవి బాగా… చూపెడుతున్నాయి. వర్తమానం, భవిష్యత్తు మాత్రమే కళ్ల ముందు కనబడుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. విషయానికి వస్తే బిబాఇండియా వారు తయారు చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే ఈ యాడ్‌లోని కాన్సెప్ట్. నాలుగురోజుల […]
మన సాంస్కృతిక వారసత్వం అంటే సినిమాలు, టివిలు, ప్రకటనలు… వీటిని మాత్రమే చూపించుకునే రోజులు వచ్చేశాయి. ఎందుకంటే మన సామాజిక జీవితంలో వస్తున్న మార్పులను ఇవి బాగా… చూపెడుతున్నాయి. వర్తమానం, భవిష్యత్తు మాత్రమే కళ్ల ముందు కనబడుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. విషయానికి వస్తే బిబాఇండియా వారు తయారు చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే ఈ యాడ్‌లోని కాన్సెప్ట్. నాలుగురోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్టయిన ఈ ప్రకటనకు ఇప్పటికే 2.9లక్షల వ్యూస్ 67వేల షేర్స్ వచ్చాయి. అలాగే యూ ట్యూబ్‌లో 1.9లక్షల మంది దీన్ని చూశారు. మన తెలుగు నటి రెజీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.
తను అద్దం ముందు కూర్చుని పెళ్లిచూపులకోసం ముస్తాబు అవుతుంటుంది. తండ్రి వచ్చి, వాళ్లు వచ్చేశారు త్వరగా రా…అంటాడు. రెజీనా తండ్రితో, నాన్నా ఒక్క ప్లేటు సమోసా నేను నా మిగిలిన జీవితం ఎవరితో జీవించాలో నిర్ణయిస్తాయా అంటుంది. తండ్రి ఆలోచనలో పడతాడు. అమ్మాయి, పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులకు నచ్చుతుంది. కానీ తండ్రి పెళ్లి కొడుక్కి వంట తెలుసా… అని అడుగుతాడు. తమ కొడుకు నూడిల్స్ మాత్రమే చేయగలడని తల్లి చెబుతుంది. తన కూతురు కేవలం నూడిల్స్ ని జీవితమంతా తినాలంటే కష్టం కదా అని రెజీనా తండ్రి అంటాడు. తండ్రిలోని మార్పుకి రెజీనా మొహం విప్పారుతుంది. చివరికి పెళ్లి కొడుకు, పదిరోజుల తరువాత తమ ఇంటికి రమ్మని ఈ లోపల వంట నేర్చుకుంటానని చెప్పడంతో ప్రకటన ముగుస్తుంది. ఛేంజ్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు. నిజజీవితంలో ఇలా జరగటం చాలా అరుదు అయినా ఈ మార్పు వస్తే మంచిదే.
సామాజిక పరిణామంలో వస్తున్న, రాకతప్పని మార్పులను తమ వస్తువుల ప్రచారంలో వ్యాపార సంస్థలు బాగానే వాడుతున్నాయి. ఒక పౌడర్ ప్రకటనలో ఇంట్లోంచి పారిపోయే అబ్బాయి, అమ్మాయిలను చూపించడం, ఒక టీ పొడి ప్రకటనలో తాను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నానని కొడుకు తల్లిదండ్రులకు చెప్పడం…ఇలాంటివన్నీ భారతీయ సామాజిక మార్పుకి నిదర్శనాలే. నిజానికి ఇలాంటి సందర్భాల్లో వస్తువుకంటే ప్రకటన ఎక్కువగా పాపులర్ కావడం కూడా చూస్తుంటాం. ఇవన్నీ భారతీయ సమాజం అనే నాణేనికి ఒకవైపు అయితే మరో వైపు ఎలాంటి మార్పులేని అంశాలూ ఉన్నాయి. వ్యాపార సంస్థలు వీటిని సైతం వాడుకుంటున్నాయి. గంటల తరబడి బట్టలపై, గిన్నెలపై మరకలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆడవాళ్లు, రుచికరమైన వంటలు చేసిపెట్టే గృహిణులు, అసలు కొన్ని రకాల ఫుడ్‌ని పిల్లలకు పెట్టకపోతే, కొన్ని రకాల బ్రష్‌లు, టీ పొడులు…సింకులు టాయ్‌లెట్ల క్లీనింగ్ ఉత్పత్తులు…ఇంకా కారం సాంబార్ మసాలా పొడులు…ఒక్కటి కాదు, ఎన్నెన్నో ఇంటి సరుకులు…వీటన్నింటినీ వాడకపోతే మీ ఆడ జన్మకు అర్థమే లేదని భయపెట్టే ప్రకటనలు…ఇవన్నీ ఇంటి పని, బాధ్యతల విషయంలో మహిళ ఒక్క అంగుళం కూడా పక్కకు జరిగేందుకు ఒప్పుకోవడం లేదు.
చివరికి స్త్రీ పెళ్లి అనే సంప్రదాయాన్ని అధిగమించినా ఫరవాలేదు కానీ…ఇంటిపనిని మాత్రం ఆమె తప్పించుకోలేదని ఈ అత్యాధునిక ప్రకటనలన్నీ మనకు చెబుతున్నాయి. అలా అవి… సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి.
టీ పొడి ప్రకటనలో…కొడుకు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నానంటే…టీ చక్కగా చేసింది కనుక కాస్తయినా సుముఖత వ్యక్తం చేసిన అత్తగారు…అదే టీని కొడుకు తెచ్చి ఉంటే భరించలేకపోయేది…ప్రకటన గురించి కాదు, మనం ఆలోచించినా ఈ విషయం స్పష్టంగా మనకు బోధపడుతుంది. నిజం కూడా అదే. స్త్రీ సహజీవనం చేసినా ఒప్పుకునే సమాజం, ఆమె ఇంటిపని చేయకపోతే మాత్రం భరించలేదు. అంట్లు నువ్వే తోమాలి…అంటే అది అణచివేత అవుతుంది కనుక దాన్ని భారతీయ సంప్రదాయంలో, గృహిణి బాధ్యతల్లో, స్త్రీ లక్షణాల్లో…ఇంకా చాలా చాలా పేద్ద పదాల్లో ఇమిడ్చింది పురుషాధిపత్య సమాజం… అదే సమాజం సహజీవనంలో తమకున్న ప్రయోజనాలు చూసుకుని, అసలు భారత సమాజానికే మూల స్తంభం అనిపించుకున్న పెళ్లి వ్యవస్థకే ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది.
దీనిపై ఎన్ని వాదోపవాదనలు చర్చలు చేసినా, బలహీనుల చేత బలవంతులు పనిచేయించుకోవడం అనే ప్రకృతి ధర్మం మాత్రమే ఇందులో ఇమిడి ఉంది. ఇది ఎవరూ కాదనలేని నిజం.
-వడ్లమూడి దుర్గాంబ