ఈ మనుషులు...కాల ప్రవాహంలో మైలురాళ్లు
అనంతమైన కాలాన్ని కొలిచేందుకు మనిషి దగ్గర చాలా కొలమానాలు ఉన్నాయి. మనిషి సాధించిన విజయాలు, మానవత ఉప్పొంగిన క్షణాలు, మనిషిని మరొక మెట్టు ఎక్కించిన మార్పులు…ఇవన్నీ కాలాన్ని కొలిచే సాధనాలే. అలాగే ప్రకృతి బీభత్సాలు, వైపరీత్యాలు, మనిషి మృగరూపం దాల్సిన సందర్భాలు…వీటిని కూడా…కాలం ఇంతగా మారిపోయింది…అనే విమర్శతో కాలానికి కొలమానాలగానే వాడతాం. అయితే మనిషికి మంచి జరిగినపుడు కాలం ముందుకు నడుస్తున్నట్టుగా, చెడు జరిగినపుడు వెనక్కు వెళుతున్నట్టుగా మాత్రం భావించాల్సిందే. ఇప్పుడు, ఈ ఏడాది కాలాన్ని తమ […]
అనంతమైన కాలాన్ని కొలిచేందుకు మనిషి దగ్గర చాలా కొలమానాలు ఉన్నాయి. మనిషి సాధించిన విజయాలు, మానవత ఉప్పొంగిన క్షణాలు, మనిషిని మరొక మెట్టు ఎక్కించిన మార్పులు…ఇవన్నీ కాలాన్ని కొలిచే సాధనాలే. అలాగే ప్రకృతి బీభత్సాలు, వైపరీత్యాలు, మనిషి మృగరూపం దాల్సిన సందర్భాలు…వీటిని కూడా…కాలం ఇంతగా మారిపోయింది…అనే విమర్శతో కాలానికి కొలమానాలగానే వాడతాం. అయితే మనిషికి మంచి జరిగినపుడు కాలం ముందుకు నడుస్తున్నట్టుగా, చెడు జరిగినపుడు వెనక్కు వెళుతున్నట్టుగా మాత్రం భావించాల్సిందే. ఇప్పుడు, ఈ ఏడాది కాలాన్ని తమ సృజనాత్మక ఆలోచనలు, మంచితనం, కృషి, విజయాలతో పరుగులు తీయించిన కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారు కేవలం వ్యక్తులు కాదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోని మైలురాళ్లు-
అతని టాక్సీ… ఓ పచ్చనివనం
కోల్‌కతాకు చెందిన ధనుంజయ్ అనే టాక్సీ డ్రైవర్ తన టాక్సీనే ఒక పచ్చని వనంలా మార్చేశాడు. అతని టాక్సీ పైన ఆకుపచ్చదనం కనువిందుగా కనబడుతుంటుంది. అలాగే టాక్సీ లోపలి ప్రదేశం కూడా చెట్ల కుండీలతో పచ్చదనంతో పరిమళిస్తుంటుంది. చెట్ల ప్రాధాన్యతపై ప్రచారాన్ని అలా అతను తన జీవితంలో ఒక భాగం చేసుకున్నాడు.
అంధుడు కాదు…అసాధ్యుడు
పదకొండేళ్ల టి. రామానుజం అనే అంధ బాలుడు టివిలో వార్తలు చదివి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి అంధ వ్యక్తి ఇతను. 22 నిముషాల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా టివిలో బ్రెయిలీ లిపిలో వార్తలను చదివి తన మనోభీష్టాన్ని, కలను నెరవేర్చుకున్నాడు. మనిషి మనోశక్తికి ప్రతినిధిగా నిలిచాడు.
పంటకు టెక్‌ని జోడించారు
మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలకు చెందిన 400మంది రైతులు బలిరాజా పేరుతో ఒక వాట్సప్ గ్రూపుగా ఏర్పడ్డారు. వీరంతా వ్యవసాయంలో తమ అనుభవాలు, సాదకబాధకాలను వాట్సప్‌లో పరస్సరం పంచుకోవడంతో పాటు, వ్యవసాయ నిపుణుల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటూ టెక్ సావీ రైతులుగా వ్యవసాయంలో కొత్తబాటని వేశారు.
పేదరికం చెత్తని చిత్తుగా ఓడించింది
పుణెకి చెందిన సుమన్ మొరే అనే 50 ఏళ్ల మహిళ కృషికి పట్టుదలకు చిరునామాగా నిలిచింది. చెత్త ఏరుకునే వృత్తిలో ఉన్న ఆమె, తనతో పాటు ఈ పనిలో ఉన్నవారి జీవితాలను కొత్త మలుపు తిప్పింది. 9వేల మంది సభ్యులతో ఒక సంస్థని ఏర్పాటు చేసి తాము చేస్తున్న పనిని ఒక సంఘటిక శక్తిగా మార్చిందామె. రోడ్లమీద చెత్త ఏరుకునేవారి బతుకులు రోడ్డున పడకుండా వారికి మంచి జీతాలు, స్థిరమైన గుర్తింపు ఉన్న జీవితాలు ఉండేలా చేసింది. సుమన్ ఈ ఏడాది జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో వివిధ దేశాల నుండి హాజరైన 2 వేలమంది నిపుణుల ముందు తన మనోభావాలను, విజయాలను వినిపించింది.
కాలం చెక్కిలిపై విజయ సంతకాలు చేసిన మరికొందరి గురించి క్లుప్తంగా…
- వశీం మెమాన్ అనే వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా తన కారుతో దేశమంతటా తిరిగేందుకు అనుమతి కావాలంటూ రాష్ట్రాల విధానాలపై పోరాటం మొదలుపెట్టాడు. ఇతనికి 25వేలమంది మద్ధతుగా నిలిచారు.
- హర్యానాలోని బిబిపూర్ గ్రామ సర్పంచ్ సునీల్ జగ్లాన్ వాట్సప్‌లో సెల్ఫీ విత్ డాటర్ అనే ప్రచారం ప్రారంభించాడు. చాలామంది తండ్రులు తమ కూతుళ్లతో దిగిన ఫొటోలను పంపించారు. ఆడపిల్లల మీద వివక్షపై ఇలా స్పందించాడు ఆ తండ్రి.
- మరియం సిద్ధిఖీ అనే ముస్లిం బాలిక భగవద్గీత నేర్చుకునే పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. అంతేకాదు, తనకు బహుమతిగా అందిన సొమ్ముని బాలికల విద్యకోసం ఖర్చు చేయాల్సిందిగా కోరింది.
- దేశంలో అసహనం అనే పదం ఎక్కువగా వినిపించిన సంవత్సరం ఇది. రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒక్కటే అని హిందూ ముస్లింలు తమ చేతలతో హృద్యంగా నిరూపించారు. ఒక ముస్లిం యువకుడు తన హిందూ స్నేహితుడు మరణిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ముస్లిం సోదరులు ఈద్ పండుగని నిర్వహించుకునేందుకు, హిందువులు గణేశ్ మండపాలను ఇచ్చారు. మర్‌వారీలో ఒక హిందువు మహమ్మద్ ప్రవక్త జీవిత కథని రచించాడు.
- 67 సంవత్సరాల కె. గంగాధర తిలక్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన పెన్షన్ సొమ్ముతో హైదరాబాద్ రోడ్ల మీద ఏర్పడిన 1125 గుంతలను పూడ్చారు.
- గౌరాంగ్ దామని అనే ఎలక్ట్రికల్ ఇంజినీర్ ముంబయిలోని కింగ్స్ సర్కిల్ రైల్వే స్టేషన్‌ని దత్తత తీసుకున్నాడు. నాలుగునెలల్లో ఆ ప్రాంతాన్ని అందంగా, శుభ్రంగా అద్దంలా తయారుచేశాడు.
- ఈషన్ బల్‌బలే అనే 17 సంవత్సరాల కుర్రాడు ముంబయిలోని స్లమ్ ఏరియా పిల్లలకు ఒక గొప్ప ఉపకారం చేశాడు. ఒకటిన్నర కిలోమీటరు దూరం, పిల్లలు చెత్తా చెదారంలో నడుస్తూ స్కూలుకి వెళ్లే బాధని తప్పించాడు. నాలుగు అడుగుల వెడల్పు, వంద అడుగుల పొడవు ఉన్న ఒక వెదురు వంతెనని ఎనిమిది రోజుల్లో స్వయంగా నిర్మించాడు.
-వి. దుర్గాంబ