ఆనందం... ఆయుష్షుని పెంచదట!
ఈ ప్రపంచంలో చాలా విషయాలు గుడ్డు ముందా, పిల్ల ముందా… లాంటి సమాధానం లేని ప్రశ్నలాగే ఉంటాయి. ఇలాంటిదే మరొక సందేహాన్ని తెరమీదకు తెచ్చారు పరిశోధకులు. సాధారణంగా ఆనందంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని, మనో వేదనకు మందులేదని, చింత చితి పేరుస్తుందని…కనుక ఆనందంగా జీవించలేని వారి జీవితకాలం కూడా తగ్గిపోతుందని ఇప్పటివరకు అనుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ఈ విషయంలో పలు సందేహాలు లేవనెత్తింది. పదిలక్షల మంది బ్రిటీష్ […]
ఈ ప్రపంచంలో చాలా విషయాలు గుడ్డు ముందా, పిల్ల ముందా… లాంటి సమాధానం లేని ప్రశ్నలాగే ఉంటాయి. ఇలాంటిదే మరొక సందేహాన్ని తెరమీదకు తెచ్చారు పరిశోధకులు. సాధారణంగా ఆనందంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని, మనో వేదనకు మందులేదని, చింత చితి పేరుస్తుందని…కనుక ఆనందంగా జీవించలేని వారి జీవితకాలం కూడా తగ్గిపోతుందని ఇప్పటివరకు అనుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ఈ విషయంలో పలు సందేహాలు లేవనెత్తింది.
పదిలక్షల మంది బ్రిటీష్ మహిళల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఆనందంగా ఉంటే ఎక్కువ జీవితకాలం ఉండదని, అలాగే బాధ ఒక్కటే నేరుగా జీవితకాలాన్ని తగ్గించదని ఈ పరిశోధకులు అంటున్నారు. బాధ కాక, ఆ బాధకు కారణమైన అంశాలే మన జీవితకాలాన్ని తగ్గిస్తాయని వారంటున్నారు.
అంటే ఆనందంగా లేకపోవడం వల్ల జీవితకాలం తగ్గుతున్నదా, జీవితకాలాన్ని తగ్గించే బాధల వల్లనే ఆనందంగా ఉండలేకపోతున్నారా…అనే ప్రశ్నలకు వారు సమాధానాలు వెతికారు. ఇందులో ఏది ముందు, ఏది వెనుక అనేది చెప్పలేమన్నారు.
అనారోగ్యం, పేదరికం, ఇతర బాధలు ఉన్నపుడు మనుషులు సంతోషంగా ఉండలేరు. ఆ బాధల కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వలన వారు త్వరగా మరణించవచ్చు, కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా సంతోషంగా లేరు కాబట్టే త్వరగా మరణిస్తున్నారు అంటూ, ఆనందానికి పెద్దపీట వేస్తున్నాం అంటున్నారు వారు. అలాగే పొగ తాగేవారిలో కంటే తాగని వారిలో ఆనందంగా ఉండే లక్షణం ఎక్కువగా ఉంటుందని కూడా వీరు తేల్చారు. అనారోగ్యం, పేదరికం, వ్యసనాలు, ఒత్తిడి, జీవితంలో ఏదీ తమ నియంత్రణలో లేకపోవడం… ఇవన్నీ మనిషి ఆనందాన్ని హరించి వేస్తాయి. తరువాత వారి జీవితకాలాన్ని కూడా తగ్గించి వేస్తాయి. ఇవన్నీ ఉన్నపుడు ఎలాగూ ఎవరూ సంతోషంగా ఉండలేరు. కానీ మనం ఆ వ్యతిరేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ఆనందంగా లేకపోవడం వల్లనే ఎక్కువకాలం బతకడం లేదనుకోవడం పొరబాటని వారు చెబుతున్నారు.
ఎక్కువ కాలం ఒత్తిడితో ఉండటం, ఆనందంగా ఉండలేకపోవడం…ఇవి తప్పకుండా మరణం తెచ్చి పెడతాయని అనుకుంటున్నాం. కానీ అనారోగ్యం, వ్యసనాలు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం…ఇంకా ఇతర బాధలు… ఇలాంటి వాటి కారణంగానే సంతోషం హరించి పోతుందనీ, కాబట్టి ఆ కారణాలే అసలు విలన్లన్న కోణంలోనూ దీన్ని పరిశీలించాలని పరిశోధకులు అంటున్నారు.
వారు తేల్చి చెబుతున్నదేమిటంటే, ఆనందంగా ఉండలేకపోవడం వల్ల మన జీవితకాలం తగ్గదని, అందుకు కారణమైన అంశాల వల్లనే అలా జరుగుతుందని. దీనిబట్టి, ఆనందమైనా, దుఃఖమైనా నేరుగా మనజీవితకాలం మీద ప్రభావాన్ని చూపవని, ఏయే అంశాలు వాటిని మనకు తెచ్చిపెడుతున్నాయో అవే మన జీవితకాలాన్ని నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలన్నమాట.