అరడజను శాఖలు నెత్తినేసి ఐటీ అంటే ఎలా?
హైదరాబాద్‌లో ఐటీ నిలబడిందంటే కారణం చంద్రబాబు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయంటే కేవలం చంద్రబాబును చూసే. ఇదీ టీడీపీ నేతలు నిత్యం చెప్పే మాటలు. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలలు దాటి పోయినా ఐటీ కంపెనీల వాసనే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర్రంలో ఈ పరిస్థితి ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ ఐటీని శాసించానని చెప్పే చంద్రబాబు సొంత రాష్ట్రానికి ఐటీ కంపెనీలు క్యూ కట్టకపోవడమా అని చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ […]
హైదరాబాద్‌లో ఐటీ నిలబడిందంటే కారణం చంద్రబాబు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయంటే కేవలం చంద్రబాబును చూసే. ఇదీ టీడీపీ నేతలు నిత్యం చెప్పే మాటలు. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలలు దాటి పోయినా ఐటీ కంపెనీల వాసనే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర్రంలో ఈ పరిస్థితి ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ ఐటీని శాసించానని చెప్పే చంద్రబాబు సొంత రాష్ట్రానికి ఐటీ కంపెనీలు క్యూ కట్టకపోవడమా అని చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ నేతలు, అనుకూల మీడియా మాత్రం నెపాన్ని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై నెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పోలిక పెడుతూ తమ మంత్రి పనితీరు వల్లే ఐటీ వెనుకబడుతోందని చెబుతున్నారు. ఏపీ ఐటీ శాఖ అధికారులు కూడా అసమర్థులంటూ కథనాలు ప్రచురిస్తున్నారు.
నిజానికి ఏపీలో ఐటీ శాఖమంత్రిగా పల్లె ఉన్నా ఆయనపై ఎవరూ కూడా భారీ అంచనాలు పెట్టుకోలేదు. చంద్రబాబు ఉన్నారు కదా ఐటీ కంపెనీలు సీఎంను చూసి పరుగులు పెడుతూ వస్తాయనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. పైగా పల్లె రఘునాథరెడ్డి ఒక్క ఐటీ శాఖకు మాత్రమే మంత్రి కాదు. ఆయన సమాచార పౌరసంబంధాలు, మైనార్టీ శాఖ, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల భారాన్ని కూడా మోస్తున్నారు. ఇన్ని శాఖలు మరే మంత్రి దగ్గరా లేవు. నిజంగా ప్రభుత్వానికి ఐటీపై అంత శ్రద్ద ఉంటే దానికి మాత్రమే ప్రత్యేకంగా మంత్రిగా నియమించాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ మంత్రులను నియమించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం ప్రతి వంద మంది ఎమ్మెల్యేలకు కేవలం 15 మంది మంత్రులను మాత్రమే నియమించే వీలుంటుంది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో లాగా ప్రతి శాఖకు ఒక్కోమంత్రిని నియమించే అవకాశం లేదు. పైగా ఒక్క ఐటీ శాఖే కాకుండా ఏపీలో చాలా శాఖల పరిస్థితి దారుణంగానే ఉంది. కానీ పల్లె రఘునాథరెడ్డి దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర్రం కాబట్టి ఐటీ ప్రగతిపై భారీ అంచనాలు ఉండడమే. కాబట్టి ఇప్పటికైనా ఐటీ శాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రికి కేటాయించడమో లేదంటే చంద్రబాబే స్యయంగా ఆ శాఖను హ్యాండిల్ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు లోపం పల్లెలో ఉందో ప్రభుత్వంలో ఉందో తెలిసిపోతుందని సలహా ఇస్తున్నారు కొందరు.