మధుమేహాన్ని ఇలా ఆపొచ్చు !
మధుమేహం వచ్చాక దాన్ని నియంత్రించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మధుమేహం రాకుండానే నివారించగల మార్గాలూ ఉన్నాయి. ఇవి, షుగర్ వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలకంటే చాలా తేలికైనవి, ఒక మంచి జీవన శైలిని మనకు అలవాటు చేసేవి. అందుకే మధుమేహం రాకుండానే జాగ్రత్త పడటం చాలా అవసరం. సులభం కూడా. ఆ సమాచారమే ఇది- ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్లు […]
మధుమేహం వచ్చాక దాన్ని నియంత్రించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మధుమేహం రాకుండానే నివారించగల మార్గాలూ ఉన్నాయి. ఇవి, షుగర్ వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలకంటే చాలా తేలికైనవి, ఒక మంచి జీవన శైలిని మనకు అలవాటు చేసేవి. అందుకే మధుమేహం రాకుండానే జాగ్రత్త పడటం చాలా అవసరం. సులభం కూడా. ఆ సమాచారమే ఇది-
- ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.
- ప్రతిరోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయడం ద్వారా బ్లడ్ షుగర్‌ని పెరగకుండా నియంత్రించవచ్చు. వ్యాయామం వలన శరీరం బరువు పెరగదు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి, వినియోగం రెండూ సక్రమంగా జరిగి రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుంది.
- అధికబరువు మధుమేహానికి దగ్గరదారి. ముఖ్యంగా పొత్తికడుపులో పేరుకుంటున్న కొవ్వు, షుగర్ రిస్క్‌ని ఎక్కువ చేస్తుంది. అందుకే బరువు ఎక్కువ ఉంటే ఆరోగ్యకరమైన రీతిలో తగ్గేందుకు ప్రయత్నించాలి. కొంచెం బరువు తగ్గినా అది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది.
- ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. గోధుమ, జొన్న, సజ్జ, రాగి లాంటి తృణ ధాన్యాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఇవి నిదానంగా జీర్ణమవుతాయి కనుక శరీరానికి ఎక్కువ సమయం శక్తి ఉంటుంది.
- ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఉపాహారాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇది ఉదయం ఆకలిని తీర్చడమే కాదు, రోజంతా ఎక్కువ కేలరీలు మన పొట్టలోకి చేరకుండా ఆపుతుంది. ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే రోజంతా అంతకుమించి ఆహారాన్ని తీసుకుంటారు ఎవరైనా.
- జంక్ ఫుడ్‌ని, ఇంకా శరీరంలో కొవ్వుని అధికంగా చేర్చే ఆహారాన్ని తీసుకోకూడదు. జంక్‌ఫుడ్‌లో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు అధికంగా చేరతాయి. ఇవి రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయి.
- సాఫ్ట్ డ్రింకులు, ఇంకా షుగర్ ఎక్కువగా వాడే ఇతర ఎలాంటి డ్రింకుల జోలికీ పోకుండా ఉంటే మంచిది. అలాగే సాయంత్రం వేళ తీసుకునే స్నాక్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పిజ్జాలు బర్గర్ల కంటే పళ్లు, మొలకెత్తిన గింజలు లాంటివి మంచివి.
- మాంసాహారం తగ్గించి వీలైనంత ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకుంటే మధుమేహం రిస్క్ చాలావరకు తగ్గుతుంది. యోగా, మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి.
- ఆరేడు గంటలపాటు గాఢమైన నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మన శరీరంలో కార్టిసాల్ హార్మోను పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచి, రక్తంలో షుగర్ నిల్వల్లో సమన్వయం లేకుండా చేస్తుంది. నిద్ర లేకపోతే ఆకలిని క్రమబద్ధీకరించే హార్మోన్లలో సైతం అసమతౌల్యం ఏర్పడుతుంది.
- ఆహారంలో పీచు పదార్థాన్ని పెంచి తీసుకుంటే మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీనివలన టైప్‌టు డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఆహారంలో 25-30 గ్రాముల వరకు పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి సమతౌల్యంలో ఉంటుంది.
- మంచినీరు ఎక్కువగా తాగడం వలన బ్లడ్‌లో షుగర్ నిలబడిపోకుండా ఉంటుంది. తగిన నీరు తీసుకుంటే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- సకాలంలో హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ ఉంటే మధుమేహం వచ్చే ముందు లక్షణాలను కనుక్కుని పరిస్థితిని నియంత్రించవచ్చు.
- లయోలా యూనివర్శిటీ చికాగో వారి పరిశోధన ప్రకారం ఉదయపు ఎండ ద్వారా లభించే డి విటమిన్‌కి మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఉంది. ఇది మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
- ఆహారంలో దాల్చిన చెక్కని ఎక్కువగా తీసుకోవడం వలన, శరీరం ఇన్సులిన్‌ని తీసుకోవడానికి ఉపయోగపడే ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి, వాటిని పెరగకుండా నిరోధించే శక్తి దాల్చిన చెక్కలో ఉంది. దీంతో మధుమేహం రిస్కు తగ్గుతుంది.
- మధుమేహ నియంత్రణకు సోయా చక్కని ఆహారం. ఇందులో ఉన్న ఐసోఫ్లేవాన్స్ రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వలన ఇది సాధ్యమవుతుంది.
- గ్రీన్ టీని రోజూ తాగుతుంటే మన శరీరంలో కణనాశనానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గతాయి. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్‌ని తగ్గించి మధుమేహాన్ని నివారిస్తాయి.
- మధుమేహం రాకుండా ఉండాలంటే స్మోకింగ్ అలవాటు ఉంటే వదిలేయాలి. పొగతాగే అలవాటు, దీర్ఘకాలంలో హార్మోన్ల విడుదలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది.