ఈ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ చాలవు!
ఒళ్లు నొప్పులు చాలా సాధారణ విషయంగా భావిస్తూ ఏదోఒక తెలిసిన పెయిన్ కిల్లర్ టాబ్‌లెట్ తెచ్చి వేసుకోవడం చాలామందికి అలవాటే. అయితే అన్ని నొప్పులకూ ఇలాంటి సొంత చికిత్సలు పనికిరావు. ముఖ్యంగా మీ నొప్పులకు ఈ కింది లక్షణాలు ఉంటే పెయిన్ కిల్లర్‌తో సరిపెట్టుకోకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు ఓ ఫిజియో థెరపిస్టు. అలా సొంత చికిత్స చేయకూడని నొప్పులు, వాటి లక్షణాలు ఇవీ- నొప్పులతో పాటు జ్వరం, అలసట, జాయింట్ల వద్ద ఎర్రబారడం, వాపు రావడం…ఈ […]
ఒళ్లు నొప్పులు చాలా సాధారణ విషయంగా భావిస్తూ ఏదోఒక తెలిసిన పెయిన్ కిల్లర్ టాబ్‌లెట్ తెచ్చి వేసుకోవడం చాలామందికి అలవాటే. అయితే అన్ని నొప్పులకూ ఇలాంటి సొంత చికిత్సలు పనికిరావు. ముఖ్యంగా మీ నొప్పులకు ఈ కింది లక్షణాలు ఉంటే పెయిన్ కిల్లర్‌తో సరిపెట్టుకోకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు ఓ ఫిజియో థెరపిస్టు. అలా సొంత చికిత్స చేయకూడని నొప్పులు, వాటి లక్షణాలు ఇవీ-
- నొప్పులతో పాటు జ్వరం, అలసట, జాయింట్ల వద్ద ఎర్రబారడం, వాపు రావడం…ఈ లక్షణాలన్నీ ఉండి, వ్యాయామం చేసినపుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారడం… రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కావచ్చు. ఇది చాలా ప్రమాదకరం. అశ్రద్ధ చేస్తే జాయింట్ల వద్ద నొప్పి మరింత తీవ్రతరమవుతుంది. అలాగే కాళ్లు చేతుల ఆకృతి మారిపోయి పూర్తిగా పనిచేయకుండా పోవచ్చు.
- ఎడమచేతిలో నొప్పి, పట్టేసినట్టు ఉండటంతో పాటు ఛాతీలో, వీపు పైభాగంలో అసౌకర్యం…ఈ లక్షణాలన్నీ ఉంటే పెయిన్ కిల్లర్స్‌తో సరిపెట్టుకోకూడదు. ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివలన గుండెకు సరిపడా రక్తం అందదు.
- కాలి పిక్క, తొడ కండరాల్లో వచ్చే విపరీతమైన నొప్పులను పెయిన్‌కిల్లర్స్ వేసుకుని అశ్రద్ధ చేయకూడదు. నొప్పి ఉన్న ప్రాంతంలో ఎర్రగా కందిపోవడం, అంతవరకు చర్మం చల్లబడటం… ఈ లక్షణాలు ఆ ప్రాంతానికి రక్తసరఫరా జరగడం లేదనేందుకు చిహ్నాలు.
- విపరీతమైన నడుము నొప్పితో పాటు ఆ ప్రాంతం తిమ్మిరి ఎక్కినట్టుగా ఉంటే అశ్రద్ధ చేయకూడదు. బ్లాడర్ లేదా ప్రేగు సంబంధింత నియంత్రణ కోల్పోయి అత్యవసర పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.
- శరీరంలో ఎక్కడైనా సరే విపరీతమైన నొప్పి ఉండి, అది రాత్రులు మరింత తీవ్రమౌతుంటే అది సాధారణ నొప్పి కాకపోవచ్చు. నొప్పితో పాటు రక్తలేమి, అనుకోకుండా ఫ్రాక్చర్లు, కళ్లు తిరిగి పడిపోవడం, తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన అలసట ఇవన్నీ ఉంటే అది ఒక రకమైన బోన్ క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. కనుక అశ్రద్ధ చేయకూడదు.