ఆత్మహత్యకు విరుగుడు… జీవితంపై ఆసక్తే..!
సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్యని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానన్న రంగనాథ్ కూడా ఊహించి ఉండరు…తనకు ఇంతమంది తోడున్నారని. అలాగే ఆట డ్యాన్స్ షో ద్వారా చాలామందికి సుపరితమైన భరత్ ఆత్మహత్యకూడా అత్యంత విషాదమే. ప్రమాదవశాత్తూ అనారోగ్యం పాలైన భార్యను డిప్రెషన్‌లోకి వెళ్లకుండా కాపాడుకోవడం తనకు ముఖ్యమైన బాధ్యతగా మారిందన్న రంగనాథ్, తానే డిప్రెషన్‌కు గురయ్యారు. ఇష్టమైన నటనకు కొంతకాలం దూరంగా ఉండాల్సి రావడం, భార్య ఆవేదనను పంచుకోవాల్సి రావడం, ఆమె మరణించాక ఒంటరితనం…ఇవన్నీ […]
సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్యని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానన్న రంగనాథ్ కూడా ఊహించి ఉండరు…తనకు ఇంతమంది తోడున్నారని. అలాగే ఆట డ్యాన్స్ షో ద్వారా చాలామందికి సుపరితమైన భరత్ ఆత్మహత్యకూడా అత్యంత విషాదమే.
ప్రమాదవశాత్తూ అనారోగ్యం పాలైన భార్యను డిప్రెషన్‌లోకి వెళ్లకుండా కాపాడుకోవడం తనకు ముఖ్యమైన బాధ్యతగా మారిందన్న రంగనాథ్, తానే డిప్రెషన్‌కు గురయ్యారు. ఇష్టమైన నటనకు కొంతకాలం దూరంగా ఉండాల్సి రావడం, భార్య ఆవేదనను పంచుకోవాల్సి రావడం, ఆమె మరణించాక ఒంటరితనం…ఇవన్నీ ఆయనను కుంగదీసి ఉంటాయి. అక్కడికీ సాహిత్యం, నటనని కొనసాగించడం, టెన్నిస్ ఆట… లాంటివాటితో ఆయన జీవితంపై ఆసక్తిని పెంచుకోవాలని చూసినా, ఈ ఆసక్తుల కంటే ఆయనకు జీవితంపై అనాసక్తిని పెంచిన అంశాలే బలంగా పనిచేశాయి. ఒక చిన్నపాటి మంచి, మానవతను ప్రతిబింబించే విషయాన్ని విన్నా తనకు కళ్ల వెంట నీళ్లు వచ్చేస్తాయని రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంపై ఆయన పెంచుకున్న అపనమ్మనానికి, విక్టిమైజ్‌డ్ మనస్తత్వానికి ఇది అద్దం పడుతున్నది. ఇవన్నీ కాకుండా మనిషంటే ఏమిటి…అనే విషయంలోనూ ఆయనకు నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్టుగా ఉంది. మనుషులను రిలేషన్స్‌ని బట్టి కాకుండా, మనిషిని మనిషిగా చూడాలని, తనకు మనుషుల మధ్య తనవారు పరాయివారు అనే తేడా కనిపించదని చెప్పారు. తన భార్యకు తనకు మధ్య ఒక చిన్న సంవాదం ఉందని, దశాబ్దంపైగా మంచం మీద ఉన్న ఆమెను తాను బాధ్యతగా చూసుకున్నానని, ఆమె మాత్రం ప్రేమ లేనిదే బాధ్యత రాదు కదా… అంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన తనలోని భావోద్వేగాలను సైతం నిభాయించుకుంటూ, నిగ్రహించుకుంటూ వచ్చారని, తన జీవితంలో జరిగిన విషాదాన్ని వైరాగ్యం ద్వారా ఎదుర్కోవాలని చూశారని దీన్నిబట్టి అనిపిస్తోంది.
జీవితాన్ని విశాలంగా చూసేవారికి తప్పనిసరిగా ఒంటరితనం అనేది ఉంటుంది. ఇతరులతో వారికి థాట్ ఫ్రీక్వెన్సీ త్వరగా కలవదు. ఇలాంటివారు సమాజానికి రానురాను దూరమవుతారు. అందుకే సంకుచితత్వం అనేది మనిషికి చాలాసార్లు మేలు చేస్తుంది. కులమతాలు, అనుబంధాలు, ఆస్తులు, పదవులు ఇవన్నీ సంకుచితతత్వాలే అయినా మనిషి ఉనికికి అర్థం చెప్పేవి ఇవే. వీటన్నింటినీ వదిలించుకుంటూ వెళ్లాలనుకునేవారు అంతకంటే పెద్ద లక్ష్యాన్నో, ఆశయాన్నో నిర్మించుకోవాలి. లేకపోతే ఒంటరితనం వేధిస్తుంది. సమాజంలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నవాటిపై మనకు నమ్మకం లేనపుడు, మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఊతంగా పనికొచ్చే ఆసక్తుల్ని కనుక్కోవాలి, వాటిని ప్రేమించాలి. వాటితో ముడివేసుకుని కొత్త ప్రయాణం మొదలుపెట్టాలి.
ముఖ్యంగా మనిషికి ప్రేమించడానికి ఏదోఒకటి ఉండాలి. సాటిమనిషో, గుళ్లో దేవుడో, మతమో, డబ్బో, రాజకీయమో….ఏదో ఒకటి….
ఏదిఏమైనా జీవితంపై తనకో స్పష్టత ఉన్నదనుకున్నమనిషే ఇలా జీవితం నుండి పారిపోవడం తెలుగు సినిమా ప్రేక్షకులకు తీవ్ర నిరాశను, బాధను మిగిల్చింది. ఆయనతో పరిచయం ఉన్నవారిని భరించలేని విభ్రాంతికి, వేదనకు గురిచేసి ఉంటుందనడంలో సందేహం లేదు.
మనది ఆత్మహత్యల భారతం!
మన దేశం ప్రస్తుతం డిప్రెషన్‌తో సతమవుతోంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 8లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇందులో 1లక్షా 35వేల మంది భారతీయులే. సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనే భావనే, ఆత్మహత్యల నివారణకు పరిష్కారం లేకుండా చేస్తోంది. ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మానసిక వైద్యులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నారు. వాటి గురించి-
- ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నపుడు వాటిని తెగ్గొట్టే ప్రయత్నం చేయాలి. డాక్టరుని, లేదా మానసిక వైద్యులను వెంటనే సంప్రదించాలి. నమ్మకముంటే ఆధ్యాత్మిక వేత్తలను కలిసి మాట్లాడవచ్చు. ఎప్పటికప్పుడు ఒత్తిడిని నివారించే ప్రయత్నాలు చేయాలి. మనసులో ఉన్న భావాలను పేపరుమీద పెట్టడం, ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసే ప్రయత్నం చేయడం లాంటివి ఫలితాన్ని ఇస్తాయి. ఏదైనా సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పుడు, ఆత్మహత్య ఆలోచనలు తీవ్రంగా వస్తున్నపుడు… అయితే…ఏంటి…ఏం జరుగుతుందో చూస్తా….అనే తిరుగుబాటు ఆలోచనలు బలవంతంగా అయినా చేయగలగాలి. అప్పుడు ఆత్మహత్యా ఆలోచనలను నివారించగలగుతాం.
- అమెరికాలో నిర్వహించిన అధ్యయనాల్లో 10-14 ఏళ్ల వయసు మగపిల్లలు ఆడపిల్లలకంటే రెండు రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. 15-19 సంవత్సరాల మగపిల్లలు అమ్మాయిలకంటే ఐదురెట్లు ఎక్కువగా, 20-24 ఏళ్ల వయసులో, అమ్మాయిల కంటే పదిరెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా తేలింది.
- దీర్ఘకాలం ఆప్తుల శారీరక, మానసిక అనారోగ్యాలను చూసి ఉన్నవారికి, ఆ బాధ నుండి బయటపడటానికి తమ ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. వారి మనోవేదన గాఢత అంతగా ఉంటుంది.
మానసిక వైద్యులు తయారుచేసిన శాడ్ పర్సన్స్ స్కేల్ ప్రకారం ఈ కింది పరిస్థితులు ఆత్మహత్యను మరింతగా ప్రేరేపిస్తాయి
మగవారిలో, 19ఏళ్ల కంటే తక్కువ, 45 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో, డిప్రెషన్ ఉన్నవారిలో, అంతకుముందు ఆత్మహత్య ప్రయత్నాలు చేసినవారు, మానసిక అనారోగ్యాలకు గురయినవారిలో, ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకునేవారిలో, హేతుబద్దంగా ఆలోచించే శక్తి కోల్పోయినవారిలో, భార్యాభర్తల్లో ఒకరు మరణించినా, విడిపోయినా లేదా ఏదైనా ఆత్మీయ బంధం కోల్పోయినా…సమాజం నుండి చిన్నచూపు లేదా ఎలాంటి అండా లేకపోవడం, తీవ్రమైన శారీరక అనారోగ్యానికి గురయినవారిలో ఆత్మహత్యా తలంపులు ఎక్కువగా ఉంటాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-వి.దుర్గాంబ