Telugu Global
Cinema & Entertainment

లోఫర్‌ సినిమా రివ్యూ

రేటింగ్‌: 3/5 విడుదల తేదీ : 17 డిసెంబర్‌ 2015 దర్శకత్వం : పూరీ జగనాధ్‌ ప్రొడ్యూసర్‌ : సి. కళ్యాణ్‌ బ్యానర్‌:  సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ శుభ స్వేతా ఫిలిమ్స్‌ సంగీతం :  సునిల్‌ కాష్యప్‌ నటీనటులు : వరుణ్‌ తేజ, దిషా పటాని, పోసాని, రేవతి, ముఖేష్‌ రిషి, ఆలీ, సప్తగిరి, బ్రహ్మానందం ఒకప్పుడు హీరోలకి కొన్ని ఉదాత్తలక్షణాలు ఉండాలని కోరుకునేవారు. అందుకే టైటిల్స్‌కూడా కథానాయకుడు, ఆపద్భాందవుడు అని పెట్టేవారు. రాజకీయాల్లో స్వచ్ఛతపోయి మురికి ఎప్పుడు ప్రవేశించిందో అదే జీవితంలోకి కూడా వచ్చేసింది. […]

లోఫర్‌ సినిమా రివ్యూ
X

రేటింగ్‌: 3/5
విడుదల తేదీ : 17 డిసెంబర్‌ 2015
దర్శకత్వం : పూరీ జగనాధ్‌
ప్రొడ్యూసర్‌ : సి. కళ్యాణ్‌

బ్యానర్‌: సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ శుభ స్వేతా ఫిలిమ్స్‌
సంగీతం : సునిల్‌ కాష్యప్‌
నటీనటులు : వరుణ్‌ తేజ, దిషా పటాని, పోసాని, రేవతి, ముఖేష్‌ రిషి, ఆలీ, సప్తగిరి, బ్రహ్మానందం

ఒకప్పుడు హీరోలకి కొన్ని ఉదాత్తలక్షణాలు ఉండాలని కోరుకునేవారు. అందుకే టైటిల్స్‌కూడా కథానాయకుడు, ఆపద్భాందవుడు అని పెట్టేవారు. రాజకీయాల్లో స్వచ్ఛతపోయి మురికి ఎప్పుడు ప్రవేశించిందో అదే జీవితంలోకి కూడా వచ్చేసింది. దాని ప్రతిబింబమే సినిమాల్లో కూడా కనిపిస్తోంది. దర్శకుడు పూరీజగన్నాద్‌కి ఓ ఫిలాసపి ఉంది. మంచితనం, నిజాయితి ఇలాంటి పదాలను ఆయన నమ్మడు. అందుకే ఇడియట్‌లు, పోకిరీలు వచ్చారు. ఇప్పుడు ఒకడుగు ముందుకేసి లోఫర్‌ని కూడా రంగంలోకి పెట్టాడు.

వరుణ్‌తేజ్‌కి మాస్‌హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే తలాతోకాలేని కథ వల్ల ముకుంద మిస్‌ ఫైర్‌ అయ్యింది. కంచె హాలివుడ్‌ స్థాయి సినిమా. ఇది విమర్శకుల ప్రశంసలు పొందిందే కానీ సామాన్య ప్రేక్షకులకి చేరువకాలేకపోయింది. ఇప్పుడు లోఫర్‌తో అతను విజయం సాధించాడు.
నిజానికి ఇది సాదాసీదా కథ. రేవతి, పోసాని భార్యాభర్తలు. పోసాని అల్లరి చిల్లరిగా తిరిగే లోఫర్‌. ఇద్దరి మధ్య గొడవలు. కొడుకుని తీసుకుని వెళ్ళిపోతానని పోసాని అంటే, వాడిని నీలాగా లోఫర్‌గా పెంచడానికి నేనిష్టపడను అంటుంది రేవతి. కానీ పోసాని దొంగతనంగా కొడుకుని తీసుకెళ్ళి తనకంటే లోఫర్‌గా పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి జాండీస్‌తో చనిపోయిందని కొడుక్కి చెబుతాడు.

హీరో చిల్లరదొంగగా, మోసగాడిగా పెరుగుతాడు. కానీ అతనికి మదర్‌ సెంటిమెంట్‌. అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఎవరైనా చెబితే ఎంత డబ్బయినా ఇచ్చేస్తాడు. ఇలా ఉండగా చాలాసినిమాల్లోలాగానే ఇష్టంలేని పెళ్ళి తప్పించుకోడానికి హీరోయిన్‌ ఇంట్లోంచి పారిపోయి హీరోకి చేరువవుతుంది. ఆమె ఒక పెద్ద జమిందారు కూతురు. ఆ జమిందారు చెల్లెలే రేవతి. ఆస్తిని వదులుకుని పోసానిని పెళ్ళిచేసుకుని ఉంటుంది.

కథ ఇలా ఉండగా చనిపోయిందనుకున్న తల్లిని హీరో చూస్తాడు. దొంగగా ఉన్న హీరోని తల్లి ద్వేషిస్తుంది. తన కొడుకు ఎప్పుడో చనిపోయాడని చెబుతుంది. చివరికి హీరో తన మేనమామ ఆటకట్టించి హీరోయిన్‌ని పెళ్ళి చేసుకుంటాడు. అంతా రొటీన్‌ కథా, ఇందులో నచ్చడానికి ఏముందంటే అదే పూరీ మ్యాజిక్‌.

తండ్రిపాత్రలో పోసాని జీవించేసాడు. తండ్రి, కొడుకుల మధ్య హాస్యం పండింది. తల్లి పాత్ర రేవతికి నల్లేరు మీది నడక. తల్లిని చూసినపుడు వరుణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌. వరుణ్‌లో అద్భుతమైన నటుడున్నాడు. సరైన సినిమా పడితే తెలుగు తెరకు మరో మాస్‌ హీరో దొరికినట్టే.

ఈ ముగ్గురి మధ్య నడిచే డ్రామా పండింది. హీరోయిన్‌ (దిషా పటాని) గురించి చెప్పుకోడానికి ఏమీలేదు. పాటల్లో డాన్స్‌ చేయడం తప్ప నటించడానికి అవకాశం లేదు. సప్తగిరి, ఆలీ, బ్రహ్మానందం ఉన్నప్పటికీ సినిమానంతా పోసాని మోసాడు. విలన్‌గా ముకేష్‌రుషీ ఉన్నా అతని పరిధి చాలా తక్కువ.

మాస్‌కి కావాల్సిన విధంగా ఫైట్స్‌ ఉన్నాయి. రెండుపాటలు బాగున్నాయి. పర్వర్షన్‌, పూరీ జగన్నాధ్‌ ఒకే నాణానికి రెండు ముఖాలు. ఇద్దరిని విడదీసి చూడలేం. అతని పైత్యం ఎంత స్థాయికి వెళ్ళిందంటే కన్నతల్లినే కొడుకు పొడిచి చంపుతాడు. ఈ జుగుస్సాకర సన్నివేశం లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టమేమీలేదు. మన స్థాయి కూడా ఇప్పట్లో పెరగదుకాబట్టి ఈ సినిమాని హిట్‌ చేస్తాం.

వాస్తవానికి ఈ దేశానికి ఎక్కువనష్టం కలిగించిందెవరంటే కాంగ్రెస్‌ వాళ్ళని టక్కున చెబుతారు. నిజానికి కమ్యూనిస్టుల వల్లే ఎక్కువ హాని జరిగింది. వాళ్ళుకూడా ఉద్యమాలు నిర్మించలేని దుస్థితిలో ఉండడం, కొత్త తరాన్ని తయారు చేసుకోలేకపోవడం, యువకులకు దారి చూపించలేని చీకటిలో ఉండడం వల్ల సమాజానికి రోల్‌మోడల్స్‌ లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో పొకిరీలు, లోఫర్లే హీరోలుగా నచ్చుతారు.

-జి ఆర్‌. మహర్షి

First Published:  17 Dec 2015 7:41 AM IST
Next Story