Telugu Global
Others

పుస్తక దాతలుగా... యువతరం సేవలు!

చెన్నై వరదల కారణంగా చిన్నాభిన్నమైన వాతావరణ, జీవన పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు స్కూళ్లు, కాలేజీలు మానేసిన విద్యార్థులు ఆ మేరకు చదువులో వెనుకబడ్డారు. చాలామంది పిల్లలు తమ పుస్తకాలను కోల్పోయి ఎలా చదువుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇలాంటివారికి పుస్తకాలను అందించే ప్రయత్నాన్ని వాట్సప్ ద్వారా చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వారి పేర్లు వివిన్, వివేక్. పుస్తకాలు కావాల్సిన విద్యార్థులు వివిన్ని 9677035963 నెంబర్లోనూ, వివేక్ని 9566180758 నెంబర్లోనూ సంప్రదించవచ్చని […]

పుస్తక దాతలుగా... యువతరం సేవలు!
X

చెన్నై వరదల కారణంగా చిన్నాభిన్నమైన వాతావరణ, జీవన పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు స్కూళ్లు, కాలేజీలు మానేసిన విద్యార్థులు ఆ మేరకు చదువులో వెనుకబడ్డారు. చాలామంది పిల్లలు తమ పుస్తకాలను కోల్పోయి ఎలా చదువుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇలాంటివారికి పుస్తకాలను అందించే ప్రయత్నాన్ని వాట్సప్ ద్వారా చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వారి పేర్లు వివిన్, వివేక్. పుస్తకాలు కావాల్సిన విద్యార్థులు వివిన్ని 9677035963 నెంబర్లోనూ, వివేక్ని 9566180758 నెంబర్లోనూ సంప్రదించవచ్చని వీరు ప్రకటించారు. వివేక్, ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఈ అన్నదమ్ములు పుస్తకాల కోసం దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ నిధులు సేకరిస్తున్నారు. వాట్సప్ ద్వారా ఈ మెసేజిని ప్రచారంలోకి తెచ్చిన వెంటనే 25 మంది విద్యార్థులు తమకు పుస్తకాలు కావాలంటూ వీరిని కోరారు.

ఈ ఇద్దరే కాక ఇంకా చాలామంది సేవాగుణంతో ఈ విషయంలో ముందుకొస్తున్నారు. శ్రీధర్ అనే వ్యక్తి మైలాపూర్లో పుస్తకాల షాపుని నడుపుతున్నాడు. సంవత్సరం మధ్యలో పుస్తకాలు కావాలంటే కష్టమని అతనికి తెలుసు. అందుకే ఢిల్లీ నుండి పుస్తకాలను తెప్పించి అవసరం ఉన్నవారికి ఉచితంగా అందిస్తున్నాడు. ఇంకా బసంత్ నగర్లోని సీనియర్ సిటిజన్ గ్రూపు సైతం విద్యార్థులకు పుస్తకాలను అందించే ప్రయత్నం చేస్తున్నది.

మణి గంధన్ అనే మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి తన పుస్తకాలు మొత్తం పోగొట్టుకున్నాడు. అతనికి జనవరిలో పరీక్షలు ఉన్నాయి. తెలిసినవారిని సహాయం కోసం అడిగాడు. దాంతో పాటు తన అవసరాన్ని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని వినయ్ కుమార్ అనే సివిల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చూశాడు. మణిగంధన్కి తన పుస్తకాలు పనికొస్తాయని అర్థమైన వినయ్ కుమార్, ఒక ఆదివారం నాడు ముప్పయి కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్నా యూనివర్శిటీ రిలీఫ్ క్యాంప్లో ఉన్న మణిని కలిశాడు. తన పుస్తకాలు ఇచ్చాడు. వినయ్ తనకు ఆరు సబ్జక్టుల పుస్తకాలు తెచ్చి ఇచ్చాడని, అతని రుణం తాను తీర్చుకోలేనని మణి చెబుతున్నాడు. ఇంకా ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న కుటుంబాల తాలూకూ పిల్లలకు, పోయిన క్లాసుల పాఠాలను తిరిగి చెప్పేందుకు విద్యాసంస్థలు కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం బాధిత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాలను చేపడుతున్నది.

First Published:  15 Dec 2015 5:51 AM IST
Next Story