ఆర్.జె.డి. మాజీ ఎం.పి.కి జీవిత ఖైదు
బిహార్ లోని సివాన్ జిల్లాలో 11 ఏళ్ల కింద ఇద్దరు సోదరుల మీద ఆసిడ్ పోసి హతమార్చినందుకు ఆర్.జె.డి. మాజీ ఎం.పి. మహమ్మద్ షాబుద్దీన్ కు, మరో ముగ్గురికి జిల్లా కోర్టు గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. షాబుద్దీన్ తో పాటు రాజ్ కుమార్ షా, షేక్ అస్లం, ఆరిఫ్ హుసేన్ కు జీవిత ఖైదు అదనపు జిల్లా జడ్జి అజయ్ కుమార్ ఈ శిక్ష విధించారు. హత్య, అపహరణ, బలవంతంగా డబ్బు వసూలు చేయడం, […]
బిహార్ లోని సివాన్ జిల్లాలో 11 ఏళ్ల కింద ఇద్దరు సోదరుల మీద ఆసిడ్ పోసి హతమార్చినందుకు ఆర్.జె.డి. మాజీ ఎం.పి. మహమ్మద్ షాబుద్దీన్ కు, మరో ముగ్గురికి జిల్లా కోర్టు గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
షాబుద్దీన్ తో పాటు రాజ్ కుమార్ షా, షేక్ అస్లం, ఆరిఫ్ హుసేన్ కు జీవిత ఖైదు అదనపు జిల్లా జడ్జి అజయ్ కుమార్ ఈ శిక్ష విధించారు.
హత్య, అపహరణ, బలవంతంగా డబ్బు వసూలు చేయడం, సాక్ష్యాలు మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం అన్న నేరాలకు ఈ నలుగురు పాల్పడ్డట్టు కోర్టు ధృవీకరించింది.
మహమ్మద్ షాబుద్దీన్ కు ఈ కేసులో రూ. 20, 000 జరిమానా కూడా విధించారు.
2004 ఆగస్టు 16న గోశాల రోడ్డు నుంచి చంద్ర శేఖర్ ప్రసాద్ కుమారులు ముగ్గురిని రాజ్ కుమార్ షా, షేక్ అస్లం, ఆరిఫ్ హుసేన్ అపహరించి ప్రతాప్ పూర్ గ్రామానికి తీసుకెళ్లారు. గిరీశ్, సతీశ్ మీద ఆసిడ్ పోయడం వల్ల వారిద్దరూ మరణించారు. రాజీవ్ రోషన్ మాత్రం తప్పించుకోగలిగాడు.
మరణించిన ఇద్దరి శవాలు కూడా దొరకలేదు. మృతుల తల్లి కళావతి దేవి షాబుద్దీన్ అనుయాయులు తన కుమారులను హతమార్చినట్టూ కేసు దాఖలు చేశారు.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో షాబుద్దీన్ పేరు కూడా బయట పడింది.
తనను అపహరించిన వారి నుంచి తప్పించుకున్న రాజీవ్ రోషన్ న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పారు. కాని అతనిని గత ఏడాది జులై 16న గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.
షాబుద్దీన్ కొన్నేళ్లుగా సివాన్ కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన మీద ఇంకా అనేక కేసులు ఉన్నాయి.
షాబుద్దీన్ 1996 నుంచి 2009 మధ్య నాలుగు సార్లు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్.జె.డి. అభ్యర్థిగా లోక సభకు ఎన్నికయ్యారు. ఆయన మీద ఉన్న నేరాలు రుజువైనందువల్ల 2009, 2014 ఎన్నికలలో షాబుద్దీన్ పోటీ చేయలేక పోయారు.
ఆయన భార్య హీనా సాహెబ్ 2009, 2014 ఎన్నికలలో ఆర్.జె.డి. అభ్యర్థిగా పోటీ చేసి ఓం ప్రకాశ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు.
షాబుద్దీన్ అంతకు ముందు 1989 లో జిరేది నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.