ఇలా చేస్తే...పాపాయి చటుక్కున ఏడుపు మానేస్తుందట!
రోజుల వయసులో ఉన్న పిల్లలు కొంతమంది బాగా ఏడుస్తుంటారు. పగలంతా పడుకుని రాత్రంతా ఏడుస్తూ పెద్దవాళ్లని ముప్పుతిప్పలు పెడుతుంటారు మరి కొందరు. కారణం లేకుండా ఇలా ఏడ్చే శిశువులను ఏడుపు మాన్పించే అద్భుత చిట్కా ఒకటుందని అమెరికాకు చెందిన పిల్లల డాక్టర్ రాబర్ట్ హమిల్టన్ అంటున్నారు. పిల్లలను ఏడుపు మాన్పించే పద్ధతిని వివరిస్తూ, చూపిస్తూ తీసిన నాలుగునిముషాల వీడియోని రాబర్ట్, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన నాలుగు రోజుల్లోనే దీన్ని 17 లక్షలమంది చూశారు. […]
రోజుల వయసులో ఉన్న పిల్లలు కొంతమంది బాగా ఏడుస్తుంటారు. పగలంతా పడుకుని రాత్రంతా ఏడుస్తూ పెద్దవాళ్లని ముప్పుతిప్పలు పెడుతుంటారు మరి కొందరు. కారణం లేకుండా ఇలా ఏడ్చే శిశువులను ఏడుపు మాన్పించే అద్భుత చిట్కా ఒకటుందని అమెరికాకు చెందిన పిల్లల డాక్టర్ రాబర్ట్ హమిల్టన్ అంటున్నారు. పిల్లలను ఏడుపు మాన్పించే పద్ధతిని వివరిస్తూ, చూపిస్తూ తీసిన నాలుగునిముషాల వీడియోని రాబర్ట్, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన నాలుగు రోజుల్లోనే దీన్ని 17 లక్షలమంది చూశారు. ఇంకా చూస్తున్నారు. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పిల్లలను పట్టుకోవడం ఈ విధానంలో చాలా ముఖ్యం.
రాబర్ట్ హమిల్టన్‌కి పిల్లల వైద్యుడిగా 30 సంవత్సరాల అనుభవం ఉంది. కాలిఫోర్నియాలో ఆయన పనిచేస్తున్నారు. ఆఫ్రికాలో స్వచ్ఛంద వైద్య సేవా సంస్థలను నడుపుతున్నారు. తన వైద్య కెరీర్‌లో వేలమంది పిల్లలకు చికిత్సను అందించి ఉన్న రాబర్ట్, తన సొంతపిల్లలు ఆరుగురు, ముగ్గురు మనవలపై కూడా ఈ చిట్కాని ప్రయోగించి ఏడుపు ఆపించారట.
ఆయన చెప్పిన మ్యాజిక్ మెథడ్ నాలుగు స్టెప్పులుగా ఉంటుంది. పాపాయిని చేతుల్లోకి తీసుకుని ఆమె రెండు చేతులు తన ఛాతీ చుట్టూ పెట్టుకునేలా మడవాలి. అలా చేతులను తన ఛాతీ చుట్టూ అల్లుకున్నట్టుగా పెట్టుకున్న పాపాయిని, ఆమె ఛాతీవద్ద మన ఎడమచేయి ఉంచి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు బేబీ గడ్డం కింద మన చేయి ఉంటుంది. ఇప్పుడు మన కుడిచేతిలో పాపని కూర్చోబెట్టుకోవాలి. అలా చేసినపుడు పాపని మన రెండుచేతులతో పట్టుకునే వీలు ఉంటుంది. పాపాయి డైపర్ ఉన్న ప్రదేశాన్ని వేళ్లతో కాకుండా మన అరచేయి అక్కడ ఉండేలా పాపాయికి సౌకర్యంగా అనిపించేలా పట్టుకోవాలి. ఇప్పుడు పాపని 45డిగ్రీల కోణంలో ముందుకు వంచి కాసేపు ముందుకు వెనుకకు ఊపుతూ ఉండాలి. అలా ఊపేటప్పుడు జర్క్ ఇచ్చినట్టుగా కాకుండా మన చేతులు చాలా స్థిరంగా ముందుకు, వెనక్కు కదలాలి. అలాగే పాపని కూర్చోబెట్టుకున్న చేతిని బాగా కదుపుతూ పాపాయి నడుము కింది భాగాన్ని ఊపినట్టుగా కదపాలి. ఇదంతా చేస్తున్నప్పుడు పాపని ముందుకు వంచకపోతే చేతులు విడిపించుకుని తలని వెనక్కి ఎగరేయవచ్చు. అప్పుడు మన పట్టు జారిపోతుంది. ఇదంతా చాలా మృదువుగా చేయాలి.
ఇలా చేయగానే ఎంతగా ఏడుస్తున్న బేబీ అయినా సెకండ్లలో ఏడుపు మానేస్తుందని, ఒక వేళ ఏడుపు మానకపోతే బేబీకి ఆకలివేయడమో, ఒంట్లో బాగోలేకపోవడమో జరిగి ఉంటుందని గ్రహించాలని ఆయన చెబుతున్నారు. ఆయన చెప్పినట్టుగానే వీడియోలో ఆశ్చర్యంగా సెకన్లలో పిల్లలు ఏడుపుని ఆపేయడం మనకు కనబడుతుంది.
మూడునెలల లోపు పిల్లలకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎందుకంటే వారినే మనం తేలిగ్గా రెండుచేతుల్లోకి అలా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. రెండు చేతులను చిన్నారి తన ఛాతీకి అల్లుకున్నట్టుగా పెట్టుకుంటుంది కనుక తనకు తల్లిగర్భంలో ఉన్నప్పటి ఫీలింగ్ వస్తుందని అందుకే ఏడుపుని ఆపేస్తుందని డాక్టర్ రాబర్ట్ అంటున్నారు. ఈ టెక్నిక్‌ని ఎంతమంది తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే తనకు అంత సంతోషమని రాబర్ట్ చెబుతున్నారు. అయితే చిన్నపిల్లలతో వ్యవహారం కనుక చాలా జాగ్రత్తగా ప్రయత్నించాలి. ముందు మంచంమీద కూర్చుని ఈ చిట్కాని ప్రయోగిస్తే మంచిది.