డాక్టర్లలో డిప్రెషన్!
వైద్యుడు…తమ బాధల్ని చేత్తో అలాగ్గా తీసేసే అద్భుత వ్యక్తిగా రోగులు నమ్మే మనిషి. అలా దైవసమానం అనిపించుకునే వ్యక్తికే డిప్రెషన్ వస్తే…ఇక సాధారణ జనాన్ని కాపాడేదెవరు? రెసిడెంట్ డాక్టర్ల(ఒక తరహా వైద్య శిక్షణలో ఉన్నవారు)లో ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్‌కి చేరువలో ఉన్నారని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసినవారిలో దాదాపు మూడోవంతు అంటే 17,500 మంది రెసిడెంట్ ఫిజీషియన్ల (ట్రైనింగ్‌లో ఉన్న యువ డాక్టర్లు)లో డిప్రెషన్ సూచనలు ఉన్నట్టుగా గమనించారు. అమెరికా […]
వైద్యుడు…తమ బాధల్ని చేత్తో అలాగ్గా తీసేసే అద్భుత వ్యక్తిగా రోగులు నమ్మే మనిషి. అలా దైవసమానం అనిపించుకునే వ్యక్తికే డిప్రెషన్ వస్తే…ఇక సాధారణ జనాన్ని కాపాడేదెవరు? రెసిడెంట్ డాక్టర్ల(ఒక తరహా వైద్య శిక్షణలో ఉన్నవారు)లో ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్‌కి చేరువలో ఉన్నారని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసినవారిలో దాదాపు మూడోవంతు అంటే 17,500 మంది రెసిడెంట్ ఫిజీషియన్ల (ట్రైనింగ్‌లో ఉన్న యువ డాక్టర్లు)లో డిప్రెషన్ సూచనలు ఉన్నట్టుగా గమనించారు. అమెరికా పత్రిక జామా (ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్)లో ఈ వివరాలు ప్రకటించారు. 1963 నుండి 2015 వరకు నిర్వహించిన 54 అధ్యయనాల ఫలితాలను సమీక్షించిన పరిశోధకులు ఈ విషయాలను తేల్చారు. మిచిగాన్, హార్వర్డ్ యూనివర్శిటీల వైద్యులు నిర్వహించిన ఈ అధ్యయనాలను బట్టి ట్రైనింగ్ దశలో ఉన్న సమయంలో 28.8శాతం మంది వైద్యులు డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఈ లెక్కలను బట్టి సాధారణ జనం కంటే ఎక్కువ సంఖ్యలో వైద్యులు డిప్రెషన్‌కి గురవుతున్నారని వైద్యరంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పైగా గత అయిదు దశాబ్దాలుగా ఈ డిప్రెషన్ రేటు మరింత పెరుగుతోంది. ట్రైనింగ్‌లో ఉన్న వైద్యులు ఇలాంటి పరిస్థితిలో ఉండటంతో రోగులకు నాణ్యత గల వైద్యం అందించలేకపోతున్నారని ఈ పరిశోధకులు గుర్తించారు.
రెసిడెంటు డాక్టర్ల మానసిక ఆరోగ్యాన్ని, పేషంట్ల ఆరోగ్యాన్ని పెంచేందుకు కొన్ని సంవత్సరాలుగా వారి శిక్షణలో నూతన సంస్కరణలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ అధ్యయనాల ఫలితం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, అలాగే దీనిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరమూ ఉందని మిచిగాన్ యూనివర్శిటీ సైకియాట్రిస్ట్ డాక్టర్ సృజన్ సేన్ అన్నారు. మెడికల్ ట్రైనింగ్ విధానంలో ప్రాథమిక మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మరికొంతమంది వైద్య రంగ నిపుణులు అంటున్నారు.
ఎందుకిలా…
20, 30 సంవత్సరాల క్రితం ఉన్న డాక్టర్ ట్రైనింగ్ విధానానికి ఇప్పటి విధానానికి ఎంతో తేడా ఉందని అదే డాక్టర్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని జామా పత్రిక ఎడిటోరియల్ పేర్కొంది. డాక్టర్ల ప్రతిభకు ఆన్‌లైన్ రేటింగ్ ఇవ్వడం, డైరక్ట్ టు కంజూమర్ ఎడ్వర్టైజింగ్ (ఏ అనారోగ్యాలకు ఏ మందులు వాడాలో వివరంగా తెలియజేస్తూ మందుల ఉత్పత్తి దారులు ప్రకటనలు ఇవ్వడం. అమెరికా, న్యూజిలాండ్‌ల్లో ఈ పద్ధతి ద్వారా ఏ రోగానికి ఏమందులు వాడాలో వివరిస్తూ ప్రకటించే అవకాశం ఉంది. యూరోపియన్ దేశాల్లో దీనిపై నియంత్రణ ఉంది), దీనికారణంగా డాక్టర్లపై పేషంట్ల ఒత్తిడి, తమకు లేని అనారోగ్యాలకు కూడా పేషంట్లు మందులు వాడాలని వైద్యులపై ఒత్తిడి తేవడం… పేషంట్లను శ్రద్ధగా చూసుకోవాల్సిన బాధ్యత అత్యధికంగా ఉండటం, మిగిలిన వైద్యులకంటే తక్కువస్థాయిగా గుర్తింపు, ఎక్కువ పనిగంటలు… ఇవన్నీ ట్రైనింగ్‌లో ఉన్న డాక్టర్లను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని జామా పత్రిక ఎడిటోరియల్ వెల్లడించింది. నూతన డాక్టర్లు రోజులో 40 నుండి 50శాతం కాలాన్ని కంప్యూటర్ల ముందే గడపాల్సి వస్తోందని కూడా జామా ఎడిటోరియల్ రాసిన థామస్ చ్వెంక్ తన రాతల్లో పేర్కొన్నారు. ఇవన్నీ వైద్య శిక్షణ విధానంలో చాలా ఆందోళన చెందాల్సిన విషయాలని ఆయన అన్నారు.