గిరిజనుల మార్గదర్శి బి.డి.శర్మ
డా. బ్రహ్మదేవ్ శర్మ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. డా. బి.డి.శర్మ అంటే అనేక మందికి ఆయన ఎవరో స్ఫురిస్తుంది. 2012లో బస్తర్ జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను మావోయిస్టులు బందీని చేసినప్పుడు ఆయనను విడిపించడంలో సఫలమైన మధ్యవర్తి డా. బి.డి. శర్మ అంటే పత్రికలు చదివేవారందరికీ వెంటనే గుర్తొస్తుంది. వృత్తి రీత్యా ఆయన ఐఏఎస్ అధికారి. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నతోద్యోగిగా ఉన్నప్పుడు, ఉద్యోగ విరమణ తర్వాత పాతికేళ్లకు పైగా […]
డా. బ్రహ్మదేవ్ శర్మ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. డా. బి.డి.శర్మ అంటే అనేక మందికి ఆయన ఎవరో స్ఫురిస్తుంది. 2012లో బస్తర్ జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను మావోయిస్టులు బందీని చేసినప్పుడు ఆయనను విడిపించడంలో సఫలమైన మధ్యవర్తి డా. బి.డి. శర్మ అంటే పత్రికలు చదివేవారందరికీ వెంటనే గుర్తొస్తుంది. వృత్తి రీత్యా ఆయన ఐఏఎస్ అధికారి. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నతోద్యోగిగా ఉన్నప్పుడు, ఉద్యోగ విరమణ తర్వాత పాతికేళ్లకు పైగా పాటు ప డ్డాడు. డా. శర్మ 86వ ఏట గ్వాలియర్ లోని స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
అవిభక్త మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. 1981లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయిదేళ్ల పాటు మేఘాలయలోని షిల్లాంగ్ లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలరుగా ఉన్నారు. ఆ తర్వాత జాతీయ ఎస్.సి., ఎస్.టి. కమిషనరుగా పని చేశారు. ఎక్కడ పని చేసినా చివరి వరకు ఆయన ధ్యాసంతా గిరిజనుల హక్కుల గురించే. పేదలను, అణగారిన వర్గాలవారిని, ముఖ్యంగా ఆదివాసీలను దోపిడీ చేయడాన్ని నిరంతరం నిరసించారు.
గిరిజనుల హక్కులను పరిరక్షించడానికి షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీలను విస్తరించే చట్టం, అటవీ హక్కుల చట్టం రూపొందడంతో పాటు ఈ సమస్యలపై ప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యల వెనక ఆయన పాత్ర ఉంది. అయితే ఆయన ప్రభుత్వం తీసుకున్న చర్యల మీదే ఆధారపడిన వారు కాదు. మెరుగైన సమాజం కోసం, న్యాయమైన సమాజం కోసం పోరాడడానికి ప్రజలు సమీకృతం కావాలని భావించారు. గిరిజనులను సమైక్యం చేయడం కోసం ఆయన విపరీతంగా ప్రయత్నించారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, వనరులు, ఉపాధి మీద ప్రజలకు ఉమ్మడి అధికారం ఉండాలని భావించేవారు. బడా కార్పొరేట్ సంస్థలు, పట్టణాలలో నివసించే ఉన్నత వర్గాల వారి ప్రయోజనాలకోసం రాజకీయాలను పెడదారి పట్టిస్తున్నారని అభిప్రాయపడే వారు. వ్యవసాయాన్ని పనిగట్టుకుని ధ్వంసం చేస్తున్నారనీ, సహజ వనరులను కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనివల్ల రైతులు దిక్కులేని వారిగా మిగిలిపోతున్నారన్నది డా. శర్మ ఆవేదన.
ఆయన కేవలం పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వ ఉన్నతోద్యోగే కాదు. వారిని సమీకరించి ఉద్యమించిన సామాజిక కార్యకర్త మాత్రమే కాదు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. ఆయన పుస్తకాలు చత్తీస్ గఢ్ లోని సామాన్యుల చేతుల్లోనూ, సామాజిక కార్యకర్తల చేతుల్లోనూ కనిపిస్తాయి. ఆ పుస్తకాలు చదివిన వారు ఆయనను తమ ప్రాంతానికి ఆహ్వానించే వారు. ఆ రకంగా ఆయన దేశ వ్యాప్తంగా పర్యటించారు. ఆయన వాదనల ప్రతిధ్వని కేరళ, మహారాష్ట్ర లాంటి చోట కూడా వినిపిస్తుంది. ప్రజలు అన్యాయాన్ని సహించరని ఆయన చెప్పేవారు. అందుకే ఆయన అనేక మందికి స్ఫూర్తిప్రదాతగా మిగిలారు.
డా. శర్మ భారత్ జన్ ఆందోళన్ కు జాతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రజోద్యమాలను నడుపుతున్న వారిని ఒక్క తాటిమీదకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా 1992 అక్టోబర్ లో మేధా పాట్కర్, ప్రదీప్ ప్రభు, డా.వినయన్, జార్జ్ పిళ్లే, గ్యాన్ సింగ్ వంటి వారు ఒకే వేదికమీద సమావేశమయ్యారు. బిహార్ లోని రాంచి, రాయపూర్ జిల్లాలోని నాగరి-సిహావా, మధ్య ప్రదేశ్ లోని సర్గుజ జిల్లాలోనూ భారత్ జన్ ఆందోళన్ ప్రభావం ఎక్కువగా ఉంది. 1992లో భారత్ జన ఆందోళన్ ప్రణాళిక విడుదలైంది. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ సంస్థ గిరిజనుల స్వయంపరిపాలనపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. భారత్ జన్ ఆందోళన్ సంస్థ రిజిస్టర్ అయిన సంస్థ కాదు. ఈ సంస్థను రిజిస్టర్ చేస్తే ప్రభుత్వ అక్రమ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం సన్నగిల్లుతుందని శర్మ భావించే వారు. డా. శర్మ తన పింఛన్ డబ్బులు ఈ సంస్థకే ఇచ్చేసే వారు. సానుభూతిపరుల దగ్గర విరాళాలు సేకరించే వారు. అయితే సంస్థల నుంచి విరాళాలు స్వీకరించకూడదన్నది భారత్ జన్ ఆందోళన్ నియమం.
చాలా మంది ముందు ఓ సంస్థను ఏర్పాటు చేసి తర్వాత తమ భావాలను వ్యాప్తి చేయాలనుకుంటారు. కాని ముందు భావాలు ప్రజలలోకి వెళ్లాలన్నది డా. శర్మ అభిప్రాయం. భారత్ జన్ అందోళన్ లో భాగస్వాములయ్యే యువకులకు శర్మ స్వయంగా శిక్షణ ఇచ్చే వారు. ఈ యువకులు ఆ తర్వాత గ్రామాలలో పూర్తి కాలం స్వచ్ఛందంగా పని చేస్తారు. “గ్రామ గణ రాజ్యం”, “మా ఊరు-మా రాజ్యం” అన్నవి శర్మ బలంగా ప్రజలలోకి తీసుకెళ్లిన నినాదాలు. “జల్-జంగల్-జమీన్” ఆన్నది శర్మ ఉద్యమంలో ప్రధాన నినాదం. ఉన్నతాధికారులు సాధారణంగా ప్రజలకు అనుకూలంగా ఉండరు. కాని ప్రజల కోసమే ఆలోచించిన అరుదైన అధికారి, ఉద్యమ కారుడు డా. శర్మ.
-ఆర్వీ రామారావ్