Telugu Global
Others

అసహనానికి పరాకాష్ఠ

అసహనం ఇతర మతాల వారికే పరిమితం కాదు. వ్యక్తులలో కూడా అసహనం తొంగి చూస్తూ ఉంటుంది. అధికారం ఉన్న వాళ్లలో అసహనం పెల్లుబికితే మాత్రం ప్రమాదమే. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు అనిల్ విజ్ అసహనం వ్యక్తం చేసి వార్తల్లోకెక్కిన తర్వాత ఇప్పుడు జార్ఖండ్  ముఖ్యమంత్రి రఘువర్ దాస్ వంతు అయింది. ఆయనా బీజేపీ నాయకుడే. ఒకే రోజు మూడు సార్లు బహిరంగంగా అసహనం ప్రదర్శించి రఘువర్ దాస్ వార్తలలోకి ఎక్కారు. ఆదివారం బొకారో […]

అసహనానికి పరాకాష్ఠ
X

అసహనం ఇతర మతాల వారికే పరిమితం కాదు. వ్యక్తులలో కూడా అసహనం తొంగి చూస్తూ ఉంటుంది. అధికారం ఉన్న వాళ్లలో అసహనం పెల్లుబికితే మాత్రం ప్రమాదమే. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు అనిల్ విజ్ అసహనం వ్యక్తం చేసి వార్తల్లోకెక్కిన తర్వాత ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ వంతు అయింది. ఆయనా బీజేపీ నాయకుడే. ఒకే రోజు మూడు సార్లు బహిరంగంగా అసహనం ప్రదర్శించి రఘువర్ దాస్ వార్తలలోకి ఎక్కారు.

ఆదివారం బొకారో డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్, ధన్ బాద్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ తో పాటు మరో బడి పంతులు మీద రఘువర్ దాస్ చిందులు తొక్కారు. ధన్ బాద్ లో ఆదివారం రఘువర్ దాస్ ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన పక్కనే ఉన్న బొకారో డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్ ఎవరితోనో మొబైల్ ఫోన్ లో మాట్లాడడంతో ముఖ్యమంత్రికి చిర్రెత్తుకొచ్చి ఆ గది లోంచి వెళ్లిపొమ్మని ఆదేశించారు. ఆ సమావేశంలో ధన్ బాద్ పార్లమెంటు సభ్యుడు పి.ఎన్.సింగ్ కూడా ఉన్నారు. అదే సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ధన్ బాద్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ వేదిక ముందు నుంచి వెళ్లడంతో ముఖ్యమంత్రి అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. అంతే ఆయనను సస్పెండ్ చేయాలని హుకుం జారీ చేశారు. ఒక బడి పంతులు ముఖ్య మంత్రికి ఏదో సూచన చేస్తుండగా “విషయమేమిటో చెప్పు” అని ముఖ్యమంత్రి గద్దించారు. ఆగ్రహోదగ్రుడైన ముఖ్యమంత్రి ఆ బడి పంతులు దగ్గర మైకు లాగేయండి అని ఆదేశించారు.

ముఖ్యమంత్రి తరచుగా అధికారులను అవమానిస్తున్నారని అధికారవర్గాలలో అసంతృప్తి రగులుతోంది. గత సంవత్సర కాలంగా సాధించిందేమీ లేనందువల్లే ముఖ్యమంత్రిలో అసహనం అహంకారం రూపంలో వ్యక్తమవుతోందని ప్రతిపక్ష పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా విమర్శించింది. గత ఏడాదిలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది.

First Published:  9 Dec 2015 3:38 AM GMT
Next Story