Telugu Global
Others

జీవితంలో మొద‌టిసారి ఇల్లుని పోగొట్టుకున్నా..!

చెన్నై వానల బీభత్సంలో మొట్టమొదటి సారి ఇల్లుని కోల్పోయాన‌ని, ఒక్కసారిగా ఏంచేయాలో పాలుపోక స్తంభించి పోయానని సినీనటుడు సిద్దార్ధ అన్నాడు. ఇల్లు, మూడు కార్లు, మూడు స్టూడియోలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోవ‌డంతో అలా చేష్టలుడిగి నిలబడిపోయాన‌న్నాడు. తరువాత తన మనసులో మధ్యతరగతి జనం మెదిలారని, వారు ఇంకెంతగా విలవిలలాడిపోయి ఉంటారో క‌దా అనుకుంటే చాలా బాధగా అనిపించిందని ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్థ చెప్పాడు. ఇప్పుడిప్పుడే తన ఇంట్లోంచి నీరు బయటకు వెళుతోందని, ఇక కరెంటు అంతకుముందు […]

జీవితంలో మొద‌టిసారి ఇల్లుని పోగొట్టుకున్నా..!
X

చెన్నై వానల బీభత్సంలో మొట్టమొదటి సారి ఇల్లుని కోల్పోయాన‌ని, ఒక్కసారిగా ఏంచేయాలో పాలుపోక స్తంభించి పోయానని సినీనటుడు సిద్దార్ధ అన్నాడు. ఇల్లు, మూడు కార్లు, మూడు స్టూడియోలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోవ‌డంతో అలా చేష్టలుడిగి నిలబడిపోయాన‌న్నాడు. తరువాత తన మనసులో మధ్యతరగతి జనం మెదిలారని, వారు ఇంకెంతగా విలవిలలాడిపోయి ఉంటారో క‌దా అనుకుంటే చాలా బాధగా అనిపించిందని ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్థ చెప్పాడు.

ఇప్పుడిప్పుడే తన ఇంట్లోంచి నీరు బయటకు వెళుతోందని, ఇక కరెంటు అంతకుముందు రోజే వచ్చిందని సోమవారం ఇచ్చిన ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఇక్కడ ఒక ఊరట కలిగించే విషయం ఏమిటంటే బాధితులకంటే స్వచ్ఛంద సేవకులు ఎక్కువగా కనిపించారని, సోషల్ మీడియా వలన ఇది సాధ్యమైందని, గత ఏడాది జమ్ము కాశ్మీర్లో భారీ వరదల సందర్భంనుండీ ఈ తరహా ఒరవడిని మనం చూస్తున్నామని సిద్దార్థ అన్నాడు. వరదల్లో మునిగిపోయిన 15 కడలూరు జిల్లా గ్రామాల‌కు వెళ్లి వచ్చిన సిద్ధార్థ, సోషల్ మీడియా వలన ఎంతో మేలు జరిగిందని, కానీ కొన్ని లోపాలను కూడా భరించాల్సి వచ్చిందని అన్నాడు. ఇందుకు ఒక ఉదాహరణని చూపాడు. ఈ రోజు ఒక ప్రదేశంలో జనం తమకు ఐదువేల వాటర్ బాటిల్సు కావాలని మెసేజ్ పెడితే అవి వారికి చేరతాయి. కానీ ఆరు రోజుల తరువాత కూడా ఆ మేసేజ్ అక్కడే ఉండి బాటిల్స్ పారేయడానికి డస్ట్ బిన్స్ కావాల్సిన సమయంలోనూ నీళ్ల బాటిల్సే అక్కడకు చేరతాయి అంటూ సోషల్ మీడియా పనితీరులోని ఇబ్బందిని గురించి సిద్దార్థ చెప్పుకొచ్చాడు. కడలూరులో పరిస్థితులు దారుణంగా ఉన్నా, సోష‌ల్ మీడియా చూపించినంత దారుణంగా లేవన్నాడు.

నిజానికి పెద్దపెద్ద డబ్బాల్లో వస్తున్న ఆహారం కంటే దుప్పట్లు, చాపలు, తలదాచుకునే ప్రదేశాల అవసరం ఎక్కువగా ఉందని, ఆహారం హైవే రోడ్లమీద దొంగలపాలవడమూ జరిగిందని చెప్పాడు. ఈ దారుణ పరిస్థితులు కాస్త నెమ్మదించాక జనం ఇల్లువాకిలి, బతుకుతెరువులాంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నాడు.

మరొక ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఏ ప్రభుత్వానికీ అనుకూలం, వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఈ విపత్తుని సమర్ధవంతంగానే ఎదుర్కొందన్నాడు. ఇంత పెద్ద విప‌త్తు త‌రువాత ఏ ప్ర‌భుత్వ‌మూ అయిదారురోజుల్లో అంతా చ‌క్క‌బ‌రిచేయాల‌ని మ‌నం ఆశించ‌కూడ‌ద‌ని సిద్ధార్థ అన్నాడు.

First Published:  8 Dec 2015 5:29 AM IST
Next Story