ఆశయముంటే ఆయుష్షు పెరుగుతుందట!
ఎవరైతే తమ జీవితం గొప్పదని, తాము ఎంతో విలువైనవాళ్లమని అనుకుంటారో అలాంటి వారు ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు పరిశోధకులు. తమ కంటూ ఒక గొప్ప ఆశయం, లక్ష్యం ఏర్పరచుకుని దానికోసం బతుకుతున్నాం అనుకునేవారికి గుండెజబ్బులు తక్కువగా వస్తాయని, వారి ఆయుష్షు కూడా ఇతరులకంటే ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. న్యూయార్క్ వైద్యులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. జీవితకాలానికి, ఇలాంటి ఆలోచనలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో పూర్తిగా ఒక కొలిక్కి రాకపోయినా, మా జీవితానికి ఒక సార్దకత ఉంది…అనే భావాన్ని పెంచుకోండి…అనారోగ్యాలకు దూరంగా ఉండండి… అని సలహా ఇస్తున్నారు […]
ఎవరైతే తమ జీవితం గొప్పదని, తాము ఎంతో విలువైనవాళ్లమని అనుకుంటారో అలాంటి వారు ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు పరిశోధకులు. తమ కంటూ ఒక గొప్ప ఆశయం, లక్ష్యం ఏర్పరచుకుని దానికోసం బతుకుతున్నాం అనుకునేవారికి గుండెజబ్బులు తక్కువగా వస్తాయని, వారి ఆయుష్షు కూడా ఇతరులకంటే ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. న్యూయార్క్ వైద్యులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. జీవితకాలానికి, ఇలాంటి ఆలోచనలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో పూర్తిగా ఒక కొలిక్కి రాకపోయినా, మా జీవితానికి ఒక సార్దకత ఉంది…అనే భావాన్ని పెంచుకోండి…అనారోగ్యాలకు దూరంగా ఉండండి… అని సలహా ఇస్తున్నారు వారు.
అమెరికా, జపాన్‌ల్లో నిర్వహించిన పది అధ్యయనాల ఫలితాలను ఒకచోట చేర్చి, విశ్లేషించి చివరికి ఈ నిర్దారణకు వచ్చారు వారు. ఈ అధ్యయనాల్లో 1లక్షా 36వేల మంది పాల్గొనడం విశేషం. అమెరికా అధ్యయనాల్లో… ఇతరులకు మనమెంతగా ఉపయోగపడుతున్నాం, ఇతరుల దృష్టిలో మనకు ఎంత విలువ ఉంది… అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటే, జపాన్ అధ్యయనాల్లో ఒక ఆశయంతో జీవించడం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. 67 సంవత్సరాల సగటు వయసు ఉన్న వ్యక్తులను ఏడు సంవత్సరాలపాటు పరిశీలించి వారి నుండి వివరాలు సేకరించి ఈ అధ్యయనాలు నిర్వహించారు. ఈ ఏడేళ్ల కాలంలో 14,500మంది వివిధ కారణాల వల్ల మరణించగా, 4000మంది ఏదో ఒక రూపంలో గుండె జబ్బులతో బాధపడుతున్నట్టుగా తేలింది.
ఈ అధ్యయనాల్లో పరిశోధకులు గమనించిన ప్రధాన అంశం, జీవితాన్ని నెగెటివ్‌గా చూడటం, సమాజంతో సరైన సంబంధాలు నెరపలేకపోవడం అనే కారణాలు వ్యక్తుల గుండె ఆరోగ్యాన్ని కుంగదీస్తూ, మరణానికి చేరువ చేస్తాయి. అలాగే ఇందుకు పూర్తి వ్యతిరేకంగా జీవితాన్ని సానుకూలంగా చూస్తూ, చక్కని సామాజిక సంబంధాలు కలిగి ఉండేవారు, ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ కాలం బతికే అవకాశాన్ని కలిగి ఉండటం పరిశోధకులు గమనించారు.
మొత్తంగా అధ్యయనాల్లో పరిశీలించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని… జీవితం విలువైనదిగా భావించండి…ఎక్కువకాలం బతకండి…అనే ఏకవాక్యంలోకి ఫలితాలను కుదించి, ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎలాగూ ఈ పరిశోధకులు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచించినా, ప్రవర్తించినా వచ్చేవి…నీరసం, నిరాశ, డిప్రెషన్, రోగాలు…తరువాత మృత్యువే కనుక వారు చెబుతున్నది నూటికి నూరుశాతం నిజమే. అలాగే భిన్నరంగాల్లో సామాజిక సేవ, నిస్వార్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ, లేదా ఇంటికి పనికొచ్చే ఏదోఒక పనిచేస్తూ, క్షణం ఖాళీ లేకుండా గడిపే వృద్ధులు ఎంతో మంది మన కళ్లముందు ఆరోగ్యంగా హుషారుగా కనబడుతుంటారు. వారు కూడా ఈ అధ్యయనాల ఫలితానికి నిలువెత్తు సాక్ష్యులే!