మనిషికో న్యాయం
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఏడుగురూ జీవితాంతం జైలులో ఉండాల్సిందేనని అయిదుగురు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తీర్పు చెప్పింది. ఈ ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం ఈ తీర్పుతో అటకెక్కాల్సిందే. గత సంవత్సరం ఫిబ్రవరి 18న రాజీవ్ హత్య కేసులో మరణ శిక్ష పడ్డ పెరారివాలన్, శ్రీహరన్ అలియాస్ మురుగన్, టి సుతేంద్ర రాజా అలియాస్ శంతన్ […]
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఏడుగురూ జీవితాంతం జైలులో ఉండాల్సిందేనని అయిదుగురు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తీర్పు చెప్పింది. ఈ ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం ఈ తీర్పుతో అటకెక్కాల్సిందే.
గత సంవత్సరం ఫిబ్రవరి 18న రాజీవ్ హత్య కేసులో మరణ శిక్ష పడ్డ పెరారివాలన్, శ్రీహరన్ అలియాస్ మురుగన్, టి సుతేంద్ర రాజా అలియాస్ శంతన్ కు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. వారు క్షమా భిక్ష కోసం పెట్టుకున్న దరఖాస్తులపై 11 ఏళ్లపాటు ఏ రాష్ట్రపతీ నిర్ణయం తీసుకోనందువల్ల, వారు 23 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినందువల్ల వారికి విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. అంటే రాష్ట్రపతులు సత్వర నిర్ణయం తీసుకుని ఉంటే వారికి ఈ అవకాశం దక్కి ఉండేది కాదు. న్యాయం నత్త నడక నడవడమూ ఒకందుకు మంచిదేనేమో!
సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏ మాత్రం జాప్యం చేయకుండా సుప్రీం కోర్టు జీవిత ఖైదుగా మార్చిన ముగ్గురితో పాటు అది వరకే మరణ శిక్ష జీవిత ఖైదుగా మారిన నళిని, రాబర్ట్ ప్యాస్, జయకుమార్, రవిచంద్రన్ కు కూడా ఏకమొత్తంగా క్షమాభిక్ష ప్రసాదించి వారిని జైలు నుంచి విడుదల చేస్తామని ప్రకటించింది. ఖైదీల విడుదలకు కేంద్ర ప్రభుత్వాన్ని “సంప్రదించడానికి” జయలలిత 2014 ఫిబ్రవరి 19న ఓ లేఖ రాశారు. కేంద్రం మూడు రోజులలోగా తేల్చాలని కూడా జయలలిత గడువు కూడా నిర్ణయించేశారు. సీబీఐ లాంటి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన కేసులలో జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే నేర విచారణా ప్రక్రియా స్మృతి (సి.ఆర్.పి.సి.) 435(1) సెక్షన్ ప్రకారం కేంద్రాన్ని సంప్రదించాలి.
కేంద్ర ప్రభుత్వం జయలలిత లేఖకు సమాధానమివ్వకుండా ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంలో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచి రాజీవ్ హత్యకేసులో శిక్ష పడ్డ వారిని విడుదల చేయడం కుదరదని తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తులు కలీఫుల్లా, పి.సి. ఘోశ్, ఎ.ఎం. సప్రె, యు.యు. లలిత్ తో కూడిన బెంచి మెజారిటీ తీర్పులో ఖైదీల విడుదలకు ఆస్కారం లేదని చెప్పింది. ఈ తీర్పులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. కేంద్రాన్ని సంప్రదించడంలో జయలలిత ప్రభుత్వం నిర్దిష్ట పద్ధతిని పాటించలేదన్న విషయంలో అయిదుగురు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యావజ్జీవ ఖైదు అంటే 14 ఏళ్లు మాత్రమే కాదు అది అక్షరాలా యావజ్జీవితమేనన్న విషయంలో కూడా అయిదుగురు న్యాయ మూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
కేవలం సంప్రదించడం సరిపోదని ఈ సెక్షన్ ప్రకారం కేంద్రాన్ని సంప్రదించడమంటే కేంద్రం సమ్మతించడమేనని సుప్రీం కోర్టు బుధవారం నాటి తీర్పులో స్పష్టం చేసింది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంబంధం ఉన్న కేసులలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సమ్మతిస్తే తప్ప ఖైదీలను విడదల చేయడం సాధ్యం కాదు. రాష్ట్రాల, కేంద్ర పరిధుల్లోకి వచ్చే అంశాలకు సంబంధించిన కేసులలో అయితే నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే ప్రాధాన్యత ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు.
ఇక్కడే న్యాయ మూర్తులు మరో వివరణ కూడా ఇచ్చారు. ఏహ్యమైన నేరాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించకుండా జీవిత ఖైదు విధిస్తే అది జీవితాంతం కొనసాగాల్సిందే నని ప్రధాన న్యాయ మూర్తి దత్తు, కలీఫుల్లా, ఘోశ్ అభిప్రాయపడ్డారు. 20 నుంచి 40 ఏళ్ల దాకా ఎంతకాలమైనా శిక్ష విధించవచ్చునని చెప్పారు. మరణ శిక్ష విధించకుండా యావజ్జీవ శిక్ష విధించాలని ఏ దశలో ఎవరు, ఎలా నిర్ణయిస్తారు. తీర్పు చెప్పేటప్పుడే ఆ విషయం కూడా స్పష్టంగా చెప్తారా!
ఈ ముగ్గురు న్యాయమూర్తుల దృష్టిలో రాజీవ్ గాంధీ హత్య చాలా తీవ్రమైన అంశమే. న్యాయమూర్తులందరి తరఫున న్యాయ మూర్తి కలీఫుల్లా రాసిన 200 పేజీల తీర్పులో రాజీవ్ గాంధీ హత్య ఎంత తీవ్రమైందో సవివరంగా చెప్పరు. “ఉదాహరణకు రాజీవ్ గాంధీ హత్యకేసులో ఆయన మాజీ ప్రధాన మంత్రి, ప్రజలు ఆయన మీద అపారమైన విశ్వాసం ఉంచారు, ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోటే ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. పథకం ప్రకారం చేసిన హత్య వల్ల మొత్తం దేశ ప్రజల ఆశలు వమ్ము అయినాయి” అని తీర్పులో పేర్కొన్నారు. అందుకే జయలలిత ఆలోచన ప్రకారం ఏడుగురు ఖైదీలను విడుదల చేయడానికి వీలు లేదని తేల్చారు. అంటే రాజీవ్ గాంధీ లాంటి వారిని హత్య చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ విడుదల చేయడానికి అవకాశం ఉండదనే. ఈ మాట చెప్పింది ప్రధాన న్యాయమూర్తి దత్తు, న్యాయ మూర్తులు కలీఫుల్లా, ఘోశ్ మాత్రమే. మిగతా ఇద్దరు న్యాయ మూర్తులు ఖైదీలకు క్షమా భిక్ష లేకుండా చేసే అవకాశం న్యాయస్థానానికి లేదని భావించారు. ఎప్పటికో ఒకప్పటికి విడుదలవుతామన్న ఆశా రేఖ కూడా ఖైదీలకు లేకపోతే ఎలా అన్నది న్యాయమూర్తులు ఎ.ఎం.సప్రె, యు.యు.లలిత్ అభిప్రాయం. న్యాయముర్తుల అభిప్రాయాల మధ్య ఉన్న తేడా చూస్తే శిక్ష విధించడంలో ఉన్న కచ్చితత్వం క్షమా భిక్ష పెట్టడానికి వర్తించదా అన్న అనుమానానికి చోటిస్తోంది. రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని కాబట్టి ఆయనను హత మార్చిన వారికి క్షమాభిక్షకు అవకాశం లేదు అనేటట్టయితే అంత ప్రముఖులు కాని వారిని హత్య చేసిన వారికి క్షమాభిక్షకు అవకాశం ఉంటుందా? ఇలాంటివి ప్రత్యేకమైన కేసులని న్యాయమూర్తులు అంటున్నారు. చిన్న నేరాలకు చిన్న శిక్ష, పెద్ద నేరాలకు పెద్ద శిక్ష ఉండడం సహజం. కాని హతులు ఎవరు అన్న విషయం మీద ఆధారపడి శిక్షలు విధించడం, క్షమాభిక్ష ప్రసాదించడం న్యాయసమ్మతమేనా అన్న అనుమానం కలుగుతోంది. ప్రత్యేకమైన కేసులకు, ప్రత్యేకమైన తీర్పులకు, మామూలు కేసులకు, ప్రత్యేక కేసులకు ఏ చట్టంలోనైనా వివరణ ఉందా?
న్యాయమూర్తి కలీఫుల్లా రాసిన తీర్పులో “ఒక వ్యక్తి మరో వ్యక్తి స్వేచ్ఛను హరించి హతమారిస్తే, అతని కుటుంబానికి బాధ కలిగిస్తే తనకు స్వేచ్ఛ ప్రసాదించమని అడిగే హక్కు ఉండదు. స్వేచ్ఛా ఏకపక్షమైంది కాదు” అని రాశారు. ఈ సూత్రమే అందరికీ వర్తించేటట్టయితే నేర విచారణా ప్రక్రియా స్మృతిలోని క్షమాభిక్ష గురించి చెప్పే అంశాలకు ఏ విలువా ఉండదా! ఇదే సూత్రాన్ని నేరవిచారణలో సైతం వర్తింపచేస్తే ప్రముఖులు, పలుకుబడి గల వారు చేసిన నేరాలకు శిక్ష తగ్గించే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రానికి విలువ లేకుండా పోతుంది.
యావజ్జీవ శిక్ష పడిన వారు 14 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాత క్షమా భిక్ష కోరే అవకాశం కూడా చట్టమే కల్పిస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసులో దశాబ్దాల తరబడి శిక్ష అనుభవించిన వారికి క్షమాభిక్షకు అవకాశం లేకుండా చేసే చట్టాలు, న్యాయ సూత్రాలు ప్రత్యేకంగా ఏమీ లేవుగా! శిక్ష లక్ష్యం పగ తీర్చుకోవడమో, కసి తీర్చుకోవడమో కాదు. చేసిన నేరానికి శిక్ష అనివార్యంగా ఉండాల్సిందే. అలాగే శిక్ష ఖైదీలలో ఆత్మ శోధనకు, సంస్కరణకు అవకాశం కల్పించాలి. మరణ శిక్ష విధించినప్పుడు ఈ అవకాశం ఉండదు కనకే ఆ శిక్షను వ్యతిరేకిస్తాం.
జైళ్లు సంస్కరణలకు అవకాశం కల్పించడం లేదనీ అనేక రకాల నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయని ఈ తీర్పులో పేర్కొన్నారు. సంస్కరణ శిక్ష అనుభవించే వారి ప్రవృత్తిపై మాత్రమే ఆధారపడి ఉండదు. జైళ్లలో ఉండే పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. “శిక్షలు విధించడంలో కనికరం చూపడం, కనీసం మరణ శిక్షలు, యావజ్జివ శిక్షలు విధించడంలో కనికరం చూపితే గందరగోళం ఏర్పడుతుంది, న్యాయమార్గ పాలనకు విఘాతం కలుగుతుంది, అరాచకం రాజ్యమేలుతుంది. నేరస్థులు, వారి ముఠాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు” అని కూడా ఈ తీర్పులో పేర్కొన్నారు. న్యాయ మూర్తులు వ్యక్తం చేసే అభిప్రాయాలు సొంత అభిప్రాయాలని అనుకోలేం. చట్టం ప్రకారం వ్యవహరించడం న్యాయ మూర్తుల బాధ్యత. జైళ్లు సంస్కరణలకు అవకాశం ఇవ్వకపోతే ఆ తప్పు ఖైదీలది కాదు. “ఖైదీలకు జ్ఞానం అందించడానికి, వారిలో పశ్చాత్తపం కలిగించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేనప్పుడు క్షమా భిక్షకు అవకాశం లేకుండా సుధీర్ఘమైన శిక్షలు ఉండాల్సిందే” అని కూడా తీర్పులో పేర్కొన్నారు. వ్యవస్థ బలహీనతలకు ఖైదీలను బలిపెట్టడం న్యాయం కాదు.
రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష పెట్టాలని జయలలిత కోరడంలో రాజకీయాలు ఉండొచ్చు. ఇక్కడ సమస్య రాజకీయాలు కాదు. న్యాయస్థానాలు ప్రచలితంగా ఉన్న అభిప్రాయాలకు, వైఖరులకు లోబడి తీర్పులు చెప్తాయని అనుకోలేం. కాని రాజీవ్ హత్యను ప్రత్యేకమైన కేసుగా పరిగణించడంలో న్యాయమూర్తుల వైఖరుల మీద ఆధారపడి తీర్పులు ఉంటాయని భావించే అవకాశం కలుగుతోంది.
“నిర్దయులైన, డబ్బు కోసం వెంపర్లాడే, కామాతురులు, కిరాయి హంతకుల విషయంలో ప్రత్యేక శిక్షలకు రాజ్యాంగ బద్ధత ఉంది” అని 2008నాటి స్వామి శ్రద్ధానంద కేసులో తీర్పును ఉటంకిస్తూ ఈ తీర్పులో సమర్థించుకున్నారు. నేర విచారణ సమయంలో నేరస్థుడి ఇతర లక్షణాలను లెక్కలోకి తీసుకోరు. ఆ సూత్రం ఈ తీర్పులో వర్తించినట్టు లేదు. రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులకు క్షమా భిక్ష పెట్టడం చట్టపరిధిలోని వ్యవహారం. చట్టం అందరికీ సమానంగా వర్తించడం న్యాయం.
– ఆర్వీ రామారావ్