కప్పు కాఫీ...కలియుగ అమృతమే..!
మనలో చాలామంది కాఫీ, టీలను సైతం చెడు అలవాట్ల జాబితాలో చేర్చేస్తుంటారు. కానీ ఇవి రెండూ మోతాదుకి మించకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు ఒక తాజా పరిశోధన తగుమోతాదుల్లో కాఫీ తాగండి…ఆయుష్షుని పెంచుకోండి అని చెబుతోంది. రోజుకి అయిదు కప్పులకు మించకుండా కాఫీని తాగుతుంటే జీవితకాలం పెరుగుతుందని, అది మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు పలు అనారోగ్య కారణాలతో మృత్యువు బారిన పడకుండా ఆయుష్షుని పొడిగిస్తుందని, హార్వర్డ్ […]
మనలో చాలామంది కాఫీ, టీలను సైతం చెడు అలవాట్ల జాబితాలో చేర్చేస్తుంటారు. కానీ ఇవి రెండూ మోతాదుకి మించకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు ఒక తాజా పరిశోధన తగుమోతాదుల్లో కాఫీ తాగండి…ఆయుష్షుని పెంచుకోండి అని చెబుతోంది. రోజుకి అయిదు కప్పులకు మించకుండా కాఫీని తాగుతుంటే జీవితకాలం పెరుగుతుందని, అది మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు పలు అనారోగ్య కారణాలతో మృత్యువు బారిన పడకుండా ఆయుష్షుని పొడిగిస్తుందని, హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చెబుతున్నారు. అలాగే కాఫీ ఎంత ఎక్కువగా తాగినా అది పొగతాగడమంత హాని ఎప్పటికీ చేయదని కూడా వీరు భరోసా ఇస్తున్నారు.
రోజుకి మూడు నుండి అయిదు కప్పుల వరకు కాఫీని తాగడం వలన ఎక్కువకాలం జీవించే అవకాశం పెరుగుతుందని, మధుమేహం, గుండెసంబంధిత వ్యాధులు, ఆత్మహత్యలు…ఈ కారణాలతో త్వరగా మృత్యవాత పడకుండా కాఫీ కాపాడుతుందని ఈ అధ్యయనానికి సారధ్యం వహించిన ఫ్రాంక్ హ్యు అనే పోషకాహార నిపుణుడు చెబుతున్నారు.
ఇప్పటివరకు కాఫీ మీద చేసిన పరిశోధనలన్నీ కెఫిన్ ఉన్న కాఫీలనే పరిశీలించాయని, తాము కెఫిన్ ఉన్న, లేని కాఫీలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ పరిశోధన నిర్వహించామని ఫ్రాంక్ హ్యు తెలిపారు. రెండు రకాల కాఫీల్లోనూ జీవితకాలాన్ని పెంచే శక్తి ఉన్నట్టుగా తాము కనుగొన్నామని, అయితే దీనిపై ఇంకా పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేదని హ్యూ అన్నారు.
రెండులక్షల మంది డాక్టర్లు, నర్సుల నుండి 20 సంవత్సరాల పాటు సేకరించిన ఆహార, జీవనశైలి వివరాలను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. నిర్దిష్ట కాల పరిమితితో ఎప్పటికప్పుడు ఈ వివరాలు సేకరిస్తూ అధ్యయనం చేశారు. ఈ రెండు దశాబ్దాల్లో కాఫీ తాగని వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్టుగా గమనించారు. సిగరెట్లు తాగకుండా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో జీవితకాలం పెరిగే అవకాశాలు 8 నుండి 15 శాతం వరకు ఉన్నాయని, కాఫీతో జీవిత కాలం పెరుగుతుందని తాము గట్టిగా చెప్పగలమని, ఇది కాఫీ ప్రియులకు శుభవార్తేనని హ్యూ అంటున్నారు.
అయితే ఇందులో తేలాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో మద్యపానం, సిగరెట్లు, మాంసాహారం లాంటి అలవాట్లు కూడా ఎక్కువగానే ఉండవచ్చు. అప్పుడు కాఫీ ఎంతవరకు ప్రాణదాతగా పనిచేస్తుందీ, అలాగే కాఫీని పంచదార, పాలు, మీగడలతో తాగాలా, బ్లాక్ కాఫీనే తాగాలా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని పరిశోధకులు అంటున్నారు.
తీవ్రమైన వ్యాధులకు కాఫీని ఏకైక విరుగుడుగా తాము చెప్పలేమంటున్నారు. ఎందుకంటే కాఫీకంటే మనుషులు ఆచరించే ఆహార, వ్యాయమ, నిద్ర, పని, విశ్రాంతి విధానాలు, ఇతర అలవాట్లు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, అలాగే కాఫీతో పాటు శరీరంలోకి వెళ్లే పంచదార పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రొఫెసర్ హ్యూ అంటున్నారు.
ఇంతకీ కాఫీ మన ఆరోగ్యానికి ఎలా మేలుచేస్తుంది?
- యాంటీ ఆక్సిడెంట్లుగా అంటే శరీరంలోని వ్యర్ధాలకు విరుగుడుగా పనిచేసే ఆహారాల్లో కాఫీ కూడా ముఖ్యమైనది. కాలం గడుస్తున్న కొద్దీ క్షీణిస్తున్న మన డిఎన్ఎకి రక్షణ కవచంలా పనిచేసే రసాయనాలు యాంటీ ఆక్సిడెంట్లలో ఉంటాయి.
- కొలోన్ క్యాన్సర్‌నుండి కోలుకునే వారికి కాఫీ తోడ్పాటు అందిస్తుందని, షుగర్ రాకుండా కాపాడుతుందని, అలాగే మధుమేహం, గుండెసంబంధిత వ్యాధుల కారణంగా వచ్చే వాపులను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.
- అమెరికా ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై సలహాలనిచ్చే నిపుణులు, ఆహారానికి సంబంధించిన ప్రభుత్వ విధానాల్లో కాఫీ ప్రయోజనాలను చేర్చాలని సూచిస్తున్నారు. అలాగే కాఫీ, మధుమేహం పార్కిన్సన్ లివర్ క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుందనే విషయాన్ని ప్రజారోగ్య విధానాల్లో తెలపాలని సలహా ఇస్తున్నారు.
ఇప్పటివరకు కాఫీ గురించి నిర్వహించిన అధ్యయనాల్లో ఇది గొప్పదని, స్త్రీ పురుషులిద్దరినీ, ఎక్కువ సంఖ్యలో ఇందులో చేర్చడం, రెండు దశాబ్దాల పాటు పరిశీలించడం ఇవన్నీ ఈ అధ్యయనాన్ని ఉత్తమంగా నిలబెడుతున్నాయని మిన్నెసోటాలోని మయో క్లినిక్‌లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ షరొన్నే హేస్ అంటున్నారు. ముఖ్యంగా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం అసలు లేదని హేస్ భరోసా ఇస్తున్నారు.