తాలిబన్ల మధ్య కాల్పులు, నాయకుడు మృతి?
పాకిస్తాన్ లోని మిలిటెంట్ కమాండర్ల సమావేశంలో మాటా మాటా పెరిగి కాల్పులకు దారితీయడంతో అఫ్గాన్ తాలిబన్ల అగ్ర నాయకుడు ముల్లా మన్సూర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీన్ని బట్టి తాలిబన్లలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయని రుజువైంది. ముల్లా మనుసూర్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కాని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడి అధికార ప్రతినిది సుల్తాన్ ఫైజీ చెప్పారు. అయితే కాల్పుల సంఘటన ఏదీ జరగలేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా […]
పాకిస్తాన్ లోని మిలిటెంట్ కమాండర్ల సమావేశంలో మాటా మాటా పెరిగి కాల్పులకు దారితీయడంతో అఫ్గాన్ తాలిబన్ల అగ్ర నాయకుడు ముల్లా మన్సూర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీన్ని బట్టి తాలిబన్లలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయని రుజువైంది.
ముల్లా మనుసూర్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కాని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడి అధికార ప్రతినిది సుల్తాన్ ఫైజీ చెప్పారు. అయితే కాల్పుల సంఘటన ఏదీ జరగలేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వాదిస్తున్నారు.
అంతకు ముందు తాలిబన్ల అగ్రనాయకుడిగా ఉన్న ముల్లా ఉమర్ మరణించిన తర్వాత జులై 31న ముల్లా మన్సూర్ తాలిబన్ల అగ్రనాయకుడిగా నియమితుడైనట్టు ప్రకటించారు. ముల్లా ఉమర్ మరణ వార్తను ధృవీకరించడానికే తాలిబన్లు చాలా జాప్యం చేశారు. ములా మన్సూర్ ను తాలిబన్ అగ్రనాయకుడిగా నియమించిన వెంటనే తాలిబన్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కొంత మంది తాలిబన్ నాయకులు మన్సూర్ కు విధేయంగా ఉండడానికి నిరాకరించారు.
ముల్లా మన్సూర్ గాయపడడానికి దారి తీసిన బుధవారం నాటి కాల్పులలో నలుగుర్ మరణించారని మన్సూర్ సన్నిహితులు చెప్పారు. అనేక మందికి గాయాలయ్యాయని కూడా వారు తెలియజేశారు. మన్సూర్ విధేయవర్గంలోని అబ్దుల్లా సర్హది ఇంట్లో తాలిబన్ల సమావేశం జరిగింది. సర్హదీని 2001లో అరెస్టు చేసి గౌటెనామో బే లో అమెరికా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. ఆ తర్వాత ఆయనను పాకిస్తాన్ లో అరెస్టు చేసి 2012లో విడుదల చేశారు. తాలిబన్ నాయకుల సమావేశం మధ్యలో వాగ్యుద్ధం చిలికి చిలికి గాలి వానైనందువల్ల అబ్దుల్లా సర్హది మొదట కాల్పులు జరిపారని ఆ తర్వాత ప్రత్యర్థి వర్గాల వారి కాల్పులలో ముల్లా మన్సూర్ గాయపడినట్టు తెలిసింది.