Telugu Global
Others

మోదీ పై భోపాల్ గ్యాస్ బాధితుల ఆగ్రహం

భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగి డిసెంబర్ రెండు నాటికి 31 సంవత్సరాలైంది. అయినా బాధితుల గోడు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం పర్యావరణ, కార్మిక చట్టాలలో చేయాలనుకుంటున్న సవరణల వల్ల భోపాల్ గ్యాస్ ప్రమాదాల వంటివి జరగడానికి అవకాశం మరింత పెరుగుతుందని భోపాల్ గ్యాస్ భాధితుల తరపున పొరాడుతున్న అయిదు సంస్థల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయస్థానాల ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న అమెరికా […]

మోదీ పై భోపాల్ గ్యాస్ బాధితుల ఆగ్రహం
X

భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగి డిసెంబర్ రెండు నాటికి 31 సంవత్సరాలైంది. అయినా బాధితుల గోడు మూడు దశాబ్దాల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం పర్యావరణ, కార్మిక చట్టాలలో చేయాలనుకుంటున్న సవరణల వల్ల భోపాల్ గ్యాస్ ప్రమాదాల వంటివి జరగడానికి అవకాశం మరింత పెరుగుతుందని భోపాల్ గ్యాస్ భాధితుల తరపున పొరాడుతున్న అయిదు సంస్థల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
భారత న్యాయస్థానాల ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న అమెరికా కార్పొరేట్ సంస్థలపై చర్య తీసుకోవడంలో విఫలమైందని భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా కర్మచారి సంఘటన అధ్యక్షురాలు రషీదా బీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “డౌ కెమికల్ కు అనుబంధమైన భారత్ లోని సంస్థ అధిపతులకు భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మూడు సార్లు నోటీసులు పంపినా ఆ సంస్థ పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వంలో వారి నిర్లక్ష్యం మరింత పెరిగిపోయింది” అని ఆరోపించారు.

గ్యాస్ లీక్ కు కారణమై, ప్రస్తుతం నిరర్థకంగా పడి ఉన్న యూనియన్‌ కార్బైడ్ పరిసర ప్రాంతాలలో కాలుష్యాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఐక్య రాజ్య సమితి పర్వారణ కార్యక్రమం (యూ.ఎన్.ఈ.పి) ముందుకొచ్చినా మోదీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా పురుష్ సంఘర్శ్ మోర్చా నాయకుడు నవాబ్ ఖాన్ విమర్శించారు. “ఏ మేరకు కాలుష్యం వ్యాపించిందో అంచనా వేయడం ముందు చేయాల్సిన పని. కాని ప్రభుత్వం దీనికి ఎందుకు సమ్మతించడం లేదో అంతుపట్టడం లేదు. యూ.ఎన్.ఈ.పి. అపూర్వమైన రీతిలో కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ముందుకొచ్చినా పర్యావరణ శాఖ మంత్రి నుంచి ఉలుకు పలుకు లేదు” అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
“దేశం నలుమూలలను పరిశుభ్రం చేస్తామని ప్రధాన మంత్రి గొప్పలు చెబుతుంటారు. కాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ పరిసరాలలో వేల టన్నుల మేర పేరుకు పోయిన కాలుష్యం మాత్రం ఆయనకు పట్టదు” అని సఫ్రీన్ ఖాన్ దెప్పి పొడిచారు.
పర్యావరణ, కార్మిక చట్టాలకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల కారణంగా దేశంలో భోపాల్ గ్యాస్ లీక్ లాంటి పరిణామాలు అనేకం ఏర్పడే ప్రమాదం ఉందని భోపాల్ గ్యాస్ పీడితులు ఆందోళన పడుతున్నారు. “పర్యావరణ చట్టాల ప్రకారం కార్పొరేట్ సంస్థలు తమకు తామే పర్యావరణ అనుమతులు ఇచ్చుకోవడానికి అనుమతిస్తే భోపాల్ దుర్ఘటన లాంటివి అనేకం జరుగుతాయన్నది వారి ఆందోళన.

First Published:  3 Dec 2015 6:42 AM IST
Next Story