అనుష్క మనసులో ఇంత ఆవేదన ఉందా?
అనుష్క శర్మ…పేరున్న బాలివుడ్ హీరోయిన్. తన సినిమాలతో కంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్‌గా ఆమె మరింత పాపులర్ అయ్యింది. సాధారణంగా ఏ భాషలో అయినా హీరోయిన్ అనగానే అందంగా ఉండటమే వారి మొదటి అర్హత. వారి తెలివితేటలకు, మనోభావాలకు అంతగా విలువ ఉండదు. అందుకే మన హీరోయిన్లు కూడా తెలివిగా కంటే ముద్దుముద్దుగా మాట్లాడేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల అనుష్క శర్మ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. దేశవ్యాప్తంగా […]
అనుష్క శర్మ…పేరున్న బాలివుడ్ హీరోయిన్. తన సినిమాలతో కంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్‌గా ఆమె మరింత పాపులర్ అయ్యింది. సాధారణంగా ఏ భాషలో అయినా హీరోయిన్ అనగానే అందంగా ఉండటమే వారి మొదటి అర్హత. వారి తెలివితేటలకు, మనోభావాలకు అంతగా విలువ ఉండదు. అందుకే మన హీరోయిన్లు కూడా తెలివిగా కంటే ముద్దుముద్దుగా మాట్లాడేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల అనుష్క శర్మ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లా కాకుండా సమకాలీన ఆధునిక సమాజంలో, తనకు నచ్చిన రంగంలో ఉనికిని నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నఒక మహిళగా మాట్లాడింది. ఆమె మాటలు మారుమూల పల్లెటూరు నుండి నగరానికి వచ్చి తనకాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తున్న ఒక సాధారణ అమ్మాయికి సైతం సరిగ్గా వర్తించేలా ఉన్నాయి. అవేంటో మీరూ చదవండి-
- సినిమాల్లో అమ్మాయిలు అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, అబ్బాయిలు వచ్చి ప్రేమలో పడేలా ఇంట్రస్టింగ్‌గా అనిపించాలి. అంతే… ఇంకే అర్హతలు అవసరం లేదు. అసలు ఇద్దరు, ముగ్గురు మహిళా పాత్రదారులు ఒక సీన్‌లో కనిపించడం అనేది కూడా ఒక మగపాత్ర ప్రమేయంతో, ఆ పాత్రకి సంబంధించిన కథనం ముందుకు సాగడానికే జరుగుతుంది. అంటే ముక్కోణపు ప్రేమకథల్లాంటివన్నమాట. సమాజమే అలా ఉంది. సినిమా సమాజాన్నే ప్రతిబింబిస్తోంది.
- మగవారికి వయసు పెరుగుతున్నా ఇమేజ్, హీరోయిజం తగ్గవు. వారు ఎప్పటిలాగే కూల్‌గా సినిమాలు చేసుకుంటూ పోతారు. సరే అందులో నాకే ఇబ్బందీ లేదు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పనిసరిగా వయసులో ఉన్నవారే కావాలి. ఎందుకంటే తెరమీద కనిపించే అమ్మాయి తప్పకుండా ప్రేక్షకులకు ఆకర్షణీయంగా కనిపించాలి. సినిమాల్లో మహిళలను అలాగే చూపిస్తూ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులకు ఆడవాళ్లను ఆ విధంగానే చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే ఏవో కొన్ని సినిమాలు తప్ప అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ల పాత్రలు అలాగే ఉంటున్నాయి. అందంగా కనిపించడం, హీరోలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం ఇంతకంటే నటించడానికి హీరోయిన్లకు ఏమన్నా ఉందా?
- ఆడా మగా వివక్ష సినీరంగంలో స్పష్టంగా కనబడుతుంది. ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లినపుడు హోటల్లో హీరోకి ఇచ్చినంత మంచి గది హీరోయిన్‌కి ఇవ్వరు. ఏ హోటల్‌లో అయినా మంచివి అనిపించే గదులు కనీసం రెండయినా ఉంటాయి కదా? ఇది సర్వసాధారణంగా నిరంతరం జరుగుతున్నదే.
- ఒకవేళ నేనొక సినిమా చేస్తున్నాననుకోండి…అందులో నా పాత్ర హీరో పాత్రకంటే కాస్త పెద్దగా, ప్రాధాన్యత కలిగినదిగా ఉందనుకోండి…ఏ హీరో కూడా ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోడు. తన పాత్ర పరిధిని పెంచి హీరోయిన్ పాత్రని తగ్గిస్తే కానీ ఏ హీరో ఆ సినిమాలో నటించడు. ఇది నిజంగా నిజం.
- ఒక సినిమాలో ఒక కొత్త హీరో, హీరోయిన్లు పరిచయం అవుతున్నపుడు ఇద్దరూ తెరకు నూతన పరిచయమే అయినా, ఇద్దరికీ ఒకేవిధంగా పారితోషకం ఇవ్వరు. అమ్మాయికంటే అబ్బాయికే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతుంది. మన సమాజంలో ఉన్న భావజాలం ఇక్కడా వర్తిస్తుంది. మగవాడు కుటుంబాన్ని పోషించాలి, అమ్మాయిలు మగవారిపై ఆధారపడి బతకాలి… అనే కాన్సెప్టు కారణంగా ఈ తరహా వివక్ష అన్ని చోట్లా కనబడుతుంది. ఇదంతా నేను, డబ్బు తక్కువ ఇస్తున్నారనే ఉద్దేశ్యంతో చెప్పడం లేదు. ఇది నా గౌరవాన్ని, విలువని చిన్నబుచ్చడంగా భావించి చెబుతున్నాను. రోజంతా పనిచేసి నిద్రపోయే సమయానికి మనసుకి ఆనందాన్ని కలిగించేది ఆ రోజు మనం పొందిన గౌరవం. అది ప్రతి మనిషికి అవసరం.
- ఈ మధ్య ఒక స్నేహితురాలు నన్ను, నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలనుకుంటున్న విషయం ఏమైనా ఉందా? అని అడిగింది. అప్పుడు నేను చెప్పిన సమాధానం…నీకో సంగతి తెలుసా…. మనమంతా చాలా అదృష్టవంతులం కాబట్టే ఇక్కడ, ఇండియాలో బతుకుతున్నాం. ఇక్కడి ప్రజల అభిరుచి అంతంత మాత్రంగా ఉంది కనుకే మనమంతా స్టార్లుగా బతికేస్తున్నాం…అని.
సమాజంలో మహిళలు ఏ స్థాయిలో ఉన్నా సెకండ్ జెండర్‌గానే గుర్తింపు పొందుతున్నారని, రాజీ పడుతూనే (స్త్రీలు కావడం వల్ల) బతుకుతున్నారని అనుష్క మాటలు మరొకసారి రుజువు చేశాయి.