చింతమనేని అంటే అంత ప్రేమెందుకు బాబు?
ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సొంతపార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. తహశీల్దార్ వనజాక్షిని బహిరంగంగా కొట్టడం, అటవీ అధికారులపై దాడి చేయడం, తాజాగా అంగన్ వాడీ మహిళలను ”గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ బూతులు తిట్టడం ఇలా వరుస పెట్టి పేట్రేగిపోతున్న చింతమనేనిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరుందని బాధపడుతున్నారు. తాజాగా జనచైతన్య యాత్ర కోసం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతమనేని నియోజకవర్గం దెందులూరునే చంద్రబాబు ఎంచుకోవడం చర్చనీయంశమైంది. దెందులూరులో ఇప్పటి […]
ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సొంతపార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. తహశీల్దార్ వనజాక్షిని బహిరంగంగా కొట్టడం, అటవీ అధికారులపై దాడి చేయడం, తాజాగా అంగన్ వాడీ మహిళలను ”గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ బూతులు తిట్టడం ఇలా వరుస పెట్టి పేట్రేగిపోతున్న చింతమనేనిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరుందని బాధపడుతున్నారు. తాజాగా జనచైతన్య యాత్ర కోసం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతమనేని నియోజకవర్గం దెందులూరునే చంద్రబాబు ఎంచుకోవడం చర్చనీయంశమైంది.
దెందులూరులో ఇప్పటి వరకు సీఎం పర్యటించలేదా అంటే అదీ లేదు. సీఎం అయ్యాక రెండుసార్లు చింతమనేని సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. బాబు పర్యటనకు నోచుకోని నియోజకవర్గాలు ప.గో జిల్లాలో ఇంకా చాలా ఉన్నాయి. కానీ వాటి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు పదేపదే చింతమనేని సెగ్మెంట్‌లోనే పర్యటించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పదేపదే చంద్రబాబు పర్యటన వల్ల తన వ్యవహార శైలి పట్ల సీఎం సానుకూలంగానే ఉన్నారన్న భావన చింతమనేనికి కలిగే ప్రమాదం ఉందంటున్నారు. దీని వల్ల ఆయన మరింత రెచ్చిపోయే చాన్స్ ఉందని అటు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే చింతమనేని దగ్గరకు వెళ్లాలంటే కాళ్లు చేతులు వణుకుతున్నాయని… ఈ సమయంలో సీఎం కూడా చింతమనేనిని ప్రోత్సహిస్తే ఇక తమను రక్షించేవారెవరని బాధపడిపడుతున్నారు. చంద్రబాబు పర్యటనపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దెందలూరు వస్తున్న సీఎం… చింతమనేని చేత మహిళలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నేరస్తులను ప్రోత్సహించేలా సీఎం ఇంత బహిరంగంగా వ్యవహరించడం సరికాదంటున్నారు.