Telugu Global
National

గుజతాత్ లో పట్టు సాధిస్తున్న కాంగ్రెస్

గుజరాత్ లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పుంజుకుంటోంది. 31 జిల్లా పంచాయితీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 18 జిల్లా పంచాయతీలలో ముందంజలో ఉంది. ఆనందీ బెన్ పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ లో జరిగిన ఎన్నికలలో ఇవే మొదటివి కాబట్టి ముఖ్యమంత్రికి చాలా ప్రతిష్ఠాకరమైనవి. రాజ్ కోట్, మోర్బి, బొటాడ్, ఆనంద్, గాంధీనగర్, సురేంద్రనగర్, అమ్రేలీ జిల్లా పంచాయతీలలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇన్నాళ్లూ ప్రేక్షక పాత్ర […]

గుజతాత్ లో పట్టు సాధిస్తున్న కాంగ్రెస్
X

గుజరాత్ లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పుంజుకుంటోంది. 31 జిల్లా పంచాయితీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 18 జిల్లా పంచాయతీలలో ముందంజలో ఉంది. ఆనందీ బెన్ పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ లో జరిగిన ఎన్నికలలో ఇవే మొదటివి కాబట్టి ముఖ్యమంత్రికి చాలా ప్రతిష్ఠాకరమైనవి.

రాజ్ కోట్, మోర్బి, బొటాడ్, ఆనంద్, గాంధీనగర్, సురేంద్రనగర్, అమ్రేలీ జిల్లా పంచాయతీలలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇన్నాళ్లూ ప్రేక్షక పాత్ర పోషించడానికే పరిమితమైన కాంగ్రెస్ కు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తం 31 నగర పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ 17 నగర పంచాయితీల్లో ఆధిక్యంలో ఉంది. అయితే కాంగ్రెస్ నాయకుడు అహమద్ పటేల్ కు కంచుకోట అయిన బరూచ్ లో మాత్రం కాంగ్రెస్ పరాజయం పాలైంది. మెహసానా మునిసిపాలిటీ, జూనాగఢ్ జిల్లా పంచాయతీలు కూడా కాంగ్రెస్ కు దక్కాయి. మెహసానా జిల్లాలో కాంగ్రెస్ విజయానికి ప్రత్యేకత ఉంది. అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సొంత జిల్లా. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లో కూడా బీజేపీ అధీనంలో ఉన్న జిల్లా పంచాయతీలను కాంగ్రెస్ కైవశం చేసుకునే దిశలో సాగుతోంది.

anandiben-patelమొత్తం 230 బ్లాకు పంచాయతీలు ఉంటే 130 చోట్ల కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నట్టు ఓట్ల లెక్కింపు సరళి రుజువు చేస్తోంది. 56 స్థానిక సంస్థలలో బీజేపీకి కాంగ్రెస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

అయితే పట్టణ ప్రాంతాలలోని అహమదాబాద్, రాజ్ కోట్, వడోదర, జాంనగర్, భావ నగర్, సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ల పై బీజేపీ పట్టు చెక్కు చెదరలేదు. పటేల్ ఉద్యమాన్ని లేవదీసిన హార్దిక్ పటేల్ స్వస్థలమైన విరాంగం నగర పాలికలో మాత్రం బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. విరాంగం మునిసిపాలిటీ రెండవ వార్డు హార్దిక్ పటేల్ నివసించే ప్రాంతం. అక్కడా బీజేపీకే విజయం దక్కింది.

ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు నవంబర్ 26న పోలింగ్ జరిగితే, 31 జిల్లా పంచాయతీలకు, 230 తాలూకా పంచాయతీలకు, 56 మునిసిపాలిటీలకు నవంబర్ 29న ఎన్నికలు జరిగాయి. మొదటి విడత జరిగిన పోలింగులో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వాని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేయడం నిర్బంధం చేశారు. నరేంద్ర మోది మాత్రం ఓటు వేయలేక పోయారు. ఆయన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం కోసం మలేషియాలో ఉన్నారు. అయితే ఓటింగును నిర్బంధం చేసే ఉత్తర్వుపై హై కోర్టు స్టే విధించింది.

First Published:  2 Dec 2015 11:13 AM IST
Next Story