Telugu Global
Others

చెన్నై గుండె చెరువైంది

తమిళనాడుపై వరుణదేవుడు విరుచుకుపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో పరిస్థితి దిగజారిపోతోంది. చెన్నై శివారులోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. చెంబరంబాకం రిజర్వాయర్‌లో నుంచి అడయార్‌ నదిలోకి ఊహించని స్థాయిలో వరద పోటెత్తుతోంది. వందేళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వర్షాలు పడలేదని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని పలు అపార్ట్‌మెంట్లలోని మొదటి ఆంతస్తు వరకు వరద నీరు చేరాయి. […]

చెన్నై గుండె చెరువైంది
X

తమిళనాడుపై వరుణదేవుడు విరుచుకుపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో పరిస్థితి దిగజారిపోతోంది. చెన్నై శివారులోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. చెంబరంబాకం రిజర్వాయర్‌లో నుంచి అడయార్‌ నదిలోకి ఊహించని స్థాయిలో వరద పోటెత్తుతోంది. వందేళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వర్షాలు పడలేదని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని పలు అపార్ట్‌మెంట్లలోని మొదటి ఆంతస్తు వరకు వరద నీరు చేరాయి. దీంతో జనం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

మరో నాలుగు రోజుల పాటు చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో జనం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చాలా మంది పేద ప్రజలు బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల మీదనే కాలం వెళ్లదీస్తున్నారు. చెన్నైలో దాదాపు అన్ని రహదారులూ నీట మునగడంతో బస్సులు నిలిపివేసారు. చాలా చోట్ల రోడ్లమీదే కార్లు, ఆటోలు వర్షం నీటిలో చిక్కుకుపోయాయి. మైట్రో రైళ్లు నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. 16 రోజులుగా విద్యాసంస్థలు తెరుచుకోలేదు.

చెన్నై విమానాశ్రయం పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే పూర్తిగా నీట మునగడంతో విమానాల రాకపోకలను నిరవధికంగా రద్దు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్‌ చేసి తమిళనాడులో పరిస్థితిని ఆరా తీసారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

First Published:  2 Dec 2015 5:45 AM IST
Next Story