సెలవురోజు బద్దకం...పనిరోజుల్లో పొద్దున్నే మేల్కోవడం... మీరూ అంతేనా... అయితే ఇది చదవండి !
తెల్లవారజామునే నిద్రలేవడం…ఇది చాలా మంచి అలవాటని మనందరికీ తెలుసు. అయితే ఈ మంచి అలవాటు కూడా చెడు ఫలితాలను ఇచ్చే సందర్భాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజూ ఒకేలా ఒక క్రమపద్ధతిలో నిద్రలేచేవారి విషయంలో ఇది మంచి అలవాటే కానీ సెలవు రోజుల్లో ముసుగుతన్ని నిద్రపోతూ, కాలేజీలు, ఆఫీసులు ఉన్న రోజుల్లో అలారం పెట్టుకుని బలవంతంగా నిద్రలేస్తే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని పిట్స్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇలా నిద్రవేళల్లో మార్పులు చేయడం […]
తెల్లవారజామునే నిద్రలేవడం…ఇది చాలా మంచి అలవాటని మనందరికీ తెలుసు. అయితే ఈ మంచి అలవాటు కూడా చెడు ఫలితాలను ఇచ్చే సందర్భాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజూ ఒకేలా ఒక క్రమపద్ధతిలో నిద్రలేచేవారి విషయంలో ఇది మంచి అలవాటే కానీ సెలవు రోజుల్లో ముసుగుతన్ని నిద్రపోతూ, కాలేజీలు, ఆఫీసులు ఉన్న రోజుల్లో అలారం పెట్టుకుని బలవంతంగా నిద్రలేస్తే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని పిట్స్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇలా నిద్రవేళల్లో మార్పులు చేయడం వల్ల అధికబరువు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
షిఫ్టు డ్యూటీల్లో పనిచేస్తూ నిద్రవేళల్ని మార్చుకునేవారిలో మెటబాలిజంకి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇప్పటికే రుజువైంది. 34-50 సంవత్సరాల మధ్య వయసున్న 447 మందిని ఎంపిక చేసుకుని నిద్రవేళల్లో మార్పుల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరందరికీ మణికట్టులకు రిస్ట్ బ్యాండ్‌లను వేశారు. వీటిలో అమర్చిన సాంకేతిక పరికరాలతో ఈ వాలంటీర్లు ఒక వారం పాటు ఎన్ని గంటలు నిద్రపోయారు, ఇంకా వారి నిద్రవేళలు, నిద్ర విధానాలు ఎలా ఉన్నాయి… లాంటి అంశాలన్నింటినీ సేకరించారు. అలాగే వారి ఆహారం, వ్యాయామ విధానాలను సైతం తెలుసుకున్నారు. వీరిలో 85శాతం మంది పని ఉన్న రోజుల్లో త్వరగా నిద్రలేవడం, సెలవురోజుల్లో అర్థరాత్రి వరకు మేలుకుని ఉదయాన ఆలస్యంగా నిద్రలేవడాన్ని గమనించారు. ఈ పద్ధతి వారిని సోషల్ జెట్‌లాగ్‌కి గురిచేయడం గుర్తించారు. అంటే సమాజంలో సాధారణ పనివేళలకు వీరి శరీరం అడ్జస్ట్ కాలేక సమస్యలు ఉత్పన్నం కావడం.
ఈ విధంగా సెలవురోజుల్లో, వర్కింగ్ డేస్‌లో నిద్రవేళల తేడాలున్నవారిలో కొవ్వుస్థాయిల్లో అసమతౌల్యం, నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉండటం(ఇది సర్వరోగాలకు కారణమని ఇంతకుముందే పరిశోధనల్లో తేలింది), బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం, పొద్దున్నే సుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, శరీరం ఇన్సులిన్‌ని వినియోగించుకోలేకపోవడం లాంటి సమస్యలు ఉండటాన్ని కూడా ఈ అధ్యయనంలో చూశారు. ఇవన్నీ మెటబాలిజం రేటులో క్షీణతని సూచిస్తున్నాయి. నిద్రవేళలను సక్రమంగా పాటించే వారిలో ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్టుగా గమనించారు. మెటబాలిజంలో తేడాల వల్ల అధికబరువు, మధుమేహం, గుండెసంబంధిత వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని ఈ అధ్యయన నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనంలో పాల్గొన్నవారు తీసుకున్న ఆహారం, వ్యాయామం, నిద్రకు సంబంధించిన ఇతర అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ అధ్యయనం నిర్వహించామని వారు చెబుతున్నారు. ఇంత ఘాటైన హెచ్చరికలు విన్నతరువాత కూడా మారుతున్న జీవన శైలిలో నిద్రవేళల్లో మార్పులు సహజంలే అని తేలిగ్గా తీసుకుంటే… .!!!!!!