నా చావుకు పవనే సమాధానం చెప్పాలి
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. క్యాంప్ ఆఫీస్ ముందే ఉన్న చంద్రబాబు 100 అడుగుల భారీ కటౌట్ పైకి ఎక్కారు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. కర్నూలు జిల్లా అట్టెకల్లు గ్రామానికి చెందిన రైతు గోవిందరాజులు పవన్ కల్యాణ్ అభిమాని. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటేయాలని ప్రచారం కూడా చేశారు. రైతు, డ్యాక్రా రుణమాఫీ జరుగుతుందని, అందరికీ ఇళ్లు వస్తాయని ప్రచారం చేసి ఓట్లేయించాడు. అయితే ఆ హామీలు నెరవేరకపోవడంతో ఊరిలో తలెత్తుకుని తిరిగలేకపోతున్నానంటూ నోట్ రాసి […]
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. క్యాంప్ ఆఫీస్ ముందే ఉన్న చంద్రబాబు 100 అడుగుల భారీ కటౌట్ పైకి ఎక్కారు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు.
కర్నూలు జిల్లా అట్టెకల్లు గ్రామానికి చెందిన రైతు గోవిందరాజులు పవన్ కల్యాణ్ అభిమాని. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటేయాలని ప్రచారం కూడా చేశారు. రైతు, డ్యాక్రా రుణమాఫీ జరుగుతుందని, అందరికీ ఇళ్లు వస్తాయని ప్రచారం చేసి ఓట్లేయించాడు. అయితే ఆ హామీలు నెరవేరకపోవడంతో ఊరిలో తలెత్తుకుని తిరిగలేకపోతున్నానంటూ నోట్ రాసి చంద్రబాబు కటౌట్‌పైకి ఎక్కాడు. పవన్ కల్యాణ్ మాటలను కూడా నమ్మి టీడీపీ కోసం పనిచేశానని గోవిందరాజులు తన నోట్‌లో రాశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులు జరక్కపోవడంతో ఊరిలో తన పరువు పోయిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వెల్లడించారు. అప్పుల వాళ్లు కూడా ఒత్తిడి తెస్తున్నారని వాపోయాడు.
తన కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చెయ్యాలని. తన మరణానికి పవన్‌కల్యాణ్, టీడీపీయే సమాధానం చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కటౌట్ ఎక్కిన గోవిందరాజులును పోలీసులు సముదాయించి కిందకు దించారు. చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో అతడు కూడా కిందకు దిగివచ్చాడు. అయితే గోవిందరాజులు అలా దిగారో లేదో పోలీసులు వెంటనే తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు.