Telugu Global
Others

కాల పరిక్షకు నిలచిన‌ రాజ్యాంగం

“రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ను మచ్చిక చేసుకోవడానికే. రాజ్యాంగ నిర్ణాయక సభ అణగారిన వర్గాల పట్ల ఎలా వ్యవహరిస్తుంది? టూకీగా చెప్పాలటే అణగారిన వర్గాల కాళ్లూ చేతులు కట్టేసి వారిని సవర్ణ హిందువుల దగ్గర పడేస్తారు. వారికి ఏమీ ఇవ్వరు. భోజనానికి బదులు రాళ్లు ఇస్తారు. రాజ్యాంగ నిర్ణాయక సభ అంటే అణగారిన వర్గాల వారికి ద్రోహం చేయడమే” ఈ మాటలు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడైన డా. బి.ఆర్.అంబేద్కర్ అన్న మాటలివి. […]

కాల పరిక్షకు నిలచిన‌ రాజ్యాంగం
X

RV Ramarao“రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ను మచ్చిక చేసుకోవడానికే. రాజ్యాంగ నిర్ణాయక సభ అణగారిన వర్గాల పట్ల ఎలా వ్యవహరిస్తుంది? టూకీగా చెప్పాలటే అణగారిన వర్గాల కాళ్లూ చేతులు కట్టేసి వారిని సవర్ణ హిందువుల దగ్గర పడేస్తారు. వారికి ఏమీ ఇవ్వరు. భోజనానికి బదులు రాళ్లు ఇస్తారు. రాజ్యాంగ నిర్ణాయక సభ అంటే అణగారిన వర్గాల వారికి ద్రోహం చేయడమే”

ఈ మాటలు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడైన డా. బి.ఆర్.అంబేద్కర్ అన్న మాటలివి. ఆ తర్వాత 1945 మేలో అఖిలభారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడుతూ “రాజ్యాంగ నిర్ణాయక సభకు నేను పూర్తిగా విరుద్ధం. ఇది అనవసరమైంది. అది చాలా ప్రమాదకరమన్నది నా అభిప్రాయం. దీనివల్ల దేశంలో అంతర్యుద్ధం చెలరేగ వచ్చు. అసలు రాజ్యాంగ నిర్ణాయక సభ ఎందుకో నాకు అర్థమే కాలేదు” ఈ మాటలన్నదీ అంబేద్కరే. ఇవన్నీ రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడక ముందు అన్న మాటలు. ఆ తర్వాత రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడైంది ఆయనే. రాజ్యాంగ నిర్ణాయక కమిటీలో ఉన్న ఇతర సభ్యులందరూ ఏదో ఒక కారణంతో అందుబాటులో లేక పోతే అంబేద్కర్ ఒక్క చేతి మీద ముసాయిదాకు రూపు దిద్దారు. రాజ్యాంగంలో చేర్చిన‌ కొని అంశాలు వ్యక్తిగతంగా ఆయనకు నచ్చకపోయినా కర్తవ్యపరాయణత ఎన్నడూ వీడలేదు. రాజ్యాంగానికి మెరుగులు దిద్దడంలో తన సర్వశక్తులూ ధారపోశారు.

తుది రూపు దిద్దుకున్న రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రతిపదిస్తూ చేసిన ప్రసంగంలో తన మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించినందుకు చాలా ఆనందం వ్యక్తం చేశారు. “ఈ దేశ ప్రజలకిచ్చిన రాజ్యాంగం అత్యద్భుతమైన పత్రం. ఈ మాట అంటున్నది నేను ఒక్కడినే కాదు. ఈ రాజ్యాంగం అత్యంత సరళమైంది, సులభమైంది అని చాలా మంది చెప్పారు”అని అంబేద్కర్ అన్నారు.

అంబేద్కర్ అన్న మాటలు వమ్ము కాలేదని 65 ఏళ్ల కింద ఆమోదించిన రాజ్యాంగమే నిరూపించింది. నవంబర్ 26 ను రాజ్యాంగ నిర్మాణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కారణాలేమైనా రాజ్యాంగం నిర్దేశించిన విలువలు ఇంకా పదిలంగానూ సజీవంగానూ ఉన్నాయి. మనతో పాటు స్వతంత్ర దేశంగా అవతరించిన పాకిస్తాన్ రాజ్యాంగం రూపొందించడానికి ఏడేళ్లు పట్టింది. రెండేళ్లకే పాకిస్తాన్ రాజ్యాంగం కుదేలైంది. ఆ తర్వాత 1969లోనూ, 1978లోనూ అదే జరిగింది. పాకిస్తాన్ చరిత్రలో గణనీయమైన కాలం సైనిక పాలనలోనే కునారిల్లింది. ఇప్పటికీ పాక్ పౌర ప్రభుత్వం నిరంతరం సైన్యం పడగనీడలోనే కొనసాగుతోంది.

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి ప్రధానమైన కారణం మన రాజ్యాంగ నిర్మాతలు అధికార దాహం కోసం ఆ పని చేయలేదు. వారందరికీ అపారమైన దూరదృష్టి ఉండేది. వారి నిజాయితీ నికార్సైంది. మన రాజ్యాంగ నిర్మాతలు తీవ్రమైన ఉత్సాహంతో రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. దాన్ని ఒక క్రతువుగా, బృహత్తరమైన కర్తవ్యంగా భావించారు.

మన రాజ్యాంగాన్ని వందకన్నా ఎక్కువ సార్లు సవరించి ఉండొచ్చు. ఆ సవరణలు కొన్ని మినాహాయిస్తే మిగతావన్నీ అవసరం కొద్ది చేసినవే. వ్యవసాయ సంస్కరణలకోసం, సంఘ సంస్కరణ కోసం, సామాజిక న్యాయం సాధించే దిశలో జరిగినవే. మరి కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం చేసినవి. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన అనేక రాజ్యాంగ సవరణల వెనక, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో చేసిన సవరణల వెనక స్వార్థ ప్రయోజనాలు, అవకాశ వాదం ఉన్న మాట వాస్తవం. ఆ తర్వాతే సుప్రీం కోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని అనేక సందర్భాలలో స్పష్టంగా చెప్పింది. కొన్ని రాజ్యాంగ సవరణలు రాజ్యాంగం అమలులో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దడానికి ఉద్దేశించినవి. 356వ అధికరణాన్ని ఎడా పెడా దుర్వినియోగం చేసి ప్రతిపక్ష ప్రభుత్వాలను, స్వపక్షంలోనే ముఠా తగవులు తీర్చడానికి, లేదా ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బ తీయడానికి కొన్ని డజన్ల సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మళ్లీ అదే రాజ్యాంగ సవరణ వల్ల ఈ అకృత్యాలకు తెరపడింది.

పార్టీ ఫిరాయింపులను నిలవరించడానికి చేసిన రాజ్యాంగ సవరణలవల్ల అంతగా ప్రయోజనం లేని మాట నిజమే. ఎన్నికల ప్రక్రియ ధనబలానికి, కండబలానికి దాసోహమనడం రాజ్యాంగం తప్పుకాదు. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రాజకీయపక్షాలదే ఆ పాపం. క్షుద్ర రాజకీయాలు రాజ్యాంగాన్ని దళారులకు, లాభాలు తప్ప మరేదీ పట్టించుకోని ప్రైవేటు వ్యాపార రంగానికి తాకట్టు పెట్టింది రాజ్యాంగాన్ని అమలు చేయడంలో అడుసుతొక్కింది రాజకీయ నాయకులే. సహజ వనరులపై హక్కు ప్రజలదేననీ, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యవ్యవస్థదీ ప్రభుత్వానిదేనని రాజ్యంగం స్పష్టం చేసింది. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తే దాన్ని అటకెక్కించిన ఘనత రాజకీయాలదే. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నదీ రాజకీయ నాయకులే. రాజ్యాంగ స్ఫూర్తిపై నీళ్లు చల్లడం బాహాటంగా కొనసాగుతున్న రాకకీయ క్షుద్ర క్రీడకు రాజ్యాంగానిది బాధ్యత కాదు. మనది అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం అని మన వీపు మనమే చరుచుకోవడం వల్ల ప్రయోజనం లేదు.

కొన్ని రాష్ట్రాలలోనైనా భూసంకరణలు అమలు కావడానికి రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తే కారణం. సహజ‌ వనరులను విదేశీ గుత్తపెట్టుబడిదార్లకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోకుండా ఉద్యమించే ప్రజలకు జవజీవాలు సమకూరుస్తున్నది మన రాజ్యాంగమే.

రాజ్యాంగం మీద నమ్మకంలేదని బాహాటంగా ప్రకటించి అడవి బాట పట్టిన వారు రాజ్యాంగానికి తలపెట్టిన అపచారం కన్నా రాజ్యాంగాన్ని వినియోగించుకుని అధీకారంలోకి వచ్చి అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచింది రాజకీయ నాయకులే. మన రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత పటిష్ఠమైనవో మన రాజకీయ వ్యవస్థ అంత బలహీనమైంది. ఆ కుళ్లు భారాన్ని కూడా మోస్తూ నిటారుగా నిలబడిన ఘనత మన రాజ్యాంగానిదే. రాజ్యాంగ నిర్మాతలదే.

రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వారు సవ్యంగా వ్యవహరించకపోతే అది విఫలమవుతుందని, రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసే వారు సజావుగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగం నిలబడుతుందని డా. అంబేద్కర్ ఏ నాడో హెచ్చరించారు. మొదటి మాటను నిజం చేసే దిశగా మన రాజ్య వ్యవస్థ పయనిస్తోంది. ఇంకా రాజ్యాంగం విఫలం కాలేదంటే అది అంతర్నిహితమైన రాజ్యాంగ శక్తివల్లే. పాలకులు దారి తప్పినప్పుడల్లా నిర్దాక్షీణ్యంగా శిక్షించడానికి సందేహించని ప్రజానీకమే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతున్నారు. రాజ్యవ్యవస్థలో పొంగిపొర్లుతున్న కుళ్లుకు, కుతంత్రాలకు, కూటనీతికి రాజ్యాంగాన్ని నిందిచి లాభం లేదు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని 2002లో చేసిన‌ ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయో ఆలోచించాల్సిందే.

తొలిసారిగా నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవం ప్రజలు రాజ్యాంగం గురించి మరింత తెలుసుకోవడానికి ఉపకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో ఆకాంక్షించారు. ఈ సూత్రాన్ని అధికారపీఠాలెక్కి విద్వేశం నింపుతున్న వారికి వర్తింపచేస్తే మరింత మేలు.

– ఆర్వీ రామారావ్

First Published:  26 Nov 2015 4:59 PM IST
Next Story