బీహార్ మంత్రులపై దుష్ప్రచారం
బీహార్ లో కొలువుదీరిన 28మంది మంత్రుల్లో ముగ్గురో నలుగురో తప్ప మిగతా వారందరూ విద్యాహీనులేనన్న ప్రచారం సామాజిక మధ్యమాల్లో జోరుగ జరుగుతోంది. దీనికి మూలం లాలూ ప్రసాద్ కుమారులైన ఉపమఖ్య మంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ తొమ్మిదో తరగతి మాత్రమే చడవడం, మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 12వ తరగతి దాకా మాత్రమే చదువుకోవడం కారణం కావచ్చు. లాలూ ప్రసాద్ ప్రోత్సహిస్తున్న వంశపారంపర్య పాలనను విమర్శించడంలో తప్పు లేదు కాని ఆయన కుమారులకు విద్యార్హత తగ్గినంత […]
బీహార్ లో కొలువుదీరిన 28మంది మంత్రుల్లో ముగ్గురో నలుగురో తప్ప మిగతా వారందరూ విద్యాహీనులేనన్న ప్రచారం సామాజిక మధ్యమాల్లో జోరుగ జరుగుతోంది. దీనికి మూలం లాలూ ప్రసాద్ కుమారులైన ఉపమఖ్య మంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ తొమ్మిదో తరగతి మాత్రమే చడవడం, మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 12వ తరగతి దాకా మాత్రమే చదువుకోవడం కారణం కావచ్చు. లాలూ ప్రసాద్ ప్రోత్సహిస్తున్న వంశపారంపర్య పాలనను విమర్శించడంలో తప్పు లేదు కాని ఆయన కుమారులకు విద్యార్హత తగ్గినంత మాత్రాన నితీశ్ మంత్రివర్గంలో చదువురాని వారే అధికులని దుష్ప్రచారం చేయడం ఆశ్చర్యకరం.
లాలూ కుమారులిద్దరితో సహా విజేంద్ర ప్రసాద్, శ్రవణ్ కుమార్, అబ్దుల్ జలీల్ మస్తాన్, రాం విచార్ రాం, కుమారి మంజు వర్మ, ఖుర్షీద్ ఉరఫ్ ఫెరోజ్ అహమద్, కపిల్ దేవ కామత్, అనితా దేవి వంటి ఎనిమిది మంది ఉన్నత విద్యనభ్యసించని మాట వాస్తవమే. వీరిలోనూ నలుగురు 12వ తరగతి దాకా చదివారు. మిగతా వారు పదో తరగతి గట్టెక్కారు. ఒక్కరు మాత్రం ఉపముఖ్యమంత్రికి తోడుగా మెట్రిక్యులేషన్ కూడా దాట లేదు. కాని నితీశ్ మంత్రివర్గంలో పది మంది పట్టభద్రులున్నారు. రాజీవ్ రంజన్ సిన్హా, జయకుమార్ సింగ్, ఆలోక్ కుమార్ మెహతా, అవధేశ్ కుమార్ సింగ్, కృష్ణానందన్ ప్రసాద్ వర్మ, మహేశ్వర్ హజారీ, శివ చంద్ర రాం, సంతోశ్ కుమార్ నిరాలా, మనేశ్వర్ చౌదరి, మదన్ సాహ్నీ పట్టభద్రులే.
చంద్రికా రాయ్, శైలేశ్ కుమార్, చంద్ర శేఖర్, విజయ ప్రకాశ్ పోస్టు గ్రాడ్యుయేట్లు. అశోక్ చౌదరీ, మదన్ మోహన్ ఝా, అబ్దుల్ గఫూర్ పిహెచ్.డి. పట్టాలు పొందిన వారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంజనీరింగ్ చదివారు. అంటే ఆయన మంత్రివర్గంలో ఉన్న వారిలో ఆయనతో కలిపి 18 మంది విద్యాధికులే.
అయినా విద్యార్హత అంటే ఏమిటో గమనించవలసిన అగత్యం ఉంది. మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అక్షరాస్యులను తయారు చేసి లోకం మీదికి వదులుతున్నాయి. ఏడో తరగతి చదివే వారు మూడో తరగతి పాఠ్యపుస్తకాలు చదవలేరనీ, రెండు రెండ్లు ఎంతవుతుందో చెప్పలేరనీ చాలా తరచుగానే వార్తలొస్తున్నాయి. కళా శాలలు, విశ్వవిద్యాలయాల పట్టాలు పుచ్చుకున్న వారిలో కూడా తమ చేతిలో ఉన్న డిగ్రీకి తగిన జ్ఞానం లేక పోవడం చూస్తూనే ఉన్నాం. డిగ్రీలకు పరిమితమైందే విద్యార్హత అనుకుంటే వీరందరూ చదువుకున్న వారి ఖాతాలో పడి పోతారు.
డిగ్రీ వేరు జ్ఞానం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం విచారకరం. డిగ్రీ జ్ఞానానికి పూచీ పడేది కాదు. డిగ్రీ కన్నా జ్ఞానం మిన్న. జ్ఞానం కన్నా లోకజ్ఞానం మిన్న. రాజకీయాలలో ఉండే వారికి ఉండాల్సిన అర్హత లోకజ్ఞానమే. పటాలు కట్టించుకుని వేలాడదీసుకోవడానికి తప్ప ఎందుకూ కొరగాని డిగ్రీలు ఎన్ని ఉన్నా ఎవరికైనా అలంకారప్రాయంగానే మిగిలిపోక తప్పదు.
– అనన్య