Telugu Global
NEWS

కొంపముంచిన అతివాగుడు... అసహన ప్రచారం

వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం అందరూ ఊహించినదే అయినా ఏకంగా నాలుగున్నర లక్షలకు పైగా మెజారిటీతో పసునూరి దయాకర్ గెలవడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు షాక్ అయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రభుత్వవ్యతిరేకత పనిచేయాలి గానీ… అందుకు రివర్స్‌లో ఎందుకు జరిగిందన్న దానిపై విపక్షాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. అయితే కొందరు నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌కు ఈ స్థాయిలో మేజారిటీ రావడానికి తాము చేసిన పొరపాట్లే కారణమని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ప్రచారం కోసం తాము ఎంచుకున్న […]

కొంపముంచిన అతివాగుడు... అసహన ప్రచారం
X

వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం అందరూ ఊహించినదే అయినా ఏకంగా నాలుగున్నర లక్షలకు పైగా మెజారిటీతో పసునూరి దయాకర్ గెలవడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు షాక్ అయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీపై ప్రభుత్వవ్యతిరేకత పనిచేయాలి గానీ… అందుకు రివర్స్‌లో ఎందుకు జరిగిందన్న దానిపై విపక్షాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. అయితే కొందరు నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌కు ఈ స్థాయిలో మేజారిటీ రావడానికి తాము చేసిన పొరపాట్లే కారణమని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ప్రచారం కోసం తాము ఎంచుకున్న కొన్ని మీడియా సంస్థల వల్ల కూడా తమకు నష్టం కలిగిందంటున్నారు. సదరు మీడియా సంస్థలపై తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండడం … ఆ మీడియా సంస్థలనే తాము ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగిందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ మీటింగ్‌లో ఎక్కడైనా ఒకరుఇద్దరు నినాదాలుచేస్తే ఆ అంశాన్ని తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ విపరీత స్థాయిలో ప్రచారం చేయిచింది. తెలంగాణలో ఏదో జరగకూడని పరిణామాలు జరిగిపోతున్నాయంటూ పనిగట్టుకుని ప్రచారం చేశారన్న భావన ఉంది. ఆ ప్రచారం కూడా ఆంధ్రాప్రాంతానికి చెందిన మీడియా సంస్థల ద్వారా జరగడం వరంగల్ ప్రజలు ఆలోచనలో పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రచారంతో తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి మొదలైందా భావన వరంగల్ ప్రజల్లో వ్యక్తమైందని భావిస్తున్నారు.

పైగా పోలింగ్‌కు ముందురోజుల్లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై కొన్నిమీడియా సంస్థలుపనిగట్టుకుని వ్యతిరేక కథనాలు ప్రచురించడం కూడా విపక్షాల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపింది. దేశంలో నేతలంతా తమ ఎన్నికల ఖర్చును సక్రమంగా చూపినట్టు… ఒక్క కేసీఆర్‌ కుటుంబం మాత్రమే కాకిలెక్కలు చెప్పిందన్నట్టుగా కథనాలు ప్రచురించారు. ఈ ఎత్తు కూడా రివర్స్ అయిందని విపక్ష నేతలు అంగీకరిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నా కేసీఆర్‌ మాత్రం తెలివిగా కాస్త తగ్గి మాట్లాడడం ద్వారా ప్రజల్లో ఒకరకమైన సానుభూతిని సృష్టించుకోగలిగారు. ఎన్నికల సమయంలో మరీ దిగజారి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ఆరోపణలుచేయడం కూడా ప్రజలకు నచ్చలేదని అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిలాంటి వారు కేసీఆర్‌ వ్యక్తిగత విషయాల ప్రస్తావిస్తూ పదేపదే తిట్టడం జనానికి రుచించినట్టు కనిపించలేదు.

మొత్తం మీద వరంగల్ విజయం విపక్షాలు చెబుతున్నట్టుగా టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం ద్వారా వచ్చింది కాదనే చెప్పాలి. నాలుగున్నర లక్షల మెజారిటీ వచ్చిన తర్వాత కూడా అధికారదుర్వినియోగం అంటే ప్రజలను అవమానించినట్టే అవుతుంది. ఈ ఫలితం ఆధారంగా తమలోని లోపాలని సరిచేసుకుని విపక్షాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

First Published:  24 Nov 2015 10:44 AM GMT
Next Story