కిరాతకానికి ఉరిశిక్షలు విరుగుడు కావు
తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పాకిస్తాన్ అకృత్యాల వివరాలు తెలిసిన వారికి గత ఆదివారం నాడు మరో ఇద్దరు 1971 నాటి యుద్ధ నేరస్థులను ఉరి తీయడం విన సొంపుగా ఉండవచ్చు. గత ఆదివారం అర్థ రాత్రి 12 గంటల 55 నిమిషాలకు మతతత్వ వాద జమాత్-ఎ-ఇస్లామి ప్రధాన కార్యదర్శి అలీ ఎహసాన్ మహమ్మద్ ముజాహిద్, బంగ్లా దేష్ నేషనలిస్టు పార్టీ నాయకుడు సలహుద్దీన్ ఖాదర్ చౌదరీని ఢాకా కేంద్ర కారాగారంలో ఉరి తీశారు. 44 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ అవతరణకు ముందు పాకిస్తాన్ […]
తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పాకిస్తాన్ అకృత్యాల వివరాలు తెలిసిన వారికి గత ఆదివారం నాడు మరో ఇద్దరు 1971 నాటి యుద్ధ నేరస్థులను ఉరి తీయడం విన సొంపుగా ఉండవచ్చు. గత ఆదివారం అర్థ రాత్రి 12 గంటల 55 నిమిషాలకు మతతత్వ వాద జమాత్-ఎ-ఇస్లామి ప్రధాన కార్యదర్శి అలీ ఎహసాన్ మహమ్మద్ ముజాహిద్, బంగ్లా దేష్ నేషనలిస్టు పార్టీ నాయకుడు సలహుద్దీన్ ఖాదర్ చౌదరీని ఢాకా కేంద్ర కారాగారంలో ఉరి తీశారు.
44 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ అవతరణకు ముందు పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో అంతర్భాగమైన అప్పటి తూర్పు పాకిస్తాన్ మీద హద్దుమీరిన అకృత్యాలకు పాల్పడింది. లక్షలాది మంది ఆ మారణకాండలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పు పాకిస్తాన్ ప్రజల జాతీయ పోరాటాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్ పాలకులతో కుమ్మక్కైన మతతత్వ పార్టీల వారు ఊహించనలవి కాని మారణ కాండకు పాల్పడ్డారు. విచ్చలవిడిగా హిందువులను, జాతీయవాదులను, అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలను అమానుషమైన రీతిలో ఊచ కోత కోశారు. ప్రస్తుతం జమాత్-ఎ-ఇస్లామీ పార్టీ లో అగ్రనాయకులలో రెండవ స్థానంలో ఉన్న ముజాహిద్ 1971 డిసెంబర్ 16న బంగ్లా జాతీయుల పోరాటం విజయం సాధించడానికి కొద్ది రోజులముందు తూర్పు పాకిస్తాన్ లోని ప్రధాన మేధావులను మట్టుపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లా దేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత బేగం ఖాలీదా జియాకు అత్యంత సన్నిహితుడైన సలహుద్దీన్ చౌదరి హిందువులను హతమార్చడంలో అపరిమితమైన ఉత్సాహం ప్రదర్శించారు.
తూర్పు పాకిస్తాన్ లో స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతున్న కాలంలో సలాహుద్దీన్ చిటగాంగ్ ప్రాంతంలో బ్రిగేడియర్ నని చెప్పుకునే వారు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో పాకిస్తానీ సేనలతో కలిసి ఆయన చిటగాంగ్ లోని రౌజోన్ గ్రామంలో 111 మంది హిందువులను హతమార్చాడు. సామాజిక కార్యకర్త, దాత అయిన నతున్ చంద్ర సిన్హాను అంతమొందించాడు. అవామీ లీగ్ నాయకుడు ముజఫ్ఫర్ అహమద్ ను, ఆయన కొడుకును హతమార్చాడు. తన ఇంటినే స్వాతంత్ర్య పోరాట యోధులను, విమోచనోద్యమానికి మద్దతిచ్చే వారిని చిత్ర హింసలు పెట్టే కేంద్రంగా మార్చుకున్నాడు. సలాహుద్దీన్, ముజాహిద్ కూడా మాజీ మంత్రులే.
ఈ అకృత్యాలను అవామీలాగ్ నాయకత్వంలోని షేక్ హసీనా యుద్ధ నేరాలుగా పరిగణించి యుద్ధ నేరాలను విచారించడానికి బంగ్లా దేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పుల మేరకే ఉరి శిక్షలు అమలైనాయి. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు 2013 డిసెంబర్ 12న ఇస్లామిక్ నాయకుడు అబ్దుల్ ఖాదర్ మొల్లాకు మరణ శిక్ష అమలు చేశారు. యుద్ధ నేరాలకు మరణ శిక్షకు గురైనవారిలో మొల్లాయే మొదటి వ్యక్తి. గత ఏప్రిల్ 11న మహమ్మద్ కమరుజ్జమా అనే మరో నరహంతకుడికి ఉరిశిక్ష అమలైంది. ఆదివారం ఉరి తీసిన ముజాహిద్, సలాహుద్దీన్ కలిపితే ఇంతవరకు నలుగురు యుద్ధ నేరస్థులకు ఉరి శిక్ష అమలైంది. వీళ్లందరూ కొనసాగించిన కిరాతకాలు వర్ణాతీతమైనవి. వెన్నులో వణుకు పుట్టించేవి.
అబ్దుల ఖాదర్ మొల్లా ఒక్కడే 344 మంది పౌరులను హతమార్చాడు. ఆయనకు ముందు జీవిత ఖైదు విధించారు. కాని 2013లో షాబాగ్ స్క్వేర్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. జమాత్-ఎ-ఇస్లామీని నిషేధించాలన్న ఉద్యమంకూడా కొనసాగింది. దీనికి దీటుగానే జమాత్ కూడా ఉద్యమాలు నిర్వహించింది. 2013 సెప్టెంబర్ 17న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణ చేసిన తర్వాత ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీం కోర్టు మొల్లా యావజ్జీవ శిక్షనూ మరణదండనగా మార్చింది. 1971లో తూర్పు పాకిస్తాన్లో జాతీయోద్యమం కొనసాగుతున్నప్పుడు జమాత్-ఎ-ఇస్లామీ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక ముస్లిం రాజ్యాన్ని విభజించడం ఇస్లాం కు విరుద్ధమని ప్రచారం చేసింది.
వివాదాల పరంపర
యుద్ధ నేరాలకు పాల్పడిన వారికి మరణ దండన విధించడంపై సహజంగానే జాతీయంగానూ అంతర్జాతీయంగాను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి విచారణ సవ్యంగా జరగలేదన్న విమర్శలూ వచ్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మరణ దండన విధించడాన్ని ఆక్షేపించాయి. పశ్చిమ దేశాలు బంగ్లా ప్రధాని షేక్ హసీన మీద తీసుకు రావాల్సినంత ఒత్తిడి తీసుకొచ్చింది. ఏ నేరస్థులకైనా మరణ శిక్ష విధించకూడదన్న వాదన సబబైందే. జాతి విద్రోహానికి పాల్పడే వారికి, తీవ్రవాదులకు, మాదక ద్రవ్యాల దొంగ రవాణాకు పాల్పడేవారికి మరణదండన విధించవచ్చునన్న సన్నాయి నొక్కులు కూడా మరణదండన ఎవరికీ విధించకూడదని వాదించే వారి దృష్టిలో ఎంత మాత్రం ఆమోదయోగ్యమైంది కాదు.
హసీన దృఢ చిత్తం
బంగ్లా దేశ్ విమోచన తర్వాత అధికారంలోకి వచ్చిన హసీనా తండ్రి ముజీబుర్ రహమాన్ ను, తల్లి ఫజిలతున్నీసా బేగం నే కాక హసీనా కుటుంబాన్ని దాదాపుగా సైనిక కుట్రకు పాల్పడిన వారు తుడిచి పెట్టారు. ముజీబ్ ను హతమార్చిన సమయంలో హసీనా బంగ్లా దేశ్ లో లేరు. షేక్ హసీనా 1996లో మొట్టమొదటి సారి ప్రధాన మంత్రి అయినా యుద్ధ నేరస్థులకు శిక్ష విధించి తీరాలన్న పట్టుదల మాత్రం 2009లో రెండో సారి ప్రధాన మంత్రి అయిన తర్వాతే పెరిగింది. పశ్చిమ దేశాల ఒత్తిడికి, మానవ హక్కుల సంఘాల విమర్శలకు లొంగకుండా యుద్ధ నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్షలు అమలు చేయడంలో హసీనా అసమానమైన సాహసం ప్రదర్శించినమాట వాస్తవం. తీవ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాడాలన్న పట్టుదల ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఈశాన్య భారతానికి చెందిన తీవ్రవాదులకు బంగ్లా దేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖాలిదా జియా హయాంలో ఆశ్రయం ఇచ్చారు. వారందరినీ హసీనా వదిలించుకున్నారు. భారత్ లో కల్లోలాలు సృష్టించి బంగ్లాదేశ్ లోకి చొరబడే తీవ్రవాదులమీద కూడా హసీనా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఒక వైపున హసీనా తీవ్రవాదం, మతతత్వంపై ఉక్కు పాదం మోపాలని అనుకుంటుండగా సెక్యులర్ వాదులైన బ్లాగర్ల మీద హత్యాకాండ, విదేశీయులను హతమార్చడం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో జపాన్ కు చెందిన కునియో హోశీ, ఇటలీకి చెందిన సీజర్ తవెల్లా ను తీవ్రవాదులు మట్టుపెట్టారు. ఇద్దరు విదేశీయుల హత్యకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
యుద్ధ నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షలు అమలు చేయడం జాతీయవాదులకు, హసీనా నాయకత్వం వహిస్తున్న అవామీ లీగ్ వారికి ఆనందంగానే ఉండొచ్చు. దీనివల్ల మతోన్మాదాన్ని అంతం చేస్తామని అనుకోవడం మాత్రం భ్రమే అవుతుంది. జమాత్ కన్నా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వారికన్నా మతోన్మాదులు అనేక రెట్లు ఎక్కువ కరడు కట్టినవారు. హసీనా అనేక శత్రువర్గాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఉరితీతలు మతోన్మాదాన్ని అరికట్టలేవు. అయితే హసీనా ఎంచుకున్న మార్గాన్ని అనుసరించక తప్పే పరిస్థితి లేదు. అయినా కిరాతకానికి ఉరిశిక్షలు విరుగుడు కావు.
-ఆర్వీ రామారావ్