ముంబయిలో సెల్ఫీ పాయింట్లు… ఓకే...సెల్ఫిష్ పాయింట్లయితేనే తంటా..!
వేళా పాళా, సమయం సందర్భం, సరైన ప్రదేశం…ఇవేమీ అవసరం లేని పని ఒకటి మన ఆధునికులకు వచ్చిపడింది. అది సెల్ఫీలు తీసుకోవడం. సెల్ఫీ పిచ్చితో పర్వతాల ఎత్తులు, లోయల అంచుల్లోకి వెళ్లి మృత్యువుని కొనితెచ్చుకుంటున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదిగో సెల్ఫీపాయింట్… ఇక్కడకొచ్చి మీ ముచ్చట తీర్చుకోండి…ఎక్కడపడితే అక్కడ ఫోన్‌ని మొహం ముందు పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోకండి…అంటున్నారు బ్రిహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి)వారు. కార్పొరేషన్ ఎన్నికలు దాదాపు ఒక సంవత్సరంలో రానుండగా వివిధ పార్టీల కార్పొరేటర్లు […]
వేళా పాళా, సమయం సందర్భం, సరైన ప్రదేశం…ఇవేమీ అవసరం లేని పని ఒకటి మన ఆధునికులకు వచ్చిపడింది. అది సెల్ఫీలు తీసుకోవడం. సెల్ఫీ పిచ్చితో పర్వతాల ఎత్తులు, లోయల అంచుల్లోకి వెళ్లి మృత్యువుని కొనితెచ్చుకుంటున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదిగో సెల్ఫీపాయింట్… ఇక్కడకొచ్చి మీ ముచ్చట తీర్చుకోండి…ఎక్కడపడితే అక్కడ ఫోన్‌ని మొహం ముందు పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోకండి…అంటున్నారు బ్రిహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి)వారు. కార్పొరేషన్ ఎన్నికలు దాదాపు ఒక సంవత్సరంలో రానుండగా వివిధ పార్టీల కార్పొరేటర్లు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చే యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటి యువత జీవితంలో సెల్ఫీలు ఒక భాగమైపోయాయి. అందుకే నా వార్డ్‌లో ఒక సెల్ఫీ పాయింట్ పెట్టాలనుకున్నాను. నా ఆలోచన విజయవంతమైంది. మా ఏరియాలోని సెల్ఫీ పాయింట్‌లో రోజుకి అయిదువందల మంది జనం వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు…అంటున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీకి చెందిన సందీప్ దేశ్ పాండే. నగరంలోని దాదర్స్ శివాజీ పార్కులో ఈయన మొట్టమొదటి సెల్ఫీ పాయింట్‌ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదేబాటలో భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు అమిత్ సాతం జుహులోని పైప్‌లైన్ ప్రాంతంలో మరొక సెల్ఫీ పాయింట్‌ని ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నారు. జుహు లేదా అంధేరీ ప్రాంతాల ప్రజలే కాకుండా నగరంలోని వారంతా వచ్చి సెల్ఫీలు తీసుకునే విధంగా, ముంబయి మొత్తాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని అమిత్ అంటున్నారు. ఐ లవ్ ముంబయి పేరుతో ప్రత్యేకంగా ఒక సెల్ఫీ పాయింట్‌ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నారు.
సందీప్ దేశ్‌పాండే అయితే వానాకాలంలో గొడుగులు, చలికాలంలో సీతాకోక చిలుకల థీములతో సెల్ఫీ పాయింట్‌ని ఆకర్షణీయంగా రూపొందించారు. అయితే చట్టప్రకారం బిఎమ్‌సి నిధులను ఇలాంటి పనులకు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో కార్పొరేటర్లు చొరవతీసుకుని అందుకు వేరే విధంగా నిధులను సమకూరుస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ స్కీమ్‌లో భాగంగా కార్పొరేట్ కంపెనీలు ఈ ఖర్చులను భరించేలా చేస్తున్నారు. చాలామంది కార్పొరేటర్లు ఇప్పుడు ఇదేబాటలో తమ ప్రాంతాల్లో ఫొటోస్పాట్‌ల ఏర్పాట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులకు ఇవి ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతున్నాయి. పైగా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ పని చేయగలుగుతున్నారు. అయితే వీటి మోజులో పడి ప్రధాన సమస్యలు తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లమీద చెత్త లాంటి సమస్యలను పక్కకు నెట్టేయకూడదని ముంబయి యూనివర్శిటీ సోషియాలజీ డిపార్ట్‌మెంట్ అధిపతి పిజి జగదానాద్ అంటున్నారు. కార్పొరేటర్లు మాత్రం తమకున్న నిధుల్లో కొంతభాగం ఇలాంటి పనులకు వెచ్చించే అవకాశాన్ని ఇస్తూ, నిధుల వినియోగం విషయంలో కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం డ్రైనేజీలు బాగుచేసుకుంటూ ఉండాలి, మమ్మల్ని కాస్త సృజనాత్మకంగా, కొత్తదనంతో పనిచేయనివ్వండి అంటున్నారు సందీప్ దేశ్‌పాండే.
ఏది ఏమైనా జన సంక్షేమంకంటే జనాన్ని ఆకర్షించడమే రాజకీయనాయకుల ప్రధాన ధ్యేయం కనుక మున్ముందు దేశమంతటా మనం ఇలాంటి సెల్ఫీ పాయింట్లను చూసే అవకాశం ఉంది. అయితే చేయాల్సిన పను లను వదిలేసి ప్రజాప్రతినిధులు వీటి ఏర్పా ట్లలో మునిగిపోతే మాత్రం, వీటిని సెల్ఫీ పాయింట్లుగా కాక సెల్ఫిష్ పాయింట్లుగానే పిలవాల్సి ఉంటుంది.