ఇక లంగ్ క్యాన్సర్ ప్రమాదం పొగరాయళ్లకే కాదు...మగవారందరికీ..!
ఇప్పటి వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్లు ఆపకుండా తాగేవారికి మాత్రమే వస్తుందనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ వరుసలో మగవారంతా చేరిపోయారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లో మగవారందరికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని, అలాగే మరికొన్నేళ్లకు ఇది ఆడవారిని సైతం మింగేసే అవకాశం ఉందని ఢిల్లీలోని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఈ హెచ్చరిక చేశారు. ఇప్పటికే ఇది భారత్‌లో మగవారికి వచ్చే క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉందని, ముందు […]
ఇప్పటి వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్లు ఆపకుండా తాగేవారికి మాత్రమే వస్తుందనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ వరుసలో మగవారంతా చేరిపోయారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లో మగవారందరికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని, అలాగే మరికొన్నేళ్లకు ఇది ఆడవారిని సైతం మింగేసే అవకాశం ఉందని ఢిల్లీలోని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఈ హెచ్చరిక చేశారు. ఇప్పటికే ఇది భారత్‌లో మగవారికి వచ్చే క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉందని, ముందు ముందు మహిళలనూ కబళిస్తుందని సెంటర్ ఫర్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్, రోబోటిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ డాక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. సరైన నివారణా విధానాలు, చికిత్సా పద్ధతులతో రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొన వచ్చని ఆయన తెలిపారు.
నవంబర్ నెలని ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ అవగాహనా మాసంగా ప్రకటించడంతో వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది ఈ విషయంపై పలురకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చాలామందికి వ్యాధి పట్ల అవగాహన ఉండటం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. నిరంతరం జలుబు, దగ్గు, లాలాజలంతోపాటు తెమడ, రక్తం పడటం, ఊపిరి తీసుకోలేకపోవడం ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలని, ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నపుడు చాలామంది వాతావరణంలో మార్పుగా భావించి గృహ చికిత్సలు, మందుల షాపులో సొంతంగా మందులు తెచ్చివేసుకోవడం లాంటివి చేస్తుంటారని, దీనివలన వ్యాధి బయటపడటం ఆలస్యమవుతుందని, అలాగే సరైన సమయంలో తగిన చికిత్సని అందించలేమని వారు చెబుతున్నారు. చాలా సాధారణమైన కఫము పరీక్ష, ఎక్స్రేలతో వ్యాధిని నిర్దారించవచ్చని, అనుభవం ఉన్న డాక్టర్లు సైతం ఈ లక్షణాలని చాలాసార్లు క్షయగా భావిస్తారని నిపుణులు అంటున్నారు.
సిగరెట్లలో ఉన్న నికోటిన్, హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్ లాగానే తీవ్రస్థాయి వ్యసనమేనని డాక్టర్ అరవింద్ కుమార్ హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉన్న 4వేల రకాల రసాయనాల్లో 50 వరకు క్యాన్సర్ కారకాలే ఉంటాయని ఆయన తెలియజేశారు.
ఛైన్స్మోకింగ్‌తో పాటు వాతావరణ కాలుష్యం, సిగరెట్లు తాగేవారికి పక్కనే ఉండటం, ఆస్బెస్టాస్, మైకా, బొగ్గు, బాక్సైట్ లాంటి గనుల్లోనూ, వాటికి చేరువలోనూ పనిచేయడం… ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చి సెంటర్లో థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి అధిపతిగా ఉన్న డాక్టర్ ఎల్.ఎమ్. డార్లాంగ్ అన్నారు. పిల్లలు, మహిళలు, ముఖ్యంగా ఇంతకుముందు టి బి వచ్చి తగ్గిన మహిళలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనదేశంలో ఎక్కువగా ఉన్నాయని ఈ డాక్టర్ చెబుతున్నారు.
క్రిములు, బ్యాక్టీరియా, కాలుష్యాలు గాలి ద్వారా లోపలికి వెళ్లకుండా ముక్కులో అడ్డుగా ఉండే సన్నని వెంట్రుకలు స్మోకింగ్ వలన హరించుకుపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మన శరీరంలో ఊపిరి తిత్తుల ప్రాధాన్యతని గురించి వివరించిన డాక్టర్ ఖాన్, ఇవి మన రక్తానికి ఆక్సిజన్ని అందిస్తాయని అన్నారు. పొగతాగటం వలన చివరి సిగరెట్ దమ్ము పీల్చిన తరువాత ఎనిమిది గంటల వరకు ఊపిరితిత్తుల నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయి ఉంటుందని, దీనివలన ఆక్సిజన్కి తగిన చోటు అనేది దొరకదని ఆయన చెబుతున్నారు.
స్వచ్ఛమైన గాలిని హరించివేసే కాలుష్యాన్ని మన చుట్టూ నింపుకుంటూ పోతున్నందుకు చెల్లించాల్సిన మూల్యంగా ఈ రానున్న ప్రమాదాలను భావించవచ్చు.