Telugu Global
Cinema & Entertainment

చీకటి రాజ్యం సినిమా రివ్యూ

రేటింగ్‌: 2.75 ప్రేక్షకులకి ఏంకావాలి? సినిమా పుట్టినప్పటినుంచి ఇదే ప్రశ్న. దీనికి సమాధానాన్ని తలపండిన వాళ్ళు కూడా చెప్పలేరు. ప్రేక్షకుడు క్లాస్‌ అయితే అడవిరాముడులాంటి మాస్‌ సినిమా ఎందుకు హిట్టయ్యింది. మాస్‌ అయితే శంకరాభరణం లాంటి సంగీతసినిమా ఎందుకు సూపర్‌ హిట్టయ్యింది. క్లాస్‌, మాస్‌, అన్నీ ఎవరికి వాళ్ళు ఇచ్చుకునే నిర్వచనాలు మాత్రమే. ఒకరకంగా ఈ వర్గీకరణ ఒక భ్రాంతి. ప్రేక్షకుడికి ఏదోకావాలి. రెండు గంటలసేపు అతను ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి. ఈ మంత్రదండం ఎక్కడుందో అర్థంకాక […]

చీకటి రాజ్యం సినిమా రివ్యూ
X

రేటింగ్‌: 2.75

ప్రేక్షకులకి ఏంకావాలి? సినిమా పుట్టినప్పటినుంచి ఇదే ప్రశ్న. దీనికి సమాధానాన్ని తలపండిన వాళ్ళు కూడా చెప్పలేరు. ప్రేక్షకుడు క్లాస్‌ అయితే అడవిరాముడులాంటి మాస్‌ సినిమా ఎందుకు హిట్టయ్యింది. మాస్‌ అయితే శంకరాభరణం లాంటి సంగీతసినిమా ఎందుకు సూపర్‌ హిట్టయ్యింది. క్లాస్‌, మాస్‌, అన్నీ ఎవరికి వాళ్ళు ఇచ్చుకునే నిర్వచనాలు మాత్రమే. ఒకరకంగా ఈ వర్గీకరణ ఒక భ్రాంతి. ప్రేక్షకుడికి ఏదోకావాలి. రెండు గంటలసేపు అతను ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి. ఈ మంత్రదండం ఎక్కడుందో అర్థంకాక దర్శక నిర్మాతలు తలలు బాదుకుంటున్నారు.

ఆడియన్స్‌ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు మారిపోయారు అంటూవుంటారు. ఇదికూడా నిజం కాదు. ఎందుకంటే తలాతోకాలేని రాజుగారి గదిలాంటి సినిమాని సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌, హాలివుడ్‌ని మరిపించే స్థాయిలో తీసిన కంచెకి అతికష్టంమీద పాస్‌ మార్క్‌లు ఎందుకు వేస్తారు?

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే కొత్తదనాన్ని ఇష్టపడే కమలహాసన్‌ చీకటిరాజ్యం అనే క్రైమ్‌ కామెడిని తీసాడు. వెరైటీగా సినిమాలు తీసే ఆయన బోలెడన్నిసార్లు చేతులు కాల్చుకున్నాడు. అయినా మళ్ళీ తీసాడు.

ఈ సినిమాలో రొమాన్స్‌లేదు. పెద్దగా ఫైట్లు లేవు. హీరోయిజం లేదు, బ్రహ్మానందం చెంపదెబ్బల కామెడీ లేదు. ఉన్నదల్లా చిన్న కథ. నార్కొటిక్‌ అధికారిగా పనిచేసే హీరో ఒక నేరస్తుడి నుంచి డ్రగ్స్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకుంటాడు. అతని కొడుకు పదేళ్ళవాడిని ప్రకాష్‌రాజ్‌ కిడ్నాప్‌ చేసి ఆ బ్యాగ్‌ ఇస్తే వదులుతానని అంటాడు. ఆ బ్యాగ్‌తో ప్రకాష్‌రాజ్‌ నైట్‌క్లబ్‌కి హీరో వెళతాడు. అతన్ని ఫాలో అవుతూ ఇంకో పోలీస్‌ అధికారి త్రిష, మరో ఇన్‌స్పెక్టర్‌ అదే క్లబ్‌కి వెళతారు. అక్కడ ఆ బ్యాగ్‌ని టాయిలెట్‌లో హీరో దాస్తాడు. ఆ తరువాత అది మిస్‌ అవుతుంది. కొడుకుని ఎలా విడిపించుకున్నాడన్నది మిగిలిన కథ.

చాలా సినిమాలకిలాగానే ఇది కూడా సెకెండాఫ్‌లో చేతులెత్తేసింది. ఫస్టాఫ్‌లో ఉన్నంత బిగువుగా మిగతాకూడా ఉండి ఉంటే ఒక వెరైటీ సినిమా చూసిన ఫీలింగ్‌ దక్కేది. అది దక్కకుండా కథని క్లబ్‌కిచెన్‌లో దర్శకుడు ఊరగాయ వేసేశాడు.

త్రిషని పోలీస్‌ అధికారిగా చూడడం కొత్తగా ఉంది. కాస్త చిక్కినట్టు అనిపించినా కఠినమైన పోలీస్‌ అధికారిగా ఫర్‌ఫార్మెన్స్‌ చాలా బావుంది. ప్రకాష్‌రాజ్‌కి విలన్‌ పాత్రలు కొట్టిన పిండి. ఆయన బాగా నటించకపోతేనే ఆశ్చర్యం.

సినిమాలో ఏ పాత్రకూడా నవ్వదు. అందరూ సీరియస్‌గా ఉంటారు. కానీ నవ్విస్తూ ఉంటారు. ఈ టైప్‌ కామెడీ కమల్‌ హాసన్‌ సినిమాల్లో బాగా పండుతుంది. ఫస్టాఫ్‌ కథ క్లబ్‌లో నడిచి, సెకెండాఫ్‌ క్లబ్‌ బయటకు కథ వచ్చుంటే ఆసక్తికరంగా ఉండేది. హీరో ఎలాగూ కొడుకుని విడిపించుకుంటాడని అందరికి తెలుసు. కాసేపు టాయిలెట్‌లో, కిచెన్‌లో, బార్‌లో ఇలా అక్కడక్కడే గిరికీలు కొట్టడం వల్ల ఇంటర్వెల్‌ తరువాత బోర్‌ మొదలవుతుంది.

కమల్‌హాసన్‌ సినిమాల్లో రెండు సమస్యలుంటాయి. కథకి అవసరమున్నా లేకపోయినా ఎవర్నో ఒకర్ని ముద్దుపెట్టుకోకపోతే ఆయనకి తోచదు. ఈ సినిమాలో మధుశాలినికి ఆ భాగ్యం దక్కింది. ఇక రెండోది ఆయన గొంతుమీద ఆయనకున్న నమ్మకం. డైలాగులు చెబితే బానే ఉంటుంది కానీ అక్కడితో ఆగడు. ఒక పాటపాడుతాడు.

ఈ సినిమాలో పాటలు లేకపోవడం రిలీఫ్‌గా పీలవుతూ మనం బయటకి వస్తూవుండగా రోలింగ్‌ టైటిల్స్‌లో కర్ణకఠోరంగా కమల్‌ ఒక పాట మొదలుపెడతాడు. ఆ తరువాత మనం హాల్లోంచి వేగంగా వచ్చే ప్రయత్నం చేస్తాం. వెరైటీ సబ్జెక్టులు కోరుకునేవారు ఈ సినిమాని ఒకసారి ట్రై చేయవచ్చు. నిడివి రెండు గంటలే.

ఇదో ఇంగ్లీస్‌ సినిమాకి అనుకరణ, ఎక్కన్నుంచో కాపీ కొట్టారో కూడా చెప్పారు. అయితే ఎవరికీ ఏమీ చెప్పకుండానే మనవాళ్ళు చాలా ఏళ్ళుగా ఇలాంటి కిడ్నాప్‌ సినిమాలు తీస్తూనేవున్నారు. కానీ కమల్‌ నిజాయితీగా చెప్పాడు. ఒకరకంగా మంచి కాపీలాంటి సినిమా ఇది.

– జిఆర్‌. మహర్షి

First Published:  20 Nov 2015 7:33 AM IST
Next Story