వరంగల్ ఎన్నికల్లో వైసీపితో ఏ పార్టీకి ఎక్కువ నష్టం ?
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో పార్టీలన్నీ ప్రచారంలో తమ శక్తిమేరకు చెమటోడుస్తున్నాయి. అభ్యర్థులు, పార్టీ నేతలు, అధినేతల విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారం, జనసమీకరణపై బాగా దృష్టి పెట్టారు. అందుకే, వరంగల్ ఉప-ఎన్నికల సభలకు జనాలు కూడా భారీగా హాజరవుతున్నారు. రెండేళ్లుగా అసలు ఉనికిలోనే లేదనుకున్న వైసీపీ సభలకు భారీగా జనాలు హాజరవుతుండటం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. […]
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో పార్టీలన్నీ ప్రచారంలో తమ శక్తిమేరకు చెమటోడుస్తున్నాయి. అభ్యర్థులు, పార్టీ నేతలు, అధినేతల విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారం, జనసమీకరణపై బాగా దృష్టి పెట్టారు. అందుకే, వరంగల్ ఉప-ఎన్నికల సభలకు జనాలు కూడా భారీగా హాజరవుతున్నారు. రెండేళ్లుగా అసలు ఉనికిలోనే లేదనుకున్న వైసీపీ సభలకు భారీగా జనాలు హాజరవుతుండటం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ వైసీపీ సభలను జనం ఈ స్థాయిలో ఆదరించడం మిగిలిన పార్టీల్లో కలవరం రేపుతోంది.
జగన్ సభలపైనే..!
తొలుత ఈ ఉప-ఎన్నిక కాంగ్రెస్- టీఆర్ ఎస్ మధ్యే ఉంటుందనుకున్నారంతా. కానీ, బిహార్ ఎన్నికల్లో ఓటమితో ఎలాగైనా ఇక్కడ గెలిచి తీరాలని బీజేపీ-టీడీపీ మిత్రద్వయం రాత్రి, పగలు చెమటోడుస్తోంది. దీంతో కేడర్ కూడా ఉత్సాహంగానే పనిచేస్తోంది. పొరు త్రిముఖంగా మారుతోంది..అనుకునేలోపు.. సీన్ మారిపోయింది. వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున రోజా సభకు జనం ఓ మోస్తరుగా వచ్చారు. అయితే, జగన్ సభలకు మాత్రం ఇంత జనాదరణను మిగిలిన పార్టీలు ఊహించలేదు. ఏడాదిన్నరగా టీఆర్ ఎస్ తో సన్నిహితంగా మెలిగిన వైసీపీ ఇప్పుడు ఎదురుతిరిగింది. ప్రభుత్వంపై మాటల దాడి ప్రారంభించింది.
ఎందుకు భయం!
ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? లేదా అన్న విషయం పక్కనబెడితే… ఓట్ల చీలికపై అప్పుడే టీఆర్ ఎస్, కాంగ్రెస్, టీడీపీలో అంతర్మథనం మొదలైంది. జగన్ సభలకు జనం భారీగా హాజరవుతుండటమే వారి ఆందోళనకు కారణం. నల్లా సూర్యప్రకాశ్ పెద్దగా పోటీ ఇవ్వకపోయినా.. జగన్ ప్రచారం కచ్చితంగా ఓట్లను చీలుస్తుందని భయపడుతున్నారు. ఖాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో మైనార్టీలు అధికం. వీరి ఓట్లు వైసీపీ ఎక్కడ చీలుస్తుందోనన్నదే వారి ఆందోళనకు కారణం. ఇటీవల జిల్లాలో షర్మిల చేసిన పాదయాత్ర, ఆ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో జగన్ చేసిన పరామర్శలు పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాయి. అదే సమయంలో ఉప ఎన్నిక రావడం వైసీపీ కేడర్ కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీకి డిపాజిట్‌కూడా రాదు అనుకున్న బిజేపీ, టీడీపీ పార్టీలకు ఇప్పుడు వైసీపీ సత్తా తెలిసివచ్చింది. గెలుపుఎలాగూ టీఆర్‌ఎస్‌దే. రెండోస్థానం వైసీపీకి దక్కుతుందని బీజేపీ, టీడీపీలు భయపడుతున్నాయి.