భారత్‌లో ఉన్నది భిన్నత్వమా.. సంక్లిష్టతా..?
ఇప్పటివరకు మనం భారతదేశ సంస్కృతి గురించి చెప్పుకోవాలంటే భిన్నత్వంతో ఏకత్వం అనే మాటని ఘనంగా వాడుతుంటాం. అయితే మనం భిన్నత్వంగా చెబుతున్నా బయటి ప్రపంచానికి అది ఎలా కనబడుతోంది అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇటీవల సమాధానం చెప్పారు పద్మాలక్ష్మి. వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీ మాజీ భార్య ఈమె. మోడల్, నటి, నిర్మాత, టివి హోస్ట్, వంటల పుస్తకాల రచయిత్రి… ఇలా పలురకాలుగా అమెరికాలో విజయవంతంగా తన కెరీర్‌లో కొనసాగుతున్నారు. చెన్నైలోని ఇరుకు వీధుల […]
ఇప్పటివరకు మనం భారతదేశ సంస్కృతి గురించి చెప్పుకోవాలంటే భిన్నత్వంతో ఏకత్వం అనే మాటని ఘనంగా వాడుతుంటాం. అయితే మనం భిన్నత్వంగా చెబుతున్నా బయటి ప్రపంచానికి అది ఎలా కనబడుతోంది అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇటీవల సమాధానం చెప్పారు పద్మాలక్ష్మి. వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీ మాజీ భార్య ఈమె. మోడల్, నటి, నిర్మాత, టివి హోస్ట్, వంటల పుస్తకాల రచయిత్రి… ఇలా పలురకాలుగా అమెరికాలో విజయవంతంగా తన కెరీర్‌లో కొనసాగుతున్నారు. చెన్నైలోని ఇరుకు వీధుల నుండి హాలివుడ్ వరకు స్వయం కృషితో వెళ్లిన పద్మాలక్ష్మి, వంటలకు సంబంధించిన కార్యక్రమాలకు టి వి హోస్ట్‌గా గణనీయమైన పేరు తెచ్చుకున్నారు.
కాసేపు పద్మాలక్ష్మి గురించి పక్కన పెట్టి, ఆమె భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యానం గురించి ఆలోచిద్దాం. పాశ్చాత్యదేశాలకు భారత్ సంక్లిష్టమైన దేశంగా కనబడుతుందని అన్నారు. ఆమె చెప్పినదాంట్లో నిజం ఉంది. మనదేశం ఒక ఇమేజ్‌లో ఒదిగిపోకుండా, అర్థం చేసుకోవాలనుకున్నవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటుంది…సందేహాలు రగిలిస్తూనే ఉంటుంది… అందుకు ఉదాహరణలుగా మన కళ్లముందు అనేక అంశాలు కనబడతాయి.
ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఆస్తిపరులైన బిలియనీర్లు ఉన్నారు. అంతేస్థాయిలో ఫుట్‌పాత్‌మీద బతుకులు వెళ్లదీసే పేదలూ ఉన్నారు. అలాగే ఒక పక్క మహిళలకు అన్ని అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది…. వారి చదువు, ఉద్యోగావకాశాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతున్న దాఖలాలు ఎన్నో కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. మరొకపక్క మహిళల అణచివేత, లింగవివక్ష, బాల్యవివాహాలు లాంటివీ ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ మీద బ్యాన్ విధించినపుడు మనదేశంలో మహిళల పరిస్థితిలో ఎన్ని విభిన్న కోణాలున్నాయో ప్రపంచానికి తాజాగా అర్థమైంది. ఒక పక్క యత్రనార్యాస్తు పూజ్యంతే…అంటూ మరొకపక్క గర్భంలో ఉన్న ఆడశిశువులను హతమారుస్తున్న పరిస్థితి.
ప్రపంచంలో ఏ మూల దేశంలో అయినా భారతీయుడు ఉంటాడు. అమెరికా అధ్యక్షుడే మన భారతీయ విద్యార్థులను చూసి భయపడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే మరొకవైపు వీధి పిల్లలు, బాలకార్మికులు రికార్డు స్థాయిలో ఉంటారు. ఇటీవల విదేశాలనుండి ఇంటికి తల్లిదండ్రులకు డబ్బు పంపుతున్నవారిలో మనవారే ముందున్నారని అధ్యనాల్లో తేలింది. కుటుంబ బాధ్యతని నిర్వర్తించడంలో మనం ముందే ఉంటామనేదానికి రుజువులు అవి. మరొకపక్క వృద్ధులను గౌరవించని, తల్లిదండ్రులను ఆదరించని నగరాల్లో మన భారతదేశ సిటీలు ముందు వరుసలో ఉన్నాయి.
అంతేకాదు, టెక్నాలజీ ఒకవైపు, మతాలు, పూజలు, వ్రతాలు మరొకవైపు చెట్టపట్టాలేసుకుని నడిచేవైనం మన దేశంలోనే ఎక్కువగా ఉంది. మనదేశంనుండి ఒక సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఇఓగా ప్రపంచం ముందు సగర్వంగా ఇండియాని నిలబెట్టి భారతరూపు రేఖలకు ఒక ఇమేజ్ కల్పిస్తారు..మరొకవైపు పెద్ద ఎత్తున విదేశీయులను మన స్వామీజీలు ఆకర్షిస్తూ…భారత్ అంటే ఏమిటి అనే ప్రశ్నను మరింత సంక్లిష్టం చేస్తారు….
ఒకవైపు ఇక్కడి కళలు కల్చర్, చేతివృత్తులు ఇవన్నీ ప్రపంచ మార్కెట్ వేదికపై అహో అనిపిస్తున్నాయి అని చెప్పుకుంటాం. మన కళా నైపుణ్యాలకు ఇతర దేశాలు బ్రహ్మరథం పడుతున్నాయి అని రాస్తుంటాం. మరొకవైపు మన చేనేత కళాకారులకు చేతినిండా పని ఉండదు. కడుపునిండా తిండి ఉండదు. ఇతరదేశాల నుండి వస్తున్న వస్తువుల మార్కెట్‌ని మన కళా నైపుణ్యాలు దిగులు మొహం వేసుకుని చూస్తుంటాయి.
మన భారతీయ స్త్రీ ఆరుగజాల చీరని విడిచి ఉండలేదు…అని మనవాళ్లు బాకా ఊదుతుంటారు. మరోవైపు ప్రపంచఫ్యాషన్ మేగజైన్ల మీద మనవాళ్లే టాప్‌లెస్‌గా పోజులు ఇస్తుంటారు.
నిజంగా పద్మాలక్ష్మి అన్నట్టుగా దీనంతటినీ భిన్నత్వంగా భావించలేము. ఇది నిజంగానే ఒక సంక్లిష్టత. భారత్‌లో వేగంగా మారుతున్న సమాజం ఉంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న మధ్యతరగతి వర్గం పెద్ద పరిమాణంలో ఉంది. ఇక్కడి వేగమే మనల్ని ప్రపంచానికి వింతగొలిపేలా చూపిస్తోంది. ఒకవైపు సంపాదనపై బలీయమైన కోరిక…ఎదగాలనే తాపత్రయం. అందుకు మార్పులను అంగీకరించాల్సిన స్థితి, మరొకవైపు సంప్రదాయాల పేరుతో రాజ్యమేలుతున్న ఛాందస భావాలను వదిలించుకోలేని బలహీనత…ఈ రెండింటి మధ్య మనకిది సంధికాలమని చెప్పాలి.
డబ్బు జీవితాన్ని విశాలం చేస్తుంది…అంటే సౌకర్యాలు విలాసాలు ప్రయాణాలు వస్తువులు లాంటివి పెరుగుతాయి…కానీ మనసులు విశాలం కావు…ఆలోచనల వైశాల్యం పెరగదు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. మన ఆడపిల్లలు కట్నమిచ్చి అమెరికా అబ్బాయిలకు ఇల్లాళ్లవుతారు. అక్కడ కూడా వరకట్నపు జాడ్యానికి బలవుతుంటారు. ఇలాంటి సంక్లిష్టతలు మనకే కొరుకుడు పడటం లేదు…ఇక విదేశాలకు మనం అలా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే పద్మాలక్ష్మి చేసిన వ్యాఖ్యానం అర్ధవంతమైనదిగానే భావించాలి.
ఇండియాకి మంచి ఇమేజ్ లేదు, చెడు ఇమేజ్ లేదు…ఉన్నదంతా చాలా కాంప్లికేటెడ్ ఇమేజే అన్నారామె. మంచి చెడు రెండు విషయాల్లోనూ భారత్‌లో అసామాన్యం అనిపించదగిన అంశాలున్నాయని ఆమె అన్నారు. పాశ్చాత్యదేశాలకు ఇండియా ఒక అద్భుతంలా, అంతుచిక్కని రహస్యంలా కనబడుతుందని ఆమె అభివర్ణించారు. అక్కడి నుండి భారత్ రావడానికి వారు చాలా ఇష్టపడతారని, ఇక్కడి ఫుడ్, చేతి వృత్తుల కళా నైపుణ్యాలు, తరతరాలనాటి పాత సంప్రదాయాలు ఇవన్నీ వారిని అబ్బురపరుస్తుంటాయని పద్మాలక్ష్మి అన్నారు.
మొత్తానికి మనవాళ్లు జీవితాన్నినిర్మించుకుందామని అక్కడకు వెళుతుంటే, అక్కడివారు చాలామంది జీవితాన్ని పునర్నిర్మించుకునేందుకు ఇక్కడికివస్తున్నారు…ఇదీ గొప్ప సంక్లిష్టతే!!!
-వడ్లమూడి దుర్గాంబ