Telugu Global
Others

ఒప్పించడం అంటే ఏమిటి పవన్ ?

రాజకీయాల్లో ఒక్కోసారి భారీ అంచనాలు కూడా ప్రమాదకరమే. పవన్ కల్యాణ్‌ను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. జనసేన పెట్టడానికి ముందు ”నేను సామాన్యుడినే కానీ ప్రజల కోసం ప్రశ్నిస్తా.. పోరాడుతా” అని చెప్పిన పవన్ ఇప్పుడు రూట్ మార్చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీస్తారా అంటే తనకు అంత శక్తి లేదంటున్నారు. ఎన్నికల సమయంలో మోదీ, మీరు కలిసే ప్రచారం చేశారు కదా…ప్రధాని ఇచ్చిన హామీలను ఆయన్ను కలిసి గుర్తు చేయవచ్చు కదా అన్న […]

ఒప్పించడం అంటే ఏమిటి పవన్ ?
X

రాజకీయాల్లో ఒక్కోసారి భారీ అంచనాలు కూడా ప్రమాదకరమే. పవన్ కల్యాణ్‌ను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. జనసేన పెట్టడానికి ముందు ”నేను సామాన్యుడినే కానీ ప్రజల కోసం ప్రశ్నిస్తా.. పోరాడుతా” అని చెప్పిన పవన్ ఇప్పుడు రూట్ మార్చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీస్తారా అంటే తనకు అంత శక్తి లేదంటున్నారు. ఎన్నికల సమయంలో మోదీ, మీరు కలిసే ప్రచారం చేశారు కదా…ప్రధాని ఇచ్చిన హామీలను ఆయన్ను కలిసి గుర్తు చేయవచ్చు కదా అన్న ప్రశ్నకూ అదే సమాధానం. ”నాకు అంతస్థాయి లేదు. నాది ఎమ్మెల్యే కన్నా తక్కువ స్థాయి” అని తేల్చేశారు.

అంతేనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, బంద్‌లు, ఆందోళనలు చేస్తే ఉపయోగం లేదని… కేంద్రం వాటిని పట్టించుకోదంటూ సెలవిచ్చారు. అంటే పోరాడేతత్వం వేస్ట్ అని తేల్చేశారు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వారిని కూడా నిరుత్సాహపరిచారు. ఇదేనా పవన్… పాలిటిక్స్. ప్రశ్నిస్తానని చెప్పి.. ఇప్పుడు నాకు అంత పవర్ లేదంటే ఎలా?. ప్రజానాయకులెప్పుడు పవర్ వచ్చిన తర్వాత ప్రశ్నించరు. ప్రజల పక్షాన పోరాడి. ప్రశ్నించి, ఉద్యమాలు చేసి జనం మన్ననలు పొంది అధికారంలోకి వస్తారు.

విజయవాడలో చంద్రబాబుకు కలవకముందు వరకు రాజధాని భూసేకరణకు పవన్ వ్యతిరేకమన్న భావన ఉండేది. కానీ చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ మాట్లాడిన తీరు చూస్తే రాజధాని రైతులకు హ్యాండిచ్చినట్టే కనిపిస్తోంది. మెజారిటీ రైతులు భూములిచ్చారు కాబట్టి మిగిలిన వారిని కూడా ఒప్పించి తీసుకోవాలని తీర్పు చెప్పారు. ఒప్పించి తీసుకోవడం అంటే ఏంటో ప్రభుత్వానికి బాగా తెలుసు. బలవంతంగానే భూములు లాక్కుని ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా మేనేజ్‌ చేయడమే చంద్రబాబు ప్రభుత్వం దృష్టిలో ఒప్పించడం అంటే. బాక్సైట్ విషయంలోనూ పవన్‌కు క్లారిటీ లేదని స్పష్టంగా తెలిసిపోయింది. బాక్సైట్ జీవో రద్దుకు డిమాండ్ చేయాల్సింది పోయి… గిరిజనులతో చర్చించి వారి ఆమోదంతోనే ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పారంటూ ప్రకటించారు. అలా చెప్పడానికి పవన్ టీడీపీ అధికారప్రతినిధి కాదుకదా?!.

First Published:  13 Nov 2015 12:05 AM GMT
Next Story